సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం. డి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి
పేద ప్రజలకు, కష్టజీవులకు అండగా నిలిచి వారి వైపు పోరాడిన గొప్ప వ్యక్తి, ప్రజలకు కామ్రేడ్ కొలుపుల మల్లేశం చేసిన సేవలు మరువలేమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని హనుమాన్ వాడలో భూ ఉద్యమ నిర్మాత, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్ కొలుపుల మల్లేశం 36వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. ముందుగా సీపీఐ(ఎం) హనుమాన్ వాడ శాఖ కార్యదర్శి బర్ల వెంకటేశం పార్టీ ఎర్రజెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మల్లేశం స్మారక స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ.. దోపిడీ, కుల వివక్షపై ఆయన చేసిన పోరాటాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి” అని కొనియాడారు. అదేవిధంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ పట్టణంలోని “గార్లపాటి జగ్గయ్య నగర్‌లో అత్యంత నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు మల్లేశం భూ పోరాటం చేసిన యోధుడు అన్నారు. దాని ఫలితంగానే నేడు వందలాది కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నాయి. భువనగిరిలో సీపీఐ(ఎం) ఏర్పాటులో ఆయన పాత్ర కీలకం” అని గుర్తు చేశారు.
సామాజిక సమానత్వం కోసం, సమాజంలో కుల వివక్ష, అసమానతలు పోవడానికి మల్లేశం నిరంతరం కృషి చేశారన్నారు. అణగారిన వర్గాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడంలో ఆయన చొరవ మరువలేని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్ల ముత్యాలు, సీపీఐ(ఎం) నాయకులు కొలుపుల విజయకుమార్, కొలుపుల వివేకానంద, వనం రాజు, వడ్డే కృష్ణ, పడిగం కిషన్, నరాల నరసింహ, ఆరే విజయకుమార్, బాండ్ అజయ్ సింగ్, కొత్త లలిత, కొలుపుల సోహన్, దయాకర్ పాల్గొని మల్లేశంకు నివాళులర్పించారు.



