కృత్రిమ మేధస్సు నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరగరాస్తున్న శక్తిగా నిలుస్తోంది. ఒకప్పుడు పరిశోధనా ప్రయోగశాలల్లో మాత్రమే ఉన్న ఎఐ, ఇప్పుడు కార్పొరేట్ నిర్ణయాల కేంద్రబిందువుగా మారింది. ఉత్పాదకత పెంపు, ఖర్చు తగ్గింపు, వేగవంతమైన నిర్వహణ, డిజిటల్ మార్పు ‘ ఇవన్నీ ఎఐ పేరిట వినిపిస్తున్న మధుర నినాదాలు. కానీ ఈ మెరుపు మాటల వెనుక ఒక కఠిన సత్యం దాగి ఉంది. అది ఏమిటంటే – ఎఐ వల్ల లాభాలు పెరుగుతున్న కొద్దీ, ఉద్యోగాలపై మేఘాలు కమ్ముకుంటున్నాయి. నిన్న మెటా, నేడు అమెజాన్, రేపు మరెంతో మంది. ఈ పరిణామం వ్యక్తిగత సంస్థల నిర్ణయాల సమస్య మాత్రమే కాదు, ఇది పూజివాద వ్యవస్థ తన అసలు స్వరూపాన్ని మరోసారి బయటపెడుతున్న ఘట్టం. సాంకేతికత మానవ సమాజానికి సహాయకారి కావాలి. శ్రమను సులభం చేయాలి. పని గంటలను తగ్గించాలి. జీవన నాణ్యతను మెరుగుపరచాలి. మానవ ప్రతిభను మరింత సృజనాత్మక రంగాలకు మళ్లించాలి. ఇదే సాంకేతిక పురోగమనానికి మానవీయ అర్థం. కానీ పూజివాద ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతకు అర్థం పూర్తిగా వక్రీకృతమవుతుంది.
అక్కడ యంత్రం మనిషికి సేవకుడు కాదు; లాభాన్ని పెంచే సాధనం. అక్కడ ఎఐ సమాజ అభ్యున్నతికి కాదు, షేర్ మార్కెట్‌కు. అక్కడ కొత్త ఆవిష్కరణ ప్రజల సౌకర్యానికి కాదు, కార్మిక వ్యయాలను తగ్గించేందుకు. ఇదే కారణంగా ఎఐ పట్ల భయం పెరుగుతోంది. ప్రజలు యంత్రాన్ని కాదు, యంత్రం వెనుక ఉన్న కార్పొరేట్ ఉద్దేశ్యాన్ని భయపడుతున్నారు. ఎందుకంటే ఉద్యోగ కోతలు ఇప్పుడు “సంక్షోభం” వల్ల కాదు, “సామర్థ్యం పెంపు” పేరిట జరుగుతున్నాయి. సంస్థలు ఒకవైపు భారీగా ఎఐలో పెట్టుబడులు పెడుతుంటే, మరోవైపు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీనిని “రీస్ట్రక్చరింగ”, “ఫ్యూచర్ రెడీనెస్”, “ఎఫిషియెన్సీ” వంటి మృదువైన పదాలతో అందంగా ప్యాక్ చేస్తున్నారు. కానీ వాస్తవం అంత సున్నితమైనది కాదు. ఇది శ్రమపై మూలధనం నిర్వహిస్తున్న కొత్త దాడి. ఇక్కడ అసలు ప్రశ్న ఎఐ మంచిదా చెడ్డదా అనేది కాదు. ప్రశ్న ఎంతో సూటిగా ఉంది.ఎఐ యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది? దాని వల్ల కలిగే లాభం ఎవరికీ వెళుతోంది? దాని భారాన్ని ఎవరు మోస్తున్నారు? నేడు సమాధానం స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతిక లాభం కార్పొరేట్ యజమానులకి, సామాజిక భారం కార్మికులకి. ఇదే పూజివాదపు మూల సూత్రం. ఉత్పత్తి సామూహికం, లాభం వ్యక్తిగతం. శ్రమ అందరిది, స్వాధీనం కొద్దిమందిదే.
ఎఐ వల్ల ఉత్పాదకత పెరిగితే, ఆ లాభం సహజంగా సమాజంలో పంచబడాలి. పని సమయం తగ్గాలి. వేతన భద్రత కలగాలి. ఉద్యోగుల పునర్‌శిక్షణకు హక్కు ఉండాలి. కొత్త సాంకేతికత వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికోసం సామాజిక భద్రతా వ్యవస్థ బలోపేతం కావాలి. కానీ ఇప్పుడేమి జరుగుతోంది? ఉద్యోగి మరింత అసురక్షితుడవుతున్నాడు. అదే పనిని తక్కువ మందితో చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. మిగిలిన వారిపై మరింత పనిభారం మోపబడుతోంది. కార్మికుడు యంత్రంతో పోటీపడాల్సిన పరిస్థితి సృష్టిస్తున్నారు. ఇది సాంకేతిక అభివృద్ధి కాదు, మానవ విలువల అవమానం. మార్క్స్ చెప్పిన “రిజర్వ్ ఆర్మీ ఆఫ్ లేబర్” సిద్ధాంతం ఇక్కడ మరింత స్పష్టంగా గుర్తుకొస్తుంది. నిరుద్యోగ భయం పూజివాదానికి ఒక ఆయుధం. అది వేతనాలను కట్టడి చేయడంలో, యూనియన్లను బలహీనపరచ డంలో, కార్మికుడిని విధేయుడిగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేడు ఆ భయానికి కొత్త పేరు ఎఐ “నీ పని ఆటోమేట్ అవుతుంది”, “మోడల్ నీకంటే వేగంగా చేస్తుంది”, “ఖర్చు తగ్గించాలి” – ఇవే ఆధునిక కార్పొరేట్ హెచ్చరికలు.
