ప్రపంచ దేశాలతోనే మాకు పోటీ
డిసెంబర్‌లో మరోసారి గ్లోబల్ సమ్మిట్
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే వారికి గతమే తప్ప ఫ్యూచర్ లేదు .. ‘తొలకరి’కే రోడ్లు స్తంభిస్తే ఎలా?
ఈ పాపం గత ప్రభుత్వానిదే : భారత్ ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘‘కులీ కుతుబ్ షా, నిజాం నవాబులు హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంతో ప్రపంచ పటంలో గొప్ప గుర్తింపు సాధించింది. భవిష్యత్‌లో ఫ్యూచర్ సిటీ భావితరాలకు భవిష్యత్‌ను ఇవ్వనుంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 200 ఏండ్ల కింద సికింద్రాబాద్‌ను విస్తరించడంతో ఇప్పుడు జంట నగరాలుగా విరాజిల్లుతున్నాయని అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీలో భారత్ ఫ్యూచర్ సిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంలో ఆశీనులైన సీఎం పలు ఫైల్స్‌పై సంతకం చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాల్ని తెస్తూ సభా వేదికపైనే సంతకం చేశారు. అలాగే మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెన్సీ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డును అందచేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ సైబరాబాద్ సాంకేతిక విప్లవమనీ, రాష్ట్ర ఆదాయంలో 60 శాతాన్ని అందిస్తూ తెలంగాణ ముఖచిత్రాన్నే మార్చిందన్నారు.
సైబరాబాద్‌లో ఎకరం భూమి రూ.200 కోట్ల పైగా ధర పలుకుతుందంటే బంగారం కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువని తెలుస్తుందన్నారు. 1908లో తూఫాన్ వచ్చి వేలాది మంది మరణిస్తే చలించిపోయిన నిజాం సర్కార్ గండిపేట, హిమయత్ సాగర్‌తో పాటు మూసా, ఈసా నదుల ప్రవాహం నగరాన్ని ముంచేయకుండా మూసీనదిని నిర్మించారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరాన్ని నిర్మించి ప్రపంచానికి తలమానికం చేశారన్నారు. ఆ రోజుల్లో ఐటీ, పార్మా కంపెనీలు మాకొద్దని చెప్పిన వారున్నారనీ, ఆనాటి ముఖ్యమంత్రులు రాష్ర్టంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలను తేకపోయి ఉంటే 10 లక్ష మంది తెలంగాణ యువత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేవారు కాదన్నారు.
పెద్ద రాక్షసులు.. పిల్ల రాక్షసులు
ఫ్యూచర్ సిటీ నగరాన్ని అడ్డుకుంటామని పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు ప్రగల్బాలు పలుకుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అమెరికా వేదిక నుంచి తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలో.. నిర్మించాలో యువతరం చెప్పాలని కోరారు. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామంటే.. భవిష్యత్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా వారిని ప్రజలు బండకేసి కోడతారన్నారు.
చెరువుల్లో ఉండాల్సిన నీరు రోడ్లపైకి..
హైదరాబాద్ నగరంలో మంగళవారం రెండు గంటల పాటు వర్షం కురిస్తే.. ఎక్కడికక్కడ స్తంభించి పోయిందని సీఎం అన్నారు. కిలోమీటర్ ప్రయాణానికి గంటల సమయం పట్టిందన్నారు. దీనికి ఎవరు కారణమో ప్రతిపక్షాలు చెప్పాలన్నారు. పందేండ్ల కాలంలో ఎక్కడిక్కడ చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాపెట్టి నిర్మాణాలు చేపట్టడంతో చెరువుల్లో ఉండాల్సిన నీరు రోడ్ల మీదికి వస్తున్నదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నుంచి నగరాన్ని రక్షించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే నల్ల చెరువు, సున్నం చెరువు, బతుకమ్మ కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడామన్నారు. ఎంతో చరిత్ర కలిగిన బతుకమ్మ కుంటను ఎడ్ల సుధాకర్‌రెడ్డి కబ్జాపెట్టారనీ, ఆయన నుంచి ఆ కుంటను కాపాడాల్సిన కేసీఆర్ పూలు చల్లించుకుని బతుకమ్మ కుంటను అప్పగించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుంటను పునరుద్దరించందన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో ప్రభుత్వ స్కూల్స్, పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉందన్నారు. ముంబయి, చెన్నైలో వర్షాలు వస్తే పడవల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్‌లో రావొద్దన్న ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ వేదికగా అభివృద్ధి కార్యాచరణ
భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాలయ నిర్మాణాన్ని కేవలం 150 రోజుల్లో పూర్తిచేశామన్నారు. ఇది ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమని తెలిపారు. అధికారులు పని పట్ల అంకిత భావాన్ని నిరుపించారనీ, ఇదే స్పీడ్‌తో భవిష్యత్‌లో ఫ్యూచర్ సిటీ వేదికగా అభివృద్ధి కార్యాచరణ ఉంటుందన్నారు. 2034లో తెలంగాణ ఎకానమీ వన్ ట్రిలియర్‌ను రీచ్ అయ్యేందుకు ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సింగపూర్, అమెరికాతో ఫ్యూచర్ సిటీ పోటీపడుతుందన్నారు. ఇదే కేంద్రంగా అంతర్జాతీయ వ్యవహారాలు కొనసాగిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలు ఈ ప్రాంతానికి వచ్చాయని, ఈ ఏడాది డిసెంబర్‌లో కూడా మరోసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. సమయం ఉన్నప్పుడు ఫ్యూచర్ సిటీ కార్యాలయానికి వస్తానని, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు.. వారంలో రెండు రోజులు ఇక్కడికి వస్తారని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో కొన్ని గ్రామాలను కలపాలని వచ్చిన దరఖాస్తులను స్వీకరించామని, సూచన ప్రాయంగా కొన్ని గ్రామాలను కలిపామని, మిగిలిన గ్రామాలపై ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.



