Thursday, February 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎల్‌ఎం 6 కెనాల్‌ నిర్మాణం పూర్తి చేయాలి

ఎల్‌ఎం 6 కెనాల్‌ నిర్మాణం పూర్తి చేయాలి

- Advertisement -

గతంలో హామీ ఇచ్చి విస్మరించిన ఎమ్మెల్యే
స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తాం
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న రైతుల డిమాండ్‌


నవతెలంగాణ- ఇల్లంతకుంట
కాళేశ్వరం 11వ ప్యాకేజీ పరిధిలోని సిద్ధిపేట జిల్లా రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీరందించే ఆర్డీ3 ఎల్‌ఎం6 కెనాల్‌ నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక రైతులు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌ గ్రామ శివారులోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద రైతులు ఈ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఇల్లంతకుంట మండలం దాచారం, పెద్ద లింగాపూర్‌, వెల్జీపూర్‌, రామోజీపేట్‌, తంగళ్లపల్లి మండలంలో బస్వాపూర్‌, బాలమల్లుపల్లి, అంకుసాపూర్‌, లక్ష్మిపూర్‌ తదితర గ్రామాలకు సాగునీరందించే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్డీ3 ఎల్‌ఎం6 కెనాల్‌ నిర్మాణం చేపట్టిందన్నారు. ఇల్లంతకుంట మండలం బోటిమీది పల్లె వరకు పనులు చేయగా అంతలోనే ప్రభుత్వం మారిందని తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి నిర్మాణ పనులను నిలిపివేసిందని అన్నారు. పనులు కొనసాగించాలని గతేడాది ఫిబ్రవరిలో రిలే దీక్ష చేపట్టామని, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వచ్చి ఆరు నెలల్లో కాలువ నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఏడాది గడుస్తున్నా పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్ల మళ్లీ దీక్షను చేపట్టినట్టు చెప్పారు. కాలువ పనులు పూర్తయ్యే వరకు ఈ దీక్షను విరమించేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకూ తాము సిద్ధమేనని స్పష్టంచేశారు. కాల్వ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. రిలే నిరాహార దీక్షలో పెద్దలింగాపూర్‌, రామోజీ పేట్‌, నరసింహులపల్లె, చిక్కుడువానిపల్లె, ఎడ్లవానికుంట, బస్వాపూర్‌, రామన్న పల్లె, అంకుసాపూర్‌, లక్ష్మీపూర్‌, పాపాయి పల్లె, తాడూరు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -