Thursday, June 11, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఆదివాసీల ఆరోగ్యం అంటే అంత అలుసా ?

ఆదివాసీల ఆరోగ్యం అంటే అంత అలుసా ?

- Advertisement -

భద్రాచలం ప్రభుత్వాస్పత్రిని సీఎం స్వయంగా సందర్శించాలి
మృతదేహాన్ని భుజాలపై మోసినా స్పందించని మంత్రులు
సిబ్బంది కొరతతో నిర్వీర్యమవుతున్న ప్రభుత్వ వైద్యం :
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీపీఐ(ఎం) బృందం

నవతెలంగాణ-భద్రాచలం
ఆదివాసీ ప్రజల ఆరోగ్యమంటే ప్రభుత్వానికి ఇంత అలుసేందుకని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఒక్కసారి స్వయంగా వచ్చి సందర్శించి ఇక్కడ అందుతున్న వైద్యాన్ని పరిశీలించాలని అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ తదితరులు సందర్శించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం ఇన్‌‌చార్జి సూపరిండెంటెండ్‌ డాక్టర్ రాజశేఖర్ రెడ్డితో పలు సమస్యలపై చర్చించారు. కొన్ని మందులు బయట మందుల దుకాణాలకు రాస్తున్నారని రోగులు జాన్‌‌వెస్లీకి ఫిర్యాదు చేయగా.. ఆ అంశాన్ని సైతం రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న వర్షాకాల సీజన్ నాటికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. ప్రతిరోజూ 400 నుంచి 600 మంది రోగులు ఈ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారని, అందులో 80 నుంచి 90 శాతం ఆదివాసీ గిరిజన ప్రజలేనని అన్నారు.

వందల సంఖ్యలో వస్తున్న రోగులకు వైద్య సేవలు అందించడానికి కేవలం 19 మంది డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. మొత్తం 212 మంది వైద్య సిబ్బంది అవసరం కాగా కేవలం పదుల్లోనే విధుల్లో ఉన్నారంటే ఏజెన్సీ వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి చెందిన అంబులెన్స్ మరమ్మతులకు గురై రెండేండ్లు కావస్తున్న కనీసం జిల్లా అధికారులు కూడా పట్టించుకోవడంలేదని, ఆ ఫలితంగానే మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్ళే దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఉమ్మడి జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిపై కనీసం దృష్టి పెట్టడం లేదని అన్నారు. ఆస్పత్రి ఆవరణలోని మరుగుదొడ్లకు తలుపులు సైతం లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, అత్యాధునికమైన స్కానింగ్ ఎక్స్‌ రే పరికరాలు ఉన్నప్పటికీ రేడియాలజిస్ట్ లేక పరీక్షల కోసం ప్రయివేట్‌ హాస్పటల్‌‌కి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఆస్ప్రతిలోని సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో సమగ్ర సర్వే నిర్వహించి వచ్చిన సమస్యలపై ఆగస్టు మొదటి వారంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగివచ్చి నాణ్యమైన వైద్యం అందించకపోతే ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఐటీడీఏలపై నిర్లక్ష్యం, ప్రభుత్వ వైద్యంపై ప్రభావం : బండారు రవికుమార్
ఐటీడీఏలపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం.. ఏజెన్సీ ఏరియాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రభావం పడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి జరగక మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. గతంలో ఐటీడీఏ నుంచి వచ్చే నిధులతో హాస్పటల్‌‌లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. నేడు కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా లేకుండా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి దిగజారిపోయినా.. ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు కేంద్రంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సగానికి పైన వైద్య పోస్టులు ఖాళీగా ఉంటే ఆదివాసీ ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. గతంలో ప్రజా ప్రతినిధులుగా పనిచేసిన వారి పోరాట ఫలితంగా 200 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వైద్యుడు అయినప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రేమ లేదని అన్నారు. ఆస్పత్రి పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రం శెట్టి వెంకట రామారావు, పారేల్లి సంతోష్ కుమార్, డి. సీతాలక్ష్మి, 20వ వార్డు నెంబర్ ఇర్ప అనసూయ, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -