Tuesday, June 9, 2026
E-PAPER
Homeమానవిచరిత్ర సృష్టించిన జపనీస్‌ ‌మేయర్‌

చరిత్ర సృష్టించిన జపనీస్‌ ‌మేయర్‌

- Advertisement -

జపాన్‌లో ఎన్నికైన అతి చిన్న మహిళా మేయర్‌‌గా గతంలోనే చరిత్ర సృష్టిచారు. ఇప్పుడు తొలిసారి తల్లి కాబోతున్న ఆమె సెలవు తీసుకుని మరోసారి చరిత్ర సృష్టిస్తున్నారు. క్యోటో ప్రిఫెక్చర్‌లోని యవాటా నగర మేయర్ అయిన 35 ఏండ్ల ఆమె.. తన బిడ్డ పుట్టబోయే సమయంలో ప్రసూతి సెలవు తీసుకుంటున్నట్లు ఇటీవలె ప్రకటించారు. దీంతో ఆమె జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, జపాన్‌‌లోని పితృస్వామిక వ్యవస్థలలోని ఒక స్పష్టమైన లోపాన్ని బయటపెట్టారు. 2023లో మేయర్‌‌గా ఎన్నికైన కవాటా ఈ ఏడాది సెప్టెంబర్ లో బిడ్డకు జన్మనివ్వనున్నారు. కనుక ఆమె 16 వారాల ప్రసూతి సెలవు తీసుకోనున్నారు. అంటే ప్రసవానికి ఎనిమిది వారాల ముందు, ప్రసవం తర్వాత ఎనిమిది వారాలు. జపాన్‌ దేశంలో పదవిలో ఉన్న మేయర్ ఇలా సెలవు తీసుకోవడం ఇదే మొదటిసారి.

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రజాప్రతిథులకు సెలవులు ఇచ్చే చట్టపరమైన నిబంధన ఏదీ లేదు. జపాన్ వేగంగా తగ్గుతున్న జననాల రేటు, రాజకీయ నాయకత్వంలో కొనసాగుతున్న లింగ వివక్ష‍తో పోరాడుతున్న తరుణంలో తాను తీసుకున్న ఈ నిర్ణయం ‘‘వ్యవస్థను మార్చడానికి ఒక ఉత్ప్రేరకంగా’’ మారుతుందని కవాటా నమ్మకంగా చెబుతున్నారు. జాతీయ పార్లమెంట్లపై ప్రపంచవ్యాప్త డేటాను ట్రాక్ చేసే ఐపీయూ పార్‌లైన్ ప్రకారం, ఆ దేశం గత ఏడాదే తన మొదటి మహిళా ప్రధానమంత్రిని ఎన్నుకుంది. ప్రస్తుతం ప్రతినిధుల సభలో మహిళల వాటా 15% కన్నా తక్కువగా ఉంది. ‘‘దీని ద్వారా మహిళా కార్మికులను మాత్రమే కాకుండా, వ్యాపారులు, నిర్వాహకులను, వివిధ రకాల పనులలో నిమగ్నమైన వారందరూ తమ పనితో సరైన సమతుల్యతను పాటిస్తూనే.. పిల్లల పెంపకం, ప్రసవం వంటివి కూడా స్వీకరించేలా ప్రోత్సహించాలని నేను ఆశిస్తున్నాను’’ అని కవాటా అన్నారు.

విమర్శలు వెల్లువెత్తాయి
టోక్యోకు నైరుతి దిశలో సుమారు 285 మైళ్ల దూరంలో, దాదాపు 70,000 మంది జనాభా ఉండి తాను నాయకత్వం వహిస్తున్న ఈ నగరానికి తన ప్రసూతి సెలవుల సమయంలో ఒక డిప్యూటీని నియమించాలని కవాటా ఆలోచిస్తున్నారు. ఇంట్లో తన నవజాత శిశువును చూసుకుంటూనే, ఆమె తన ఈమెయిల్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఇప్పటికే ప్రణాళిక వేసుకున్నారు. కవాటా తన ప్రసూతి సెలవును ప్రకటించిన తర్వాత, జపాన్ సోషల్ మీడియాలో దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ప్రభుత్వ అధికారి కార్యాలయానికి గైర్హాజరు కావడం అంటే పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేయడమేనని కొందరు వాదించారు. అయితే దీని గురించి తనతో వ్యక్తిగతంగా మాట్లాడిన వారందరూ “అద్భుతంగా అర్థం చేసుకున్నారని” ఆమె అన్నారు.

పాతకాలపు అవగాహపై
‘నిజానికి, సెలవు తీసుకొమ్మని చాలామంది నాకు స్వయంగా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయ సిబ్బందితో పాటు ప్రజలు కూడా, నేను విరామం తీసుకోవాలని ఏమాత్రం సంకోచం లేకుండా చెబుతున్నారు’ అని ఆమె అన్నారు. టోక్యో విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసరైన సవాకో షిరహాసే ప్రకారం, జపాన్ ప్రభుత్వ ఆలోచనలు చాలా వరకు చాలా పాతకాలపు అవగాహపై ఆధారపడి ఉన్నాయి. ఇవి ఉద్యోగ రంగంలోని ఆధునిక మహిళల అవసరాలకు అనుగుణంగా లేవు. ‘మేయర్లు లేదా ప్రభుత్వ కార్యాలయ అధిపతులు ప్రసూతి సెలవు తీసుకుంటారని చట్టపరమైన వ్యవస్థే ఊహించదు’ అని అదే సమయంలో సెలవు తీసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు.. కాబట్టి ఇది చాలావరకు ఒక గ్రే జోన్’ అని అన్నారు.

