Sunday, February 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమీడియా ఉద్యోగాలు, ఉద్వేగాలపై కత్తివేటు

మీడియా ఉద్యోగాలు, ఉద్వేగాలపై కత్తివేటు

- Advertisement -

గుజరాత్‌లోని ఒక మేజిస్ట్రేట్‌ కోర్టు సీనియర్‌ జర్నలిస్టు రవి నాయర్‌కు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధించింది. 2020-2021 మధ్య ఆయన చేసిన ట్వీట్ల కారణంగా తమకు పరువు నష్టం కలిగిందని అదానీ గ్రూపు దాఖలు చేసిన కేసు ఇందుకు దారితీసింది. అయితే ఆ సమాచారం ఆయన స్వయంగా రాసిందా అంటే అదీ లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు ట్రస్టు ప్రయివేటీకరణ ప్రతిపాదనకు సంబంధించి అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ పరిశోధనా కేంద్రం వెల్లడించిన కథనాలను రీట్వీట్‌ చేయడమే ఆయన నేరం. ఇది న్యాయమైన విమర్శ లేదా సహేతుక వ్యాఖ్య కిందకు రావని, నాయర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ తప్పు సమాచారం ప్రచురించారని వారు ఆరోపించారు. కోర్టు ఆ ఫిర్యాదులు నిరూపితమైనాయని భావించింది. ఇది కేవలం సమన్లతో ముగించే కేసు వంటిదేగాని ప్రత్యేకంగా విచారణ కూడా అవసరం లేదని వ్యాఖ్యానించింది. జర్నలిస్టుగా, వ్యాఖ్యాతగా నాయర్‌కు తన మాటల ప్రభావం ఎలా వుంటుందో తెలిసి కూడా ఈ పని చేశాడని అభిప్రాయపడుతూ ఇలాంటి కేసులలో ఏదో పొరబడి వుంటారని అనుకోవడానికి లేదనీ, అలా చేస్తే అసలు ఈ చట్టం ఉద్దేశమే వమ్మయిపోతుందని పేర్కొంది. అయినా కొద్దిపాటి జరిమానా పరిమిత శిక్ష సరిపోతాయని తీర్పునిచ్చింది. అంటే ఈ కోర్టు ఉద్దేశంలో ఒక జర్నలిస్టుకు ఏడాది శిక్ష వేయడం చిన్న విషయమన్నమాట.

అటూ ఇటూ దాడులు
ఇక్కడ తమాషా ఏమంటే హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత కొన్నేళ్లకు ఇటీవలనే అమెరికా పన్నుల శాఖ అదానీ గ్రూపు అవకతవకలపై ఒక సుదీర్ఘ పరిశోధన ప్రకటించింది. విద్యుత్‌ కాంట్రాక్టుల కోసం వారు ముడుపులు చెల్లించినట్టు వెల్లడిం చింది. ఈ ముడుపుల వ్యవహారం ఇండియా లో జరిగిందైనప్పటికీ అమెరికా ద్వారా జరిగింది గనక విచారించాలని సిఫార్సు చేసింది. ఆ విషయమై భారత దేశంలో ఎంత వత్తిడి వచ్చినా మోడీ సర్కారు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అదేదో అమెరికా వ్యవహారమని మనం తలదూర్చన వసరం లేదని సమర్థించుకుంది. ఆఖరుకు అదానీకి అమెరికా అధికారులు సమన్లు జారీ చేస్తే ఏవో సాకులతో వాటి బట్వాడాకు కూడా నిరాకరించారు. మళ్లీ ఇటీవలనే ఎందుకో కొంత కదలికకు అవకాశమి చ్చారు గాని అదానీని ఏదో విచారించి చర్య తీసుకుంటారనే అంచనా ఎవరికీ లేదు. కానీ అమెరికా కోర్టు మాత్రం విచారణ జరుపుతూనే వుంది. మోడీకి అత్యంత సన్నిహితు డుగా పేరొందిన అదానీపై ఈగ వాలినా కేంద్రం సహించబోదనే విషయం అందరికీ తెలుసు. కనుక ముడుపుల విషయంలో ఆయనపై చర్య తీసుకోక పోవడంతో ఆ గ్రూపు తమపై కథనాలు వ్యాసాలు ప్రచురించిన జర్నలిస్టులపై కేసులు వేసింది. కనీసం ముగ్గురు సీనియర్‌ జర్నలిస్టులు పరంజరు ఠాకూర్‌, రవినాయర్‌, అబీర్‌ దాస్‌ గుప్తాలపై లీగల్‌ యుద్ధం ప్రారంభించింది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా అదానీపై కథనాలిచ్చిన జర్నలిస్టులపైన సంస్థలపైన పరోక్ష యుద్ధం చేసింది. న్యూస్‌ క్లిక్‌, బిబిసి కార్యాలయాలపై పన్ను చెల్లింపులు తదితర పేర్లతో దాడులు చేసింది. 2013లోనో మరెప్పుడో ఏదో ఒక రుణం విషయంలో వివరాలు చూపించలేదని ప్రణరు రారు ఎన్‌డిటివిని కోర్టుల చుట్టూ తిప్పింది. మరోవంక మారుపేరుతో అదానీ గ్రూపు ఆ సంస్థను కొనుగోలు చేసి స్వాధీనం చేసుకుంది. ఈ మధ్యనే కోర్టు రారు దంపతులపై ఆ కేసు కొట్టివేసి ఐటి శాఖకు జరిమానా విధించింది. ఇలాగే న్యూస్‌క్లిక్‌పై దాడులు చేసి ప్రబీర్‌ పురకాయస్థను అరెస్టు చేసింది. తీవ్ర న్యాయపోరాటం తర్వాత ఆయన బయటకు వచ్చినా కేసు కొనసాగుతూనే వుంది. గుజరాత్‌ ఫైల్స్‌ రాసిన రానా అయూబ్‌, పరివార్‌ దాడులపై పోరాడిన తీస్తా సెతల్వాద్‌తో సహా లౌకికవాద కృషి చేసిన వారెందరినో పనిచేయలేని పరిస్థితులలోకి నెట్టింది. యు.పిలో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం అచ్చంగా జర్నలిస్టులపై వరుస వేధింపులకు పాల్పడటాన్ని కోర్టులు కూడా పలుసార్లు తప్పుపట్టాయి. విమర్శకుల నోళ్లు నొక్కడమే దీనంతటి వ్యూహం. ప్రముఖులైన వారికే ఈ పరిస్థితి వచ్చిందంటే ఇక యూట్యూబర్లు, ఇన్‌ఫ్లు యన్సర్లపై మరెంత దాడి జరుగుతున్నదో తేలిగ్గా ఊహిం చవచ్చు. ఇందుకోసం మూడు మార్గాలు-ఆర్థిక సాంకేతిక కేసులు, ఆర్‌టిఐ చట్టం సవరణలు, ప్రత్యక్ష దాడులతో కంటెంటు స్వాధీనం అనే మూడు పద్ధతులకు పాల్పడుతున్నారు. విదేశీ ప్లాట్‌ఫాంలను కూడా నచ్చని కథనాలు ఇస్తే కోర్టులకు పిలవడం మొత్తంగా ఒత్తిడి చేసి దారికి తెచ్చుకోవడం పరిపాటి అయింది. దేశవ్యాపితంగా అక్షరాలా కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ఇందుకు మరెన్నో ఉదాహరణలున్నాయి.

సామదానభేద దండోపాయాలు!
మరోవంక పరివార్‌ను బలపర్చే ఆప్‌ ఇండియా వంటి వెబ్‌సైట్లు మాత్రం తమకు నచ్చని జర్నలిస్టులపైన, రాజకీయ పార్టీలపైన, నేతల పైన ఇష్టానుసారం అసహ్యకరమైన ఆరోపణలతో వ్యాసాలు గుమ్మరిస్తూ వస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఇవన్నీ భావజాలానికి సంబంధించినవైతే మరొకటి జర్నలిస్టుల జీవనోపాధికే ఎసరు పెట్టడం. మాకు నచ్చినట్టు నడపాలి. లేదంటే మూసేసుకోవాలి. అసలే కార్పొరేట్‌ పోటీలో అనేక సంస్థలు నడవలేని పరిస్థితి. రాజకీయంగానో లాభాల కోసమో లేక తమ వ్యాపార ప్రయోజనాల కోసమో చేతులెత్తేసిన వారంతా మోడియాగా మారిపోయారు. వారికి అనేక రాయితీలు, సదు పాయాలు స్పాన్సర్డ్‌ కంటెంటు ప్రసారం చేస్తే పరోక్షంగా వ్యాపార ప్రకటనలూ సాగిపోతుంటాయి. మీడియా మాత్రమే గాక సినిమాలు తీసే దర్శక నిర్మాతలు, నటీనటులు కూడా సంఘ పరివార్‌ దారికి తెచ్చుకునే ఒత్తిళ్లు వేధింపులు చాలా చూస్తున్నాం. ఈ మధ్య ఆరెస్సెస్‌ వందేళ్ల వేడుకలకు ఎన్నడూరాని నటీనటులు, ప్రముఖ దర్శకులు విచ్చేశారంటే రాజకీయ అభిమానంతో పాటు అంతకుముందు నడిచిన సామదానభేద దండోపాయాలన్నిటి ప్రభావం వుందనుకోవలసిందే. వారి సినిమాలకు అనుమతులూ సెన్సార్‌ అభ్యంతరాలు, ట్రోలింగులు, అసలు అవకాశాలు రాకుండా చేయడం ఒకటేమిటి ఇదే తెలుగునాట కూడా జరిగింది. సనాతనం విన్యాసాల వెనక కనిపించని కోణాలు చాలా వుంటాయని పరిశ్రమకు సంబంధించిన వారు చెబుతున్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు వరసగా మీడియా కంపెనీలను కొనుగోలు చేస్తూ విలీనం చేసుకుంటూ వాటిని పునర్నిర్మించే పేరిట లొంగని వారిని తొలగిస్తూ వెళుతుంటారు. దశలవారీగా అనుకూల సిఇవోలను, ఎడిటర్లను తెచ్చిపెడుతుంటారు. ఇదంతా చూసే సిండికేట్లు కూడా రకరకాల పేర్లతో ఏర్పడ్డాయి. కొన్ని ప్రభుత్వం తరపున అధికారికంగా ఈ రంగంలో పనిచేస్తే మరికొన్ని ప్రయివేటు సంస్థలుగానే చొచ్చుకుపోతున్నాయి. ఇప్పుడు వారికి అత్యధిక మీడియా సంస్థలు సమకూరాయి. కార్పొరేట్‌ పోటీ తట్టుకోలేక, ప్రభుత్వ తోడ్పాటు లేక డజన్లకొద్ది మీడియాలు మూతపడ్డాయి. కరోనా కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేక అనేకం ఆగిపోయాయి. 2024లో కనీసం యాభై వార్తా ఛానళ్లు సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌, కొన్ని పెద్ద తెలుగుచానళ్ల మాతృసంస్థలతో సహా తమ లైసెన్సులను వదిలేసుకున్నాయి. వాటిలో కొన్ని మనకు కనిపిస్తున్నా యాజ మాన్యాలు స్వరూపస్వభావాలు మారిపోయాయి. ఒకప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్‌ పేరిట వార్తలనూ వినోదాన్ని కలగలిపే పద్ధతి వుంటే ఇప్పుడు ఏకంగా ఎంటర్‌టైన్‌మెంట్‌లో మునిగిపోయాయి. ఒటిటికి మారిపో యాయి. సంస్థల యాజమాన్యాల సంగతి అటుంచి వాటిలో ఉద్యోగులకు దినదిన గండంగా పరిస్థితి తయారైంది. ఎప్పుడు ఏ సంస్థలో వుంటామో తెలియని అభద్రత, మానసికఒత్తిడిలో పాత్రికేయులు మీడియా నిపుణులు చిక్కుకు పోయారు. త్రిశంకుస్వర్గంలా పరిస్థితి తయారైంది.

సాంకేతిక సవాలు
మీడియాలో వచ్చిన కార్పొరేట్‌ పోకడలు, వినోద వికత లక్షణాలు నిజానికి పాలకవర్గ పాచికలకు అనువైనవే. అవసరాన్ని మించి పెట్టుబడులు గుమ్మరించడం కూడా సమాంతర స్వరాలను వెనక్కు నెట్టడంలో ఓ భాగం. కాస్త గొంతు మార్చితే తీవ్రత తగ్గిస్తే లేక అటూ ఇటూ విన్యాసాలు చేస్తే బాగా లాభం జరుగుతుందని ఆశపెడతారు. అవసరమైతే బాగా అవకాశాలు చూపిస్తారు. బిరుదులను, పద వులను ఎరవేస్తారు. లేదంటే ఒత్తిడి పెడతారు. ఇంతకు మించిన ముప్పు సాంకేతిక సవాలు. డిజిటల్‌, ఎఐ ప్రక్రియలతో బాగా భారీ దశ్యాలు చూపిస్తారు. అంతకు తగ్గితే మనుగడ లేదనే వాతావరణం తీసుకొస్తారు. ఎఐతో ఇప్పుడు మొత్తానికి ఎసరు పెడుతున్నారు. ఎఐ వస్తే మీడియాలో కొన్ని విభాగాలకు అసలు పనిలేకుండా పోతుందని భయం పెంచుతూ వందల మందిని తొలగించేస్తున్నారు. ప్రఖ్యాత వాషింగ్టన్‌ పోస్ట్‌లో ఏకంగా మూడువందల మందిని ఇంటికి పంపారు. కొన్ని పత్రికలు మూసేసి ఆన్‌లైన్‌కు పరిమితం చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్‌లలో ఈ దెబ్బకు పాత్రికేయులు విలవిలలాడు తూన్నారు. కొన్నేళ్ల కిందటి నుంచే పత్రికలలో రాసేవారి పాత్ర తగ్గిస్తూ కంప్యూటరైజ్‌ చేశారు. ఇప్పుడు ఆ దశ నుంచి కూడా తగ్గిస్తున్నారు. అనువాదం వంటివి అసలే ఎగిరిపోతున్నాయి. వందల మంది సంపాదకులు, అను వాదకులు, రచయితలు లేకుండా పోవడం భావజాల పరంగా చాలా ప్రభావం చూపుతుంది. ఈ అభద్రతా భావం కొంతమందిలోనైనా స్థయిర్యం దెబ్బతీస్తుంది. విద్య, వైద్యం వంటివీ పూర్తి ప్రయివేటు పరమైన దశ గనక ఉద్యోగులలో ఒత్తిడి తీవ్రమవుతుంది. ఈ వేగాన్ని అందుకోడానికి వయస్సు ఆటంకమనే సాకుతో నలభై ఏళ్లకే రిటైర్మెంట్‌ చేయిస్తున్నారు.

గతంలో నలభై దాటిన వారికి కొత్త ఉద్యోగం నిరాకరిస్తుంటే ఇప్పుడు ఇంటికి పంపుతామంటున్నారు. త్వరగా రిటైర్‌ కావడం సుఖప్రదమనే సిద్ధాంతాలే తీసుకొచ్చారు. ఇవన్నీ జర్నలిస్టులకే గాక బుద్ధిజీవులందరికీ అంతుపట్టని వ్యూహాలుగా తయారయ్యాయి. వీటిని వ్యాపారకోణంలోనే గాక రాజకీయ వేదింపుల కోసమూ వినియోగిస్తున్నారు. అసలు మనుగడ వుండబోదనే భయంతో మరింత లోబడకతప్పదని పాలకవర్గాల ఎత్తుగడ. ద్రవ్య పెట్టుబడుల తొలి పాదంలోనే మీడియాను చేజిక్కించుకోవడం మొదలైంది. నిరంకుశత్వం మరో రూపంలో వాటి భావజాలాన్ని అదుపుచేసింది. ఇప్పుడు సాంకేతిక అస్త్రం అందుకు తోడైంది. అంతర్జాతీయ ఆధిపత్యాల నుంచి అంతర్గత రాజకీయాల వరకూ…ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాల నుంచి అభివృద్ధి నిరోధక మితవాద శక్తుల వరకూ దాన్ని ప్రయోగిస్తున్నాయి. రానున్న కాలంలో ఇది ఇంకా బాహాటంగా విస్తరించబోతున్నది.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -