నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. వచ్చే నెల మార్చి 9కి స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై మొదటి దఫా చర్చలు ముగిశాయి. జనవరి 28న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. 65 రోజుల పాటు 30 సమావేశాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 2న ముగియనున్నాయి. ఈ విరామం వల్ల స్టాండింగ్ కమిటీలు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల గ్రాంట్ల డిమాండ్లను పరిశీలించడానికి వీలు కలుగుతుంది.
ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో అమెరికా-ఇండియా వాణిజ్య ఒప్పందంపై, మాజీ ఆర్మీ జనరల్ నవవాణే రాసిన ఫోర్ స్టార్స్ డెస్టనీ బుక్ లపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు ప్రకంపనలు సృష్టించాయి. ఉభయ సభల్లో సదురు అంశాలపై చర్చ జరగాలని స్పీకర్ పోడియం ఎదుట ప్రతిపక్షాల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్..సీపీఐ(ఎం) పార్టీ ఎంపీతో పాటు 8మంది ఎంపీలపై వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సస్పెండైన ఎంపీలకు మద్దతుగా ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిరోజు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్పీకర్ ఓం బిర్లా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, సభలో ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్నారని మండిపడ్డాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై ప్రసంగించడానికి ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశాయి.
అంతేకాకుండా యూఎస్ ట్రేడ్ డీల్ పీఎం మోడీ సమాధానం చెప్పాలని లోక్ సభలో ఎంపీలందరూ భారీ ఆందోళనకు దిగారు.దీంతో ప్రతిపక్షాల ఆందోళనతో పీఎం మోడీ రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడానికి రాజ్యసభకు వెళ్లారు. అయితే ఆయన రాకను నిరసిస్తూ రాజ్యసభలో ప్రతిపక్షాలు సభను వాకౌట్ చేశాయి. దీంతో ఈసారి బడ్జెట్ సమావేశాల్లో యూఎస్ డీల్, నరవాణే బుక్ లపై చర్చ పెట్టాలనే డిమాండ్‌లతోనే పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.