నెమ్మదిగా మార్పు
ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో మెరుగైన పని, జీవిత సమతుల్యత సంస్కృతిని పెంపొందించడానికి జపాన్ భవిష్యత్ నాయకులు కవాటాను ఆదర్శంగా తీసుకోవాలని తాను ఆశిస్తున్నట్లు షిరహాసే అన్నారు. లుడ్విగ్-మాక్సిమిలియన్స్-యూనివర్సిటీలోని జపాన్ సెంటర్ పరిశోధకురాలు స్టెఫానీ ష్వార్టే మాట్లాడుతూ, లింగ సమానత్వం విషయంలో జపాన్ నెమ్మదిగా మారుతున్నప్పటికీ, రాజకీయాలలో ఎక్కువ మంది మహిళలు సాంప్రదాయ కట్టుబాట్లను బద్దలు కొడుతున్నారని అన్నారు. స్థానిక పాలనలో మహిళల భాగస్వామ్యంపై ఉన్న డేటాను గుర్తు చేస్తూ గత ఐదేండ్లలో 1,700కు పైగా మునిసిపాలిటీలలో మహిళా మేయర్ల సంఖ్య సుమారు 50 నుండి 2026 ప్రారంభం నాటికి దాదాపు 80కి పెరిగిందని ఆమె చెప్పారు. అలాగే ‘రెండవ, మూడవ, నాల్గవ సారి కూడా పదవిలో కొనసాగుతున్న మహిళా మేయర్లను మనం ఎక్కువగా చూడవచ్చు” అని ఆమె గుర్తుచేశారు. పురుషులు లేదా మహిళలు ఎవరైనా తమ సమాజానికి సేవ చేయగలరని, మంచి పని చేయగలరని, వారు రాబోయే తరానికి ఒక ఉదాహరణ అని ఆమె జోడించారు.

కెరీర్‌పైనే దృష్టి
యవాటా మేయర్ ప్రసూతి సెలవుపై జరుగుతున్న చర్చ సమయంలో తగ్గుతున్న జననాల రేటుకు వ్యతిరేకంగా జపాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం గురించి కూడా మాట్లాడుకోవాలి. 2025లో దేశంలో 671,236 మంది జపనీయులు జన్మించారు. ఇది ఒక కొత్త రికార్డు స్థాయి. జననాల రేటు వరుసగా 10వ ఏడాది కూడా తగ్గుతూనే ఉంది. జనాభా సంక్షోభం గురించి పూర్తి స్థాయి స్పష్టత రావడంతో, ఇటీవలి కాలంలో జననాల సంఖ్యను పెంచే ప్రయత్నాలు వేగమయ్యాయి. ఇందులో భాగంగా ప్రసూతి, గృహ రాయితీలు, అలాగే ఎక్కువ మంది తండ్రులు పితృత్వ సెలవు తీసుకునేలా ప్రోత్సహించడం వంటి కొత్త విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి. అయితే జపాన్‌లో జననాల రేటు పడిపోవడానికి, అక్కడ లోతుగా పాతుకుపోయిన అధిక పని సంస్కృతితో పాటు పెరుగుతున్న జీవన వ్యయమే కారణమని చాలా మంది నిపుణులు అంటున్నారు. వివిధ రంగాలలోని ఉద్యోగులు అధిక పని గంటలు, పై అధికారుల నుండి అధిక ఒత్తిడి, తీవ్రమైన సందర్భాల్లో “కరోషి” (పని వలన కలిగే ప్రాణాంతక గుండె, మెదడు సంబంధిత వ్యాధుల కేసులలో ఉపయోగించే పదం) వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సంతానోత్పత్తి వయసులో ఉన్న చాలా మంది యువత కుటుంబాన్ని ప్రారంభించడం కంటే తమ కెరీర్‌పై దృష్టి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు.

రెండింటిలో ఒకటే
ప్రసవం, మాతృత్వం గురించి ఆలోచిస్తున్న మహిళల అవసరాలకు జపాన్ కార్యాలయాలు, ప్రభుత్వ వ్యవస్థలు ఇప్పటికీ సరిగ్గా సరిపోనందున, మార్పు నెమ్మదిగానే ఉందని కవాటా అంటున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం, దేశంలోని కార్యాలయాల్లో లింగ అంతరం ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. శ్రామిక శక్తిలో పాల్గొంటున్న పురుషుల శాతం సుమారు 72% కాగా మహిళల శాతం సుమారు 56%గా ఉంది. ‘వారు బిడ్డను కనాలని కోరుకుంటే, తమ వృత్తిని వదులుకోవాలి, వృత్తిని కొనసాగించాలనుకుంటే, బిడ్డను కనడాన్ని వదులుకోవాలి’ అని కవాటా అన్నారు. మహిళలను ‘రెండింటిలో ఒకటి’ అనే ఎంపికకు బలవంతం చేయకూడదని ఆమె వాదించారు. ‘మేము ఇప్పుడు ఈ పరిస్థితిని కొద్దికొద్దిగా మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం. సరైన లింగ సమానత్వాన్ని సాధించడమే లక్ష్యంగా ఉన్న వ్యవస్థల రూపకల్పన దిశగా మేము పయనిస్తున్నాం’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -