Tuesday, June 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలురెండేండ్లలో మిరేం చేశారు

రెండేండ్లలో మిరేం చేశారు

- Advertisement -

రాష్ర్టాభివృద్ధికి కేంద్రం నుంచి 
ఎన్ని నిధులు తెచ్చారు?
రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలి

కేంద్రంలో ఉంది మీరేగా…అనుమతులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు?
8మంది బీజేపీ ఎంపీలతో రాష్ర్టానికి
 ఏం ప్రయోజనం..
దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకం
పేదలందరికీ సొంత ఇండ్లు నిర్మిస్తాం
మియాపూర్‌లో సైబరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కార్యాలయం శంకుస్థాపనలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి
రూ. 1674 కోట్లతో 
 పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ర్ట అభివృద్ధి కోసం జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి పని చేద్దామనీ, ఎన్నికలకు ఆరునెలల ముందు ఎవరి రాజకీయాలు వాళ్లం చేసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్ది సూచించారు. కేంద్రంలో తమపార్టీ అధికారంలో ఉందని గొప్పలు చెప్పే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి దమ్ముంటే రాష్ర్టంలో అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకురావాలని సవాల్ విసిరారు. రాష్ర్టం అభివృద్ది చెందితే ఆ ఫలితం కాంగ్రెస్‌‌కు దక్కుతుందన్న వక్రబుద్ధితో అనుమతులను అడ్డుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి నియోజకవర్గంలో సైబరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కార్యాలయ నిర్మాణ పనులకు సోమవారంనాడాయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొర్పొరేషన్‌ ‌పరిధిలో రూ.1674 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్న నాలుగు రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. తెలంగాణ ప్రపంచంలో నెంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో నిలువడానికి అంతర్జాతీయ ఎయిర్‌ ‌పోర్టు, ఓఆర్‌ఆర్‌‌లు ప్రధాన కారణాలన్నారు. వాటిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌‌పార్టీనే అని చెప్పారు. హైదరాబాద్‌ గొప్పనగరంగా మారాలంటే మౌలిక వసతులు కూడా ఆ స్థాయిలో ఉండాలని చెప్పారు. దానికోసమే గ్రేటర్‌ హైదరాబాద్ ప్రాంతాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి, పాలన సౌలభ్యం కోసం మూడు మున్సిపల్‌ ‌కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.​

​బీజేపీ ఎంపీలతో
 ఏం ఉపయోగం?
​అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణలో విద్య, వైద్యం అందిస్తున్నామని సీఎం తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రయివేటు, కార్పొరేట్‌ ‌స్కూల్స్‌‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూల్స్‌‌ను తయారు చేస్తున్నామన్నారు. ఉచిత వైద్యం అందించేందుకు పక్కా ప్రణాళిక బద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.రాష్ర్ట ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చున్నారన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు వారి సమస్యల పరిష్కారానికి పనిచేయాలే తప్ప, రాజకీయ పంతాల కోసం కాదన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తమ నగరాలను అభివృద్ధి చేసుకోవచ్చు కానీ.. తెలంగాణలో మూసీ నది ప్రక్షాళన చేయొద్దా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్ష‍ాళన కోసం మోడీని నిధులు కావాలని ఏ రోజైనా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు అడిగారా అని ప్రశ్నించారు. తెలంగాణకు రీజినల్‌ ‌రింగ్‌, ఎయిర్‌ ‌పోర్టులు, సాగు నీటి ప్రాజెక్టులు ఇష్టం లేని కేంద్రంలోని పెద్దలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డు కాళ్లు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ర్టంలో పదేండ్ల బీఆర్ఎస్, కేంద్రంలో 12 ఏండ్ల బీజేపీ పాలన.. రెండున్నరేండ్ల కాంగ్రెస్‌ ‌పాలనపై అసెంబ్లీలో చర్చపెట్టేందుకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏం చేయలేదు అని ఆరోపిస్తున్న నాయకులు కేంద్రం నుంచి వాళ్లేం చేశారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. దమ్ముంటే అభివృద్ధి పనులకు నిధులు, అనుమతులు తేవాలని కోరారు. ప్రతి పేదవాడికీ ఇండ్లు ఇచ్చేందుకు లక్ష‍ ఇండ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి శ్రీధర్‌ ‌బాబు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ‌చైర్మెన్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -