ఐదేండ్ల కాళేశ్వరం కూలింది
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయి
ఇరిగేషన్ కాలువలపై సౌరఫలకలు:
ఇరిగేషన్, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటన
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/ మహాదేవపూర్
“నిజాం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు వందేండ్లు దాటినా చెక్కు చెదరలేదు.. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్‌తోపాటు ఇతర ప్రాజెక్టులు ఇప్పటికీ గట్టిగున్నాయి. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదేండ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం కుప్పకూలింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు చెప్పినా రైతులకు ఉపయోగపడిందేమీ లేదు. డిజైన్, నిర్మాణ లోపాలతో కూలినట్టు విచారణలో తేలింది. అయినా వీటిని రాజకీయం చేయదలుచుకోలేదు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులతో పునరు ద్ధరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో రూ.106 కోట్లతో నిర్మించిన జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌షెట్కార్‌తో కలిసి ప్రారం భించారు. అంతకు ముందు సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించారు. జాకోరాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకై జరుగుతున్న సాంకేతిక పరీక్షల పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల్లో పూడిక చేరి నీటి నిలువ సామర్థ్యం తగ్గుతూ వస్తుందని, పూడిక తీత పనులు చేపట్టి వాటి నిల్వ సామర్థ్యం పెంచనున్నట్టు తెలిపారు. ఇది వరకే లోయర్ మానేర్, మిడ్ మానేర్ డ్యాంలతో పాటు కడెం ప్రాజెక్టులో పనులు చేపడుతున్నట్టు చెప్పారు. నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలకు చేరిందని.. పూడిక తీసి 28 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూ సేకరణ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు భూమి కేటాయింపు తదితరాలకు ప్రత్యేక ఫైనాన్షియల్ ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించినట్టు గుర్తుచేశారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయించేందుకు రూ.200 కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల కాలువలపై సౌరపలకలు ఏర్పాటు చేయించి విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
2027 వరకు సాగునీరు అందించేందుకు చర్యలు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు మరమ్మతులు 2027 ఎండాకాలం వరకు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకై జరుగుతున్న సాంకేతిక పరీక్షల పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.38వేల కోట్లతో 16.50 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించేందుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిందన్నారు. దాదాపు రూ.11 వేల కోట్లతో సుమారు 30 శాతం పనులూ జరిగాయని తెలిపారు. 2014లో రాష్ట్రం ఏర్పాటుతో ఏర్పడిన ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్పు చేసి మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు చెప్పారు. దాదాపు రూ.1.45 లక్షల కోట్లతో మేడిగడ్డ బ్యారేజీ పనులు చేపట్టారని, కానీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్ల కుంగిందన్నారు. ప్రాజెక్టు కుంగడానికి గల కారణాలను లోతుగా విశేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్‌ఏ వంటి సంస్థలతో పరీక్షలు చేయిస్తున్నామని అన్నారు.
నివేదిక ఈ నెలాఖరు లేదా జులై మొదటి వారం వరకు వస్తుందని, దాని ఆధారంగా బ్యారేజ్ పునరుద్ధరణ డిజైన్ చేయాలని సంకల్పించినట్టు తెలిపారు. సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎస్‌ఏ అనుమతి తీసుకొని ఈ వర్షాకాలం కాగానే నవంబర్, డిసెంబర్ నెలల్లో పనులు చేపడతామని అన్నారు. 2027 ఎండాకాలం వరకు పనులు పూర్తి చేసి, అదే ఏడాది వర్షాకాలానికి సాగునీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ మరమ్మతులూ చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎస్‌ఈ శ్రీదేవి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
వందేండ్ల నిజాంసాగర్ చెక్కుచెదరలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



