ఒకవైపు ఉద్యోగాలు లేవు. మరోవైపు ఉన్నత విద్యకు ద్వారాలుగా భావించే పరీక్షలకు భద్రత లేదు. లక్షలాది మంది యువతకు భవిష్యత్తు లేదు. మరి నిరుద్యోగులు ఏం చేయాలి? నీట్ వంటి పరీక్షలు లీకేజీలకు బలవుతుంటే, సంవత్సరాల శ్రమతో సిద్ధమైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, బాధ్యత వహించాల్సిన పాలకులు తప్పించుకుంటుంటే విద్యార్థి యువత ఇంకేం చేస్తుంది? వారికీ ఆగ్రహం, ఆవేదన ఉంటాయి. వాటికి ప్రతిబింబమే మొన్న ఢిల్లీ ‘జంతర్ మంతర్’ వద్ద వినిపించిన నిరసన స్వరం. వేలాది మంది విద్యార్థులు, యువకులు, పాల్గొని నినదించడం సాధారణ పరిణామం కాదు, ఎన్నో ఏండ్ల నుంచి వారిలో దాగున్న నిరాశ, నిస్పృహలకు సంకేతం. ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ లెక్కన ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్లకు పైగా ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇచ్చారా? లేదన్న సంగతి యువత నినా దంలోనే తెలుస్తోంది. పిఎల్‌ఎఫ్‌ఎస్ అధికారిక గణాంకాలు నిరుద్యోగిత రేటు 3.1శాతం మాత్రమే ఉన్నట్టు చెబుతున్నా, అదే నివేదికలో పదిహేను నుంచి ఇరవై ఏళ్ల యువతది 9.9శాతంగా ఉందని పేర్కొంది.
కానీ స్వతంత్ర సర్వేలు అధికారిక సంఖ్య కంటే దాదాపు రెండింతలు ఎక్కువే ఉంటుందని చెప్పాయి. కనీసం వాస్తవాల్ని కూడా అంగీకరించని పాలన మనది. నిరుద్యోగం సామాజిక సమస్యగా మారడానికి కేంద్రమే కారణం. లక్షలాది ఖాళీలు పేరుకుపోయాయి. వాటిని భర్తీ చేయకపోగా ‘మిర్చీలు, పకోడీలు’ అమ్ముకోవడం కూడా ఒక ఉద్యోగమేనని సెలవిచ్చారు మన పాలకులు. వారిని నమ్మి ఓటేసినందుకు మిర్చీలు, పకోడీలు అమ్ముకుంటూ బతకాలా? ఇప్పటికే మోడీ పాలనలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడ్డారు. వారి కుటుంబాల పరిస్థితేమిటి? దేశ అభివృద్ధికి, తమ భవిష్యత్తుకు యువత విద్యనే ఆయుధంగా భావించింది. నీట్, జేఈఈ, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ వంటి పరీక్షలకు సంవత్సరాల తరబడి సిద్ధమవుతోంది. కానీ ఒక పరీక్ష లీక్ అయితే వారి భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతోంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష రద్దయి మళ్లీ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మరో విషాదకరమైన విషయం, విద్యార్థుల ప్రాణాలు పోతుండడం. కేరళలో పంతొమ్మిదేళ్ల ఐజా ఆర్. మహేశ్ అనే విద్యార్థిని నీట్ పరీక్ష ఒత్తిడి, అనిశ్చితి మధ్య ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యులు ఆమెను వైద్యురాలిగా చూడాలని కలలు కన్నారు. కానీ ప్రశ్నాపత్రాల లీకేజీ, మళ్లీ పరీక్ష, మానసిక ఒత్తిడి చివరకు ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయి. ఒక్క ఐజా మాత్రమే కాదు. నీట్ లీకేజీ తర్వాత ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ మరణాలకు బాధ్యత ఎవరిదో వేరే చెప్పనక్కర్లేదు! ఇదేకాదు, గత కొన్నేళ్లుగా నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల ఒత్తిడితో దేశవ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి మరణం వెనుక ఒక కుటుంబం ఛిన్నాభిన్నమవుతోంది. ఒక తల్లి కన్నీళ్లు, ఒక తండ్రి విరిగిపోయిన ఆశలు, ఒక చెల్లి లేదా తమ్ముడి కోల్పోయిన బంధం దాగి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు మాత్రం వీటిని గణాంకాలుగానే చూడటం విచారకరం. లీకేజీ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా అరెస్టులు కూడా జరిగాయి. నిందితుడు ఆరెస్సెస్ సంబంధికుడని తేలింది. కానీ, కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. ‘ఈ లీకేజీ వ్యవహారంతో నాకేం సంబంధం, ఏదైనా ఉంటే అధికార యంత్రాంగం చూసుకుంటుంది’ అన్నట్టు కేంద్ర విద్యామంత్రి ధోరణి ఉంది. ఇలాంటి నేతలు ఉన్నప్పుడు విద్యార్థులు వీధుల్లోకి రాకుండా ఏం చేస్తారు? వారికి కావాల్సింది న్యాయం. అందుకే జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసన ఒక జ్వాలగా ఎగిసిపడింది.
విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా అందులో పాల్గొనడం కదిలించిన అంశం. ప్రజాస్వామ్యంలో రాజకీయ బాధ్యత అత్యంత కీలకం. ఒక శాఖ పరిధిలో పదేపదే వైఫల్యాలు జరుగుతున్నప్పుడు సంబంధిత మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ఇదే కారణంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు వరుసగా జరుగుతుంటే, పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటుంటే, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేవలం విచారణలతో సరిపోదు. వైఫల్యానికి కేంద్రమే బాధ్యత వహించాలి. అందుకే “మేక్ ఇన్ ఇండియా అడిగితే లీక్ ఇన్ ఇండియా ఇచ్చారు” అనే నినాదం అక్కడ మార్మోగింది. దేశంలోని యువత ఉద్యోగాలు కోరుతోంది, న్యాయమైన పరీక్షలు కోరుతోంది, భవిష్యత్తుపై భరోసా కోరుతోంది. కానీ వారికి లభిస్తున్నది నిరు ద్యోగం, లీకేజీలు, అనిశ్చితి మాత్రమే. పరీక్ష నిర్వహణలో ఫెయిలైన జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ)పై స్వతంత్ర విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్య లుండాలి. నీట్ లీకేజీ ఘటనను ఒక సాధారణ సమస్యగా కాకుండా దేశ విద్యా వ్యవస్థకు వచ్చిన హెచ్చరికగా చూడాలి. విద్యార్థుల కన్నీళ్లకు, తల్లిదండ్రుల వేదనకు, నిరుద్యోగ యువత ఆగ్రహానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.
యువజన గళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



