ఆ రెండు పంటల వైపే రైతాంగం చూపు
మద్దతు ప్రోత్సాహకాల్లేక ఇతర పంటలపై అనాసక్తి
పత్తి, వరి కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలతో పంటల మార్పిడిపై చర్చ
దానిపై ఇప్పటికే సర్కార్‌కు రైతు కమిషన్ నివేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అయితే వరి…లేదంటే పత్తి అన్నట్టుగా ఆ రెండు పంటలవైపే తెలంగాణ రైతాంగం చూస్తున్నది. మిగతా పంటలకు మద్దతు ధరలు దక్కకపోవడం, ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాలతో ఆ రెండు పంటల వైపే రైతన్నలు మొగ్గుచూపుతున్నారు. సారవంతమైన నేలల్లో కూడా వర్షాధారం ఆధారంగా ఏటా ఒకే పంటకు పరిమితం అవుతున్నారు. దీనివల్ల దిగుబడి రాక, సరైన లాభాల్లేక అన్నదాతకు ఏటేటా సాగు భారం పెరిగిపోతున్నది. ప్రస్తుతం తెలంగాణలో అధికంగా పండించే వరి, పత్తి పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం షరతులు విధిస్తున్న నేపథ్యంలో పంటల మార్పిడి అనే అంశం చర్చనీయాంశం అవుతున్నది. తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ పంటల మార్పిడిపై రాష్ట్ర సర్కార్‌కు పలు సూచనలతో నివేదికను అందజేసింది. మరింత అధ్యయనం, సమ్రగ ప్రణాళిక అవసరమనే పేరుతో రాష్ట్ర సర్కారు మరో ఏడాదికి పొడిగించింది.
పుష్కర కాలంలో సాగు రెండింతలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణలో 49 లక్షల 28 వేల ఎకరాల్లో వరి పంట సాగవ్వగా ప్రస్తుతం కోటీ 27 లక్షల 3 వేల ఎకరాలకు విస్తరించింది. పత్తి పంట 54 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ రెండు పంటల సాగు రాష్ట్రంలో క్రమంగా పెరిగిపోతుండగా మిగతా పంటల సాగు అంతే వేగంగా పడిపోతున్నది. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరల సాగు విపరీతంగా ఉండేది. రాష్ట్ర అవసరాలకు సరిపోను కూరగాయలు మిగతా ప్రాతాలకు ఎగుమతి చేసిన రోజులు కూడా ఉన్నాయి. కూరగాయ పంటల సాగు ఐదున్నర లక్షల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు పడిపోయింది. దీంతో ఆకుకూరలు, కూరగాయలను కూడా కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఒకప్పుడు నల్లగొండ జిల్లా బత్తాయి తోటలకు ప్రసిద్ధి. ఆసియాలోనే పేరుగాంచింది. సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేకపోవడం, పంట దిగుబడి బాగా వచ్చిన సమయంలో రేటు లేకపోవడం, సర్కారు మద్దతు దొరక బత్తాయి తోటల స్థానాన్ని వరి, పత్తి పంటలు ఆక్రమించేశాయి. రాష్ట్రంలో 2013-14లో 9,11,200 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు కాగా ఇప్పుడవి సగానికి పడిపోయాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకుపైగా బత్తాయి సాగు చేస్తే ఇప్పుడది 50 వేల ఎకరాలకు తగ్గిపోయింది. రాష్ట్రంలో పూల తోటల సాగు కేవలం ఆరు వేల ఎకరాలకు పడిపోయిన దుస్థితి నెలకొంది. జొన్న, పొద్దుతిరుగుడు, కుసుమ, పొగాకు వంటి పంటలు వేల ఎకరాలకే పరిమితం అయ్యాయి. జొన్న సాగు పశుగ్రాసానికే పరిమితం అవుతున్న దుస్థితి.
