Monday, July 27, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ విస్తరణలో డిజిటల్ సేవలు

వ్యవసాయ విస్తరణలో డిజిటల్ సేవలు

- Advertisement -

– రైతు నేస్తం వందో ఎపిసోడ్ వేడుకలు 
– అశ్వారావుపేటలో హాజరుకానున్న ఎమ్మెల్యే, కలెక్టర్
– ఎర్పాట్లలో వ్యవసాయ శాఖ అధికారులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ సేవలను డిజిటల్ వేదికల ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమం మంగళవారం (జూలై 28) నాటికి వందో ఎపిసోడ్‌ ను చేరుకోనుంది. ఈ సందర్భంగా అశ్వారావుపేట రైతు వేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరుకానున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి రైతు భరోసా ద్వారా ప్రతి సీజన్‌ కు ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి సాయం అందించడంతో పాటు, సహజ లేదా ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పిస్తోంది.ఇదే సమయంలో రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటల్ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోంది.

ఆ దిశగా ప్రారంభించిన రైతు నేస్తం కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రగతిశీల రైతులు ప్రత్యక్షంగా పాల్గొని సాగు విధానాలు, పంటల యాజమాన్యం, నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం, సస్యరక్షణ, ఖర్చు తగ్గింపు పద్ధతులు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు.

రైతులు తమ క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా నిపుణులకు వివరించి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతు నేస్తం నిర్వహించబడుతుండగా, ఆదర్శ రైతులు తమ విజయగాథలను ఇతర రైతులతో పంచుకోవడం ద్వారా మంచి వ్యవసాయ పద్ధతులు విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి.

హైదరాబాద్‌లోని రాష్ట్ర స్థాయి కేంద్రం నుంచి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ మంత్రి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి సూచనలు అందిస్తున్నారు. రైతుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పథకాల అమలులో అవసరమైన మార్పులు కూడా చేపడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

ఈ నేపథ్యంలో రైతు నేస్తం 100 వ ఎపిసోడ్ విజయవంతం చేసేందుకు అశ్వారావుపేట రైతు వేదికలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్ తెలిపారు. సమీప రైతు వేదికలకు చేరుకుని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిపుణుల సూచనలు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -