భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ‘మహిళా సాధికారత’ మొదలవక ముందే ఫాతిమా బేగం వంటి ప్రతిభావంతులైన మహిళలు ఉన్నారంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. ‘ఆదిల్-ఎ-జహంగీర్’ (1934)తో బిబ్బో, ‘తలాష్ ఎ హఖ్'(1935)తో జద్దన్‌బాయి, జవానీ కి హవా (1935) ద్వారా సరస్వతీ దేవి స్వరకర్తలుగా అరంగేట్రం చేసిన ఈ ముగ్గురిని భారతీయ మహిళ వైతాళిక త్రయంగా పేర్కొనవచ్చు.
జద్దన్‌బాయి హుస్సేన్ 1892లో బెనారస్‌లో జన్మించింది. ఆమె తల్లి దలీపాబాయి, చాలా అందంగా ఉండేది. పెళ్ళయిన కొద్దికాలానికే వితంతువైంది. ఇంట్లో అవమానాలు తట్టుకోలేక నదిలో దూకి ఆత్మహత్యకు సిద్ధ పడుతుండగా ఆమెను కొందరు వ్యక్తులు అపహరించారు. తరువాత ఆమె సంగీతంలోకి ప్రవేశించి తవాయిఫ్‌గా మారింది.
జద్దన్‌బాయి జీవిత ప్రస్థానం ఒక కాలాతీతమైన సినిమా కథ వంటిది. అప్పట్లో స్త్రీ జీవితం ఎంత దుర్భరంగా ఉండేదో ఆమె జీవితమే అందుకు ఉదాహరణ. ఆమె తల్లి దలీపాబాయి అలహాబాద్‌లో ఓ వేశ్య. జద్దన్‌బాయి చిన్నపిల్లగా ఉన్నప్పుడే వారి కుటుంబం కలకత్తాకు మారింది. నాటి భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన మోతీలాల్ నెహ్రూ, దలీపాబాయిల మధ్య ప్రేమ వ్యవహారం ఉండేదని వదంతులు ఉన్నాయి. అయితే మోతీలాల్‌కు మరో అమ్మాయితో వివాహం జరిపించడంతో ఆ ప్రేమ వ్యవహారానికి తెరపడింది. అయితే ఆయన భార్య ప్రసవ సమయంలో బిడ్డతో సహా మరణించింది. కొన్నేండ్ల తర్వాత మోతీలాల్‌కు మళ్ళీ వివాహం కాకముందే ఆయన దలీపాబాయిని కలిశాడు. అప్పటికి ఆమె రాజభవనంలో తవాయిఫ్‌ల కోసం సారంగి వాయించే వ్యక్తిని వివాహం చేసుకుని ఉంది. అయినా వారిద్దరి మధ్య సంబంధం మళ్ళీ చిగురించింది. అయితే కుటుంబ సభ్యులు మోతీలాల్‌కు స్వరూప రాణితో వివాహం జరిపించి దలీపాబాయికి దూరంగా ఉంచారు. అప్పటికే దలీపాబాయికి పుట్టిన కొడుకు మోతీలాల్ నెహ్రూకు పుట్టి ఉండవచ్చని కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏదీ నిరూపణకాలేదు. ఈ కథను కొందరు కేవలం గాసిప్‌గానే భావిస్తారు. ఒకవేళ ఇదే నిజమైతే జద్దన్‌బాయి, జవహర్‌లాల్ నెహ్రూకు సవతి సోదరి అవుతుంది.
జద్దన్‌బాయికి ఐదేండ్ల వయసులో ఆమె తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం కలకత్తాకు మారింది. ఇక్కడే ఆమె హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొందడానికి కలకత్తాలోని భయ్యా సాహెబ్ గణపత్ వద్ద చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఆయన కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె ఉస్తాద్ మొయినుద్దీన్ ఖాన్, హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ తమ్ముడు బర్కత్ అలీ ఖాన్ల వద్ద శిక్షణ పొందింది.
గాయనిగా మారిన జద్దన్‌బాయికి రేడియోలో, కొలంబియా రికార్డ్స్ కంపెనీల నుండి ఆమెకు అవకాశాలు వచ్చాయి. వారు ఆమె గజల్స్‌ను కూడా రికార్డ్ చేశారు. ఆమె రికార్డ్ చేసిన ‘లగత్ కరేజ్వా మే చోట్’ ఒక ఐకానిక్ పాటగా దేశవ్యాప్తంగా అందరూ పాడుకున్నారు. ఆమె కొన్ని శాస్త్రీయ రాగాలను కూడా రికార్డ్ చేసింది. రాగ్ శంకరలో ఆమె రికార్డ్ చేసిన ‘జై జై దేవా’ చాలా ప్రాచుర్యం పొందింది. దాంతో ఆమె కలకత్తాలో ప్రఖ్యాత గాయనిగా పేరుపొందింది. ఆ వెంటనే ఆమెకు రాంపూర్, ఇండోర్, గ్వాలియర్, జోధ్‌పూర్, బికనీర్, కాశ్మీర్ వంటి సంస్థానాల సంగీత సభలలో (మెహఫిల్స్‌లో) పాడే అవకాశాలు వచ్చాయి.
