Wednesday, April 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఈఎండీల ఎగవేతపై ఏసీబీ దృష్టి..!

ఈఎండీల ఎగవేతపై ఏసీబీ దృష్టి..!

- Advertisement -

– ‘నవతెలంగాణ’ కథనంతో వెలుగులోకి విస్తుపోయే నిజాలు
– మున్సిపల్‌ పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ వరంగల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ తీరుపై విజిలెన్స్‌ సైతం ఆరా..!
– ఒక్క కాంట్రాక్ట్‌ కంపెనీకే రూ.24 లక్షల ఎగవేత
– ఈఎండీలు కాకుండానే ఒక్కో బిడ్‌ నుంచి 5శాతం కమీషన్‌
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

మున్సిపల్‌ పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌కు సంబంధించిన ఈఎండీ (ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌)ల గోల్‌మాల్‌పై ‘నవతెలంగాణ’లో ఈ నెల 12వ తేదీన ప్రచురితమైన కథనంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు స్పందించారు. ఈఎండీలు ఎగవేస్తున్న ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ శాఖ వరంగల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ నాగవల్లి శ్రీనివాసరావు తీరుపై ఏసీబీతోపాటు విజిలెన్స్‌ అధికారులు సైతం దృష్టి సారించారు. కథనం ఆధారంగా ఏ కాంట్రాక్టర్‌కు ఎంత మొత్తం ఈఎండీలు పెండింగ్‌లో ఉన్నాయో..? ఆరా తీస్తున్నారు. బిడ్‌ దక్కని కాంట్రాక్టర్‌కు వాపస్‌ చేయాల్సిన ఈఎండీలను తిరిగి ఇవ్వకపోగా.. అవుట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఖాతాకు ఎందుకు మళ్లించాల్సి వచ్చిందనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ- ప్రొక్యూర్మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఈఈల అకౌంట్‌కు చేరాల్సిన డిపాజిట్లు నిబంధనలకు విరుద్ధంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఖాతాలో ఎలా జమవుతున్నాయని విచారిస్తున్నారు.

ఒక్క కంపెనీవే రూ.24 లక్షల ఈఎండీలు పెండింగ్‌
వరంగల్‌ సర్కిల్‌ పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) పర్యవేక్షణలో ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం.. ఇలా మొత్తం 18 జిల్లాలు ఉన్నాయి. ఈ సర్కిల్‌ పరిధిలో ఈ- ప్రొక్యూర్మెంట్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించిన 1శాతం ఈఎండీని బిడ్‌ దక్కని కాంట్రాక్టర్లకు వెంటనే వాపస్‌ చేయాల్సి ఉంటుంది. కానీ ఎస్‌ఈ శ్రీనివాసరావు ఆ రకంగా చేయకుండా ఆ డిపాజిట్లను దారిమళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి సంబంధించిన రూ.24 లక్షల 1శాతం ఈఎండీ వాపస్‌ చేయకపోవడం గమనార్హం. రూ.24 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన 1శాతం ఈఎండీలు ఈ ఒక్క కంపెనీకి చెందినవే అట్టి పెట్టుకున్నాడంటే…! ఇలాంటి కంపెనీలెన్ని? కాంట్రాక్టర్లు ఎందరు? వారి డిపాజిట్ల పరిస్థితి ఏంటి? అనే కోణంలో ఆరా మొదలైంది. ‘నవతెలంగాణ’ కథనంపై మున్సిపల్‌ పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ పరిధిలోని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ ఈ ఎస్‌ఈ తీరుపై సంస్థాగతంగా విజిలెన్స్‌ ఆరా తీసినట్టు సమాచారం. ఇప్పుడు కూడా ఆ దిశగా విచారణ చేపట్టేందుకు విజిలెన్స్‌ అధికారులు సమాయత్తమవుతుండగా.. ఏసీబీ అధికారులు సర్కిల్‌ పరిధిలో బిడ్‌లకు సంబంధించిన ఈఎండీల వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
కొసమెరుపు…
సదరు ఇంజినీరింగ్‌ అధికారి ఉద్యోగ విరమణ సమయం ఆసన్నమవడంతో మరో రెండేండ్ల పొడగింపుకు పై అధికారులను అభ్యర్థిస్తున్నట్టు తెలుస్తోంది.

ఒక్కో బిడ్‌ పై 5శాతం కమీషన్‌!
అక్రమ మార్గంలో ఒక్కో బిడ్‌పై 5శాతం కమీషన్‌ పొందుతున్నట్టు ఎస్‌ఈపై ఆరోపణలు ఉన్నాయి. అది చాలదన్నట్టు 1శాతం ఈఎండీలనూ కైంకర్యం చేస్తున్నాడని కాంట్రాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. ఎస్‌ఈతో అవసరం పడిన ప్రతిసారీ కమీషన్లు చెల్లించాల్సి వస్తోందని బిడ్డర్లు వాపోతున్నారు. కాంట్రాక్టర్లకు అధికారులకు ఉండే అవినాభావ సంబంధం దృష్ట్యా తమకు జరుగుతున్న అన్యాయాన్ని కాంట్రాక్టర్లు చెప్పుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ‘నవతెలంగాణ’ కథనం తమకు ఎంతగానో ఊరటనిచ్చిందని హర్షం వెలిబుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -