Saturday, August 8, 2026
E-PAPER
Homeమానవిప్రయాణం నేర్పిన పాఠం

ప్రయాణం నేర్పిన పాఠం

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
నాన్న, ఈ సారి నీ దగ్గర చాలా రోజులున్నాను. నీకు ఇష్టమైనవి చేసి పెట్టడమే కాక, నీకు కొంచం విశ్రాంతి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తిరిగి వచ్చిన తర్వాత మనసులో బాధ, దిగులు. కొన్ని రోజులు ఇది తప్పదు. ఎప్పటి నుండో నువ్వు చూడాలనుకుంటున్న ఉదయపూర్‌కి వెళ్ళి వచ్చాం. నీ కోరిక తీర్చినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఉదయపూర్ ప్రయాణం ఒక ఆహ్లాదం, ఆనందం. తిరుగు ప్రయాణం ఒక పాఠం. ఆ జరిగిన సంఘనే ఈ ఉత్తరం రాయడానికి దోహదపడింది. వెళ్ళేటప్పుడు భయంకరమైన వాన పడుతున్నా ప్రయాణంలో ఇబ్బంది కలగలేదు, అనుకున్నవన్ని చూసాము. తిరుగు ప్రయాణంలో మనం దిగాల్సిన ప్రాంతం చెప్పినప్పుడు బస్ అతను మీరు దిగాల్సిన ప్రాంతం వచ్చింది దిగండి అంటూ మనతో పాటుగా మరో నలుగురిని దింపాడు. రాత్రి 10.30 దాటింది. వర్షంతో నేలంతా చిత్తడి, ఒక వేళ మళ్ళీ వర్షం పడితే దగ్గరలో తల దాచుకోవడానికి ఏమి లేవు. పైగా గాఢాంధకారం, నర సంచారం లేదు. సిగ్నల్స్ సరిగా లేవు, అక్కడ ఉన్నది ఒక్కటే ఆటో.

మనతో దిగిన ఇద్దరు కుర్రాళ్ళు రోడ్డు దాటి వెళ్లి పోయారు. మిగిలింది నేను, నువ్వు, మనతో పాటుగా దిగిన భార్యా భర్తలు. వాళ్లకు క్యాబ్ బుక్ అవడం లేదు. ఉన్నది ఒకటే ఆటో. డ్రైవర్ ముందు మనదగ్గరకు వచ్చాడు, ఎంత కావాలో చెప్పాడు. నువ్వు సిగ్నల్ ఉందని క్యాబ్ బుక్ చేస్తున్నావు. ఈ లోపు ఆ భార్య భర్తలు ఆటో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతే, మనకు క్యాబ్ బుక్ కాకుంటే పరిస్థితి ఏంటి. నాకు కొంచెం భయం వేసింది. వాళ్ళను ఆటో అతను డబ్బులు ఎక్కువ అడిగినట్లు ఉన్నాడు, వాళ్ళు బేరమాడుతున్నారు. ఈ లోపు ఆటో అతన్ని పిలిచి నువ్వు అడిగినంత ఇస్తామని ఆటోలో ఎక్కికూర్చున్నాం. పాపం వాళ్లకు బుక్ అయిన క్యాబ్ క్యాన్సిల్ అయినట్లుంది. చాలా టెన్షన్ పడుతున్నారు. ఈ లోపు మనకు క్యాబ్ బుక్ అయింది. అప్పుడు నువ్వు ‘వాళ్ళను పిలిచి భయ్యా! మా క్యాబ్ బుక్ అయింది. అది రాగానే మేము అందులో వెళ్లి పోతాము. మీరు ఈ ఆటోలో వెళ్ళిపోండి’ అన్నావు. ఒక పది నిమిషాల తర్వాత మన క్యాబ్ వచ్చింది. వాళ్లు ఆటో అతనితో ‘వాళ్ళ క్యాబ్ కూడా బైల్దేరని, అందరం ఒకేసారి ఈ ప్రాంతం నుండి వెల్దాం’ అన్నారు.

అలా అందరం సురక్షితంగా చేరుకున్నాం. ఇటువంటివి ఎదురైనప్పుడు తోటి ప్రయాణికులతో మాట్లాడాలి, వాళ్ళు ఎటు వైపు వెళ్తున్నారో తెలుసుకుని, కనీసం జన సంచారం, రవాణా సౌకర్యం ఉన్న చోటికైనా చేరుకోవాలి. అదే రైల్వే స్టేషన్, విమానాశ్రయాల్లో ఇటువంటివి ఎదురు కావు. ఒక్క బస్ ప్రయాణంలోనే ఈ సమస్య. కాబట్టి ప్రయాణాల్లో ముఖ్యంగా బస్ ప్రయాణాల్లో వెలుతురు ఉన్నప్పుడే ఇంటికి చేరుకునేలాగా ప్రణాళిక చేసుకోవాలి. తోటి ప్రయాణికులతో మాటలు కలుపుతూ వివరాలు తెలుసుకుంటూ ప్రయాణం సాగించాలి. మరో ముఖ్య విషయం తోటి ప్రయాణికులు ఏమైనా తినటానికి, తాగటానికి ఇచ్చినా సున్నితంగా తిరస్కరించాలి. చూసావా నాన్నా.. ఒక విహార యాత్ర ఎంతటి పాఠం నేర్పిందో. సరే బంగారు తల్లి ఉంటాను. బాగా గుర్తుకు వస్తున్నావు. ఆరోగ్యం జాగ్రత్త.

ప్రేమతో అమ్మ పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -