నవతెలంగాణ – బోనకల్
నకిలీ విత్తనాలు అమ్మిన ఎరువుల దుకాణాలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ హెచ్చరించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం పరిధిలోనే బోనకల్ మండల కేంద్రంలో, మండల పరిధిలోని పలు పురుగుమందుల, విత్తన దుకాణాలను సీడ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విత్తన దుకాణాలలో విత్తనాలకు సంబంధించిన వివిధ రకాల రికార్డులను ఆయన టాస్క్ ఫోర్స్ సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వానాకాలం సీజన్ సమీపిస్తున్న సందర్భంగా వచ్చిన విత్తనాలు, వాటికి సంబంధించిన ఇన్వాయిసులు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు, స్టాక్ రిజిస్టర్స్ తనిఖీ చేసినట్లు తెలిపారు. విత్తనాలు అమ్మే డీలర్లు కచ్చితంగా ఇన్వాయిస్లు, పిసిలు కలిగి ఉండాలని, స్టాక్ రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు.
ఎవరైనా సరియైన డాక్యుమెంట్స్ లేకుండా విత్తనాలు అమ్మితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. అందరూ విత్తన చట్టం 1966 కు లోబడి విత్తనాల అమ్మాలని సూచించారు. స్టాక్ బోర్డ్ తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని సూచించారు. హెచ్ టి కాటన్ ను ప్రభుత్వం నిషేధించిందని, ఎవరైనా ఆ విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ గ్రామాలలో రాత్రిపూట ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం ఉంటే స్థానికులు వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారికి, పోలీసు శాఖకు ఫిర్యాదు చేయాలని డీలర్లకు సూచించారు. ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే మండల వ్యవసాయ అధికారికి గాని, దగ్గర్లో ఉన్న పోలీస్ వారికి గాని సమాచారం ఇవ్వాలని కోరారు.