జద్దన్‌బాయి సంగీతంలో అపారమైన ప్రతిభ కలిగి ఉన్నప్పటికీ తల్లి వత్తిని స్వీకరించలేదు. ఆమె ఆధునికంగా ఆలోచించింది. ‘తవాయిఫ్’ల సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ, తనదైన సొంత జీవన శైలిని ఏర్పరచుకుంది. జద్దన్ బాయికి పలు వివాహాలు జరిగాయి. ఆమె మొదటి వివాహం గుజరాతీ వ్యాపారవేత్త నరోత్తమ్ దాస్‌తో జరిగింది. ఆయన ఇస్లాం స్వీకరించి ‘బచ్చీ బాబు’గా మారాడు. వారి కొడుకే అక్తర్ హుస్సేన్. ఆమె రెండవ వివాహం తన హార్మోనియం ప్లేయర్ ఉస్తాద్ ఇర్షాద్ మీర్ ఖాన్‌తో జరిగింది. వారి కొడుకు అన్వర్ హుస్సేన్. మూడవ వివాహం మోహన్‌చంద్ ఉత్తమ్‌చంద్ త్యాగితో జరిగింది. అదో పెద్ద కథ!
వైద్య విద్య అభ్యసించడానికి ఇంగ్లాండ్‌కు వెళ్లే సన్నాహాల్లో ఉన్న ఆ యువకుడు కలకత్తాలో ఉన్నప్పుడు జద్దన్‌బాయి ‘కోఠ’ను సందర్శించి ఆమె పాటలు విని ఆమె పట్ల ఆకర్షితులై వివాహ ప్రతిపాదన చేశాడు. ఆమె అతన్ని వారించింది. ఎందుకంటే అతను తనకంటే నాలుగేండ్లు చిన్నవాడు. పైగా అప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమైనవి. దాంతో ఆమెకు మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆమె అతనితో ‘ముందు మీరు మీ కుటుంబ సభ్యులకు ఈ వివాహం గురించి చెప్పండి. నేను ముస్లింనని, ఒక తవాయిఫ్‌నని వారికి వివరించండి. వారు దీనికి అంగీకరిస్తే మీ ప్రతిపాదనకు నేను పునరాలోచిస్తాను’ అని చెప్పింది. అలా వెళ్ళిపోయిన ఆ యువకుడు నాలుగేండ్లకు తిరిగి వచ్చి ‘నేను నా కుటుంబంతో సంబంధాలు తెంచుకున్నాను. నీతో వివాహమే నాకు ముఖ్యం’ అని చెప్పాడు. జద్దన్‌బాయి అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించింది. అతనే ఉత్తమ్‌చంద్. ఇస్లాం మతాన్ని స్వీకరించి ‘అబ్దుల్ రషీద్’గా మారాడు. ఏడాది తర్వాత జద్దన్‌బాయి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు ‘ఫాతిమా రషీద్’ అని పేరు పెట్టారు. ఈమెనే తర్వాతి కాలంలో 1950ల నాటి హీరోయిన్ ‘నర్గీస్’.
జద్దన్‌బాయి నాడు ప్రజల ఆదరణను పొందుతూ కొత్త వినోద మాధ్యమంగా మారుతున్న సినిమా ప్రాముఖ్యతను గుర్తించింది. అప్పట్లో సినిమా నిర్మాణానికి కేంద్రంగా ఉన్న బొంబాయికి నివాసం మార్చింది. అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి తన సంగీత నటనానుభవం ఉపయోగపడుతుందని ఆమెకు తెలుసు. కొద్ది కాలంలోనే లాహోర్‌కు చెందిన నిర్మాత ఎ.ఆర్. కర్దార్ తీసిన ‘రాజా గోపీచంద్’ చిత్రంలో తొలిసారి నటించింది. ఈ చిత్రంలో జద్దన్‌బాయి తన నటనకు ఎన్నో ప్రశంసలు పొందింది. అదే ఏడాది ‘ఇన్సాన్ యా షైతాన్’ (ఫతే-ఎ-ఇమాన్) చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె ‘సంగీత్ ఫిల్మ్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. తన ఆరేండ్ల కుమార్తె ఫాతిమా పేరును ‘బేబీ రాణి’గా మార్చి ‘మేడమ్ ఫ్యాషన్’ (1936) చిత్రంతో బాలనటిగా పరిచయం చేసింది.
ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణించి నర్గీస్ కుటుంబ భారాన్ని మోయవలసి వచ్చింది. జద్దన్‌బాయి ఆమెను బడి మాన్పించింది. మోతీలాల్ సరసన మెహబూబ్ ఖాన్ తీసిన ‘తఖ్దీర్’ లో నర్గీస్ హీరోయిన్‌గా నటించింది. బొంబాయిలోని అర్దేశిర్ ఇరానీ, ననుభారు వకీల్ వారి ‘బొంబాయి ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ’ నుండి ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇంతలొ 1934లో జి.ఆర్.సేథీ దర్శకత్వంలో ‘ప్రేమ్ పరీక్ష’ చిత్రం కోసం ‘ఈస్టర్న్ ఆర్ట్’ సంస్థ నుండి జద్దన్‌బాయికి అవకాశం లభించింది. ఈ చిత్రంలో జద్దన్‌బాయి, మెహతాబ్, డి.మాణిక్, హరి శివదాసాని గోపే తదితరులు నటించారు. చండీ రామ్ సంగీతంలోని పదమూడు పాటలలో నాలుగు పాటలు జద్దన్‌బాయి పాడింది. అవి.. ‘కైసీ వాహ ధూమ్ మచారమూ కనహయ్యా’, ‘రంగ్-ఎ-మెహఫిల్ నా రహా ఐష్క్ సామాన్ నా రహా’, ‘కైసీ ప్యారీ సురతియా తుమ్హారీ’, ‘చార్ఖే నా హంజార్ నే కుఛ్ ఇస్ కదర్’. అదే ఏడాది హిందీ నవలా రచయిత ప్రేమ్‌చంద్ ‘సేవా సదన్’ నవల ఆధారంగా ననుభారు వకీల్ తీసిన ‘బజార్-ఎ-హుస్న్’ చిత్రంలో ఆమె నటించింది. ఈ చిత్రంలో జద్దన్‌బాయి ‘ఆఇనా రఖ్ దో కి ఘబరాతా హై దిల్’, ‘తేరీ షోఖీ హై జుదా ఘమ్జా’, ‘తుమ్ రాధే బనో శ్యామ్ హమ్ నందలాలా’, ‘షీషే సే నా రఖ్ మత్లబ్ ఏ సాకీ-ఏ-మస్తానా’, ‘సబ్ జూఠా హై సంసార్ నహీ కోరమూకిసీ కా యార్’ అనే ఐదు పాటలు పాడింది. ఈ సినిమాలో షాహు మోదక్ తల్లిగా జద్దన్‌బాయి పోషించిన పాత్ర ఎన్నో ప్రశంసలు అందుకుంది.
ఈ నేపథ్యంలో ‘సాగర్ మూవీ టోన్’ సంస్థ ఆమెకు ‘నాచ్‌వాలీ’ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో స్వరూపరాణి, యాకూబ్, మెహబూబ్ ఖాన్‌లతో కలిసి నటించిన ఆమె తన పాటలను స్వయంగా పాడుకుంది. నటిగా, గాయనిగానే కాకుండా జద్దన్‌బాయి ‘హదయ మంథన్’ (1936), ‘మేడమ్ ఫ్యాషన్’, ‘జీవన్ స్వప్న’ (1937), ‘మోతియోం కా హార్’ (1937) చిత్రాలకు దర్శకత్వం వహించింది. మేడమ్ ఫ్యాషన్‌లో ‘చుమ్ చా నా నా నా బిచువా బజే’, ‘హో ప్యాలా మద్ కా భరా హువా’, ‘పీ కే హమ్ తుమ్ జో చలే జూమ్తే మైఖానా సే’, ‘కైసీ యే ధూమ్ మచాతి కన్హయ్యా గారి మేం దుంగి’, ‘పఫియావు పిహు కరే’, ‘భగవాన్ తేరీ మాయా’ అనే ఆరు పాటలు పాడింది.
అనంతరం నర్గీస్, జైరాజ్, అన్వర్ హుస్సేన్ నటించిన ‘అంజుమన్’ (1948) చిత్రంలో జద్దన్‌బాయి నటించింది. ఆమె కుమారుడు అక్తర్ హుస్సేన్ జద్దన్‌బాయి కథ, సంభాషణలు రాయగా స్వయంగా ‘దరోగాజీ'(1949) చిత్రాన్ని నర్గీస్, జైరాజ్‌లతో తీశాడు. అదే ఆమె చివరి చిత్రం. దరోగాజీ విడుదలైన కొద్ది కాలానికే 1949 ఏప్రిల్ 8న జద్దన్‌బాయి కన్నుమూసింది. అప్పుడప్పుడే కూతురు నర్గీస్ నాయికగా స్థిరపడుతున్నది. మరణించిన రోజు ఆమె పట్ల గౌరవ సూచకంగా ఒక రోజు సినిమా షూటింగ్‌లను రద్దు చేసి, స్టూడియోలను మూసివేశారు. భారతీయ సినిమా చరిత్రలో టాకీల తొలి కాలంలో ఆమె నటిగా, గాయనిగా, సంగీత దర్శకురాలిగా, దర్శక నిర్మాతగా నిర్వహించిన భూమిక చారిత్రాత్మకమైనది. ఆమె వ్యాపార దృష్టి కలిగిన మహిళ. వైవాహిక జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడింది. భార్యగా, తల్లిగా తన మూడవ భర్త, ముగ్గురు పిల్లలతో సంతప్తికరమైన జీవితాన్ని గడిపింది. ఒక రకంగా ఆమెది నిరంతరం సంఘర్షణలతో కూడిన ఒక విజయ గాధ.
హెచ్.రమేష్ బాబు,
7780736386