ఈ హెచ్చరికలు కేవలం ఉద్యోగాలను కాదు, మానవ గౌరవాన్నే కుదించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే, ఈ మార్పు సమానంగా అందరిపై పడడం లేదు. మధ్యతరగతి కార్యాలయ ఉద్యోగాలు, సృజనాత్మక పనులు, సమా చార ప్రాసెసింగ్, కంటెంట్ రంగాలు, మేనేజ్‌మెంట్ సహాయక విభాగాలు -ఇవన్నీ ఎఐ ప్రభావానికి గురయ్యే అవకాశముంది. మహిళలు, ఒప్పంద ఉద్యోగులు, యువ కార్మికులు, టెక్ రంగంలో మధ్యస్థాయి సిబ్బంది ఈ మార్పునకు మరింత సంక్షోభంగా నిలుస్తున్నారు. అంటే ఇది కేవలం ఉద్యోగ సమస్య మాత్రమే కాదు; ఇది వర్గ అసమానతను, లింగ అసమానతను, ఆదాయ వ్యత్యాసాలను మరింత పెంచే ప్రమాదం.కార్పొరేట్ వాదన ఒకటి తరచూ వినిపిస్తుంది: “కొన్ని ఉద్యోగాలు పోతే, కొత్త ఉద్యోగాలు వస్తాయి.” ఇది పాత వాదన. పారిశ్రామిక విప్లవం కాలం నుంచే ఇదే మాట వినిపిస్తోంది. కానీ ప్రశ్న అక్కడే ఉంది – ఎవరికి కొత్త ఉద్యోగాలు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? పోయిన ఉద్యోగానికి సమానమైన భద్రతతో వస్తాయా? అదే ఆదాయంతో వస్తాయా? ఆ మధ్యలో జీవితం ఎలా సాగాలి? ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా “మార్పు సహజం” అని చెప్పడం, బాధితులకష్టాన్ని నిర్లక్ష్యం చేయడమే.
అందుకే ఎఐని అడ్డుకోవాలని కాదు, ఎఐపై ప్రజాస్వామ్య నియంత్రణ ఉండాలని డిమాండ్ చేయాలి.
సాంకేతికతపై సమాజానికి హక్కు ఉండాలి. డేటా, డిజిటల్ మౌలిక వసతులు, ఆటోమేషన్ వల్ల కలిగే అధిక లాభాలు కేవలం కొద్దిమంది పెట్టుబడిదారుల ఖాతాల్లోనే చేరకూడదు. ఎఐ వల్ల కలిగే ఉత్పాదక లాభంలో కార్మికులకు వాటా ఉండాలి. ఉద్యోగ కోతల ముందు తప్పనిసరి కార్మిక సంప్రదింపులు ఉండాలి. పని గంటల తగ్గింపు, పూర్తి వేతన భద్రత, యూనియన్ హక్కుల రక్షణ, ప్రభుత్వ ఆధ్వర్యంలో పునర్‌శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్ రంగంలో ప్రజా విధాన జోక్యం -ఇవే నేటి అత్యవసర అవసరాలు. ఇప్పటి పరిస్థితి మన ముందొక స్పష్టమైన సత్యాన్ని ఉంచుతోంది. సమస్య ఎఐ కాదు. సమస్య ఎఐని వినియోగిస్తున్న ఆర్థిక వ్యవస్థ. పూజివాదంలో ప్రతి ఆవిష్కరణ మొదట లాభం కోసం పనిచేస్తుంది; మానవ అవసరం తరువాత వస్తుంది. అందుకే అక్కడ యంత్రం విముక్తి కాదు, బెదిరింపు. కానీ ప్రజా కేంద్రీకృత, శ్రామికహిత దృక్కోణంలో అదే ఎఐ శ్రమభారాన్ని తగ్గించే శక్తిగా మారుతుంది. ఇదే రెండు వ్యవస్థల మధ్య తేడా. నేడు సమాజం ఒక నిర్ణయాత్మక మలుపు వద్ద ఉంది. ఒక మార్గం – ఎఐ పేరిట కొద్దిమంది కార్పొరేట్ దిగ్గజాలకు అపార సంపదను సృష్టించే దారి. మరో మార్గం -ఎఐ ఫలితాలను సమాజ సంక్షేమానికి మళ్లించే సమానత్వ దారి. మొదటి మార్గం నిరుద్యోగం, అసమానత, భయం, వేతన క్షీణత వైపు తీసుకువెళుతుంది. రెండో మార్గం సామాజిక న్యాయం, శ్రమ గౌరవం, సాంకేతిక ప్రజాస్వామ్యం వైపు తీసుకువెళుతుంది. అందువల్ల నేటి చర్చ “ఎఐ వస్తుందా?” అనే ప్రశ్నపై ఉండకూడదు. అది ఇప్పటికే వచ్చేసింది. అసలు చర్చ “ఎఐ ఎవరి కోసం పని చేస్తుంది?” అన్నదే కావాలి. యంత్రాలు కొద్దిమందికి సంపదను సృష్టించాలా? లేక సమాజానికి విశ్రాంతి, భద్రత, సంక్షేమాన్ని అందించాలా? నిన్న మెటా, నేడు అమెజాన్, రేపు మరొక కార్పొరేట్ సంస్థ. పేర్లు మారవచ్చు. కానీ పోరాటం ఒకటే – సాంకేతికతపై సమాజ హక్కు, శ్రమపై గౌరవ హక్కు, భవిష్యత్తుపై ప్రజా నియంత్రణ.
కోట మురళీకృష్ణ
9182001044