మోనో క్రాంపింగ్ అన్నదాతలకే నష్టం…
తెలంగాణలో పత్తి, వరి వంటి మోనో క్రాపింగ్ పంటలతో నేల సారం తగ్గిపోతున్నది. రైతు కమిషన్ కార్యాలయం సమీపంలో వేసవిలో అదనపు అదాయం కోసం సోడా బండి పెట్టుకున్న నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన రైతును పలుకరిస్తే ‘ మాది నల్లరేగడి భూమి. 20 ఏండ్ల నుంచి పత్తి పంటనే సాగు చేస్తున్నాం. ఆ పంటేస్తేనే నాలుగు పైసలు మిగులుతున్నయి. మినుములు, కందులు, పొగాకు, పొద్దుతిరుగుడు, దనియాలు మస్తు పండేవి. పెద్దగా లాభం లేక మా దిక్కు అందరూ పత్తి పంటనే వేస్తున్నారు’ అని రైతు చెప్పుకొచ్చాడు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని అరకొర తప్ప మిగతా రైతులందరూ పత్తి, వరి పంటల సాగుకే అలవాటు పడిపోయారు. వర్షాధార సాగు పేరుతో ఒకే పంటకు పరిమితం అవుతూ నష్టాలను చవిచూస్తున్నారు. కాలం కాకపోతే లక్షల రూపాయలను నష్టపోతున్నారు. మరోవైపు దిగుబడి వస్తలేదనే నెపంతో ఏటేటా ఎరువుల వాడకాన్ని పెంచుకుంటూ పోతున్నారు. దీంతో భూముల్లో సారం తగ్గిపోతున్నది.
రైతు కమిషన్ సూచనలివే…
రాష్ట్రంలో పంటల మార్పిడి అత్యావశ్యకం అని రైతు కమిషన్ తన నివేదికలో రాష్ట్ర సర్కారుకు నివేదించింది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల తోటల వంటి అధిక ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేందుకు మద్దతు ధర, మార్కెట్ సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించడానికి సమగ్ర విధానం అవసరమని సూచించింది. రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట జిల్లాలను కూరగాయల జోన్‌గా ప్రకటించిన వాటి సాగును ప్రోత్సహిస్తే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మిర్చి, నిజామాబాద్ జిల్లాలో పసుపు, మెట్ట ప్రాంతాల్లో చిరు, తృణ ధాన్యాల సాగును ప్రోత్సహించాలని సర్కారుకు నివేదిక అందించింది. ఇవే కాకుండా రైతులకు సరైన ప్రోత్సహకాలు అందించడంతో పాటు కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు చేన్ల చుట్టూ సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు నాబార్డు ద్వారా రైతులకు సహాయం అందించాలనీ, ఒకే పంటకు పరిమితం కాకుండా ఏడాదిలో రెండు, మూడు పంటలు సాగు చేసుకులా రైతులకు అవగాహన కల్పంచాలని సూచించింది.
కమిషన్ ప్రస్తావించిన అంశాలివే
హైదరాబాద్ చుట్టూతా 50 కిలోమీటర్ల వరకు ఉన్న రియల్ బూమ్‌తో సారవంతమైన భూములు పడావుబడ్డాయి. మరోవైపు పల్లెల్లో కోతుల బెడద బాగా పెరిగిపోయింది. ప్రత్యామ్నాయ పంటలకు తగిన మార్కెట్ సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. నిజామాబాద్‌లో పసుపు బోర్డు పేరుకే పరిమితం కావడం, నల్లగొండ జిల్లాలో బత్తాయి ప్రాసెసింగ్, నిల్వలకు అవకాశం లేకపోవడం, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సహకాలు, కనీస మద్దతు ధరలు లభించకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహాన్ని స్వాగతించాలి. ఇప్పుడు వరి, పత్తి పంటలకు మద్దతు ధరతో పాటు కొనుగోలు గ్యారంటీ ఉంది. అందుకే ఆ పంటల వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి తరుణంలో కూరగాయలు, పప్పుదినుసులు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలతో పాటు బోనస్ ఇవ్వాలి. కేరళ రాష్ట్రంలో మాదిరిగా కూరగాయ పంటలకు మద్దతు ధర నిర్ణయించాలి. మార్కెట్లో దాని కంటే రేట్లు తక్కువ ఉంటే రైతులకు ప్రభుత్వమే మిగతా ధరను కట్టివ్వాలి. రైతులకు అలాంటి ప్రోత్సాహకాలిస్తేనే పంటల మార్పిడి వైపు మొగ్గుచూపుతారు.
టి.సాగర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి



