నవతెలంగాణ – హైదరాబాద్ : మేఘాలయ అక్రమ బొగ్గుగని పేలుడు ఘటనపై ముగ్గురు సభ్యుల దర్యాప్తు కమిటీకి రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ కేంద్ర మైనింగ్ చట్టాలకు జవాబుదారీతనాన్ని మరియు రాజ్యాంగపరమైన మినహాయింపులను నిర్ణయించనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొంది. 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద నియమించిన ఈ కమిటీలో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి హెచ్.నాంగ్ ప్లుహ్, మాజీ ఐఎఎస్ అధికారి పి.ఎస్.దఖర్ సభ్యులుగా ఉన్నారని తెలిపింది. జస్టిస్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన జడ్జిగా పనిచేశారు.
మైన్సెన్‌గట్ గ్రామంలోని మారుమూల థాంగ్స్క్ ప్రాంతంలోని అక్రమ గనిలో జరిగిన పేలుడుపై కమిషన్ సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది. నోటిఫికేషన్ తేదీ నుండి ఆరు నెలల వ్యవధిలో నివేదికను, సిఫారసులను సమర్పించాలని ఉత్తర్వు పేర్కొంది. మేఘాలయలోని తూర్పు జయంతియా జిల్లాలో పిబ్రవరి 5న జరిగిన అక్రమ బొగ్గు గని పేలుడులో 31మంది మరణించిన సంఖ్య సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా ఫిబ్రవరి 9న పేలుడుపై న్యాయ విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించారు. తూర్పు జయంతియా హిల్స్ ఎస్‌పి వికాష్ కుమార్‌ను బదిలీ చేసి, ఆయనను యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఎఎన్‌టిఎఫ్) అధ్యక్షుడిగా నియమించినట్లు మరో నోటిఫికేషన్ తెలిపింది. ఎన్‌టిఎఫ్ చీఫ్ పికె రసగానియా తూర్పు జయంతియా హిల్స్ కొత్త ఎస్‌పిగా ఉండనున్నారు.



