Thursday, June 11, 2026
E-PAPER
Homeమానవిసాయం చేయడంలోనే తృప్తివుంది

సాయం చేయడంలోనే తృప్తివుంది

- Advertisement -

చర్ల మృదుల… వయసు ఎనిమిది పదులు దాటినా నిత్యం ఏదో చేయాలనే తపన. నలుగురికీ సాయం అందించాలనే సంకల్పం. ఇటు సాహిత్యంలోనూ, అటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఎన్ని చేసినా సంఘసేవలోనే తనకు ఎంతో తృప్తి ఉందంటున్న ఆమె జీవితం ఎందరికో ఆదర్శ ప్రాయం. ఇటీవలె అక్షరయాన్ మాతృవందనంలో సత్కారం పొందిన ఆమె పరిచయం నేటి మానవిలో…

1944లో పుట్టిన చర్ల మృదుల అమ్మ నాన్నలకు ఐదవ సంతానం. మృదుల తన చిన్నతనంలో బడికి వెళ్లలేదు. తండ్రి వద్దనే తెలుగు, సంస్కృతం హిందీ నేర్చుకున్నారు. మొదటి నుండి నలుగురికి తోచిన సాయం చేయడమంటే ఎంతో ఇష్టం. దాంతో అక్కతో కలిసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రస్తుతం ఎనభై ఏండ్లు దాటినా ఇప్పటికీ సమాజానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. సమాజ సేవ చేస్తున్న ఆమె అక్క పెండ్లి చేసుకోలేదు. దాంతో ఈమె కూడా అక్కను అనుసరించి అవివాహితగా ఉండిపోయారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో
మృదుల బి.ఇడి పూర్తి చేశారు. ఆ తర్వాత బి.ఎ.ఎం.ఏ. ప్రైవేట్ చదివి హిందీలో పి.హెచ్.డి. చేశారు. విశాఖ ఎ.ఎన్.రాజా కాలేజీలో పదిహేనేండ్లు వి.ఎం.సి. విద్యాపీఠ్ లో లెక్చరర్‌‌గా, రెడ్ క్రాస్ లేడీ గైడ్ కెప్టెన్‌గా పనిచేసి 2002లో రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత తన అక్కతో కలిసి నాటకాలు, బుర్ర కథలు వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ‘మనం సంపాదించిన దానిలో కొంత దానం చేయాలి’ అనేది ఈమె అభిప్రాయం. ఈమె తండ్రి చర్ల గణపతిశాస్త్రి నెలకొల్పిన కస్తూరీబాయి మహిళా సమాజం(1950) ఆధ్వర్యంలో మహిళా అభ్యున్నతికై చేసిన సేవలు చెప్పుకోదగ్గవి.

సేవాకార్యక్రమాలు
అక్కా చెల్లెళ్లు కలిసి పాతపట్టిశంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే చర్ల సుశీల వృద్ధాశ్రమం, లయన్స్ క్లబ్ ఆఫ్ తిమ్మరాజుపాలెంలో చేసిన కృషితో అందరి ప్రశంసలు అందుకున్నారు. గాంధీజీ మనవరాళ్లు అయిన తారా గాంధీ, ఉషా గోకానీలను కలవటం తన మధుర స్మృతి అంటారామె. సామాజిక సేవలోనే కాదు మృదుల సాహిత్య సేవ సైతం నిరుపమానం. హిందీలో డాక్టరేట్ చేసిన మృదుల పద్యాలు, కథలు, వ్యాసాలు ఎన్నో రాశారు. తండ్రి పెట్టిన ప్రింటింగ్ ప్రెస్ బాధ్యతలు అక్కతో కలిసి నిర్వహించారు. జాతీయ అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు రాలేదు కానీ 25పైగా సంస్థలు వీరిని సన్మానించాయి. నిత్యం ఈ అక్కచెల్లెళ్లు ఖద్ధరు వస్ర్తాలను మాత్రమే ధరిస్తారు. అలాగే వినోబాసర్వోదయ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అన్నింటికి మించి తండ్రి నుండి వీరికి వచ్చిన ఐదు ఎకరాల భూమిని దానం చేశారు. ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’ అనేది వీరి లక్ష్యం.
– అచ్యుతుని రాజ్యశ్రీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -