నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని కోనూరులో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న ఒక నాటు పడవ అకస్మాత్తుగా బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతులను గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్ (12), కొనత చైతన్య (28) గా గుర్తించారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది బంధువులు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామ పరిధిలో జరిగే ఒక శుభకార్యానికి హాజరయ్యారు. వేడుక ముగిసిన అనంతరం వారంతా కలిసి కృష్ణా నది గుండా అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు ఒక చిన్న నాటు పడవపై తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ప్రయాణం మధ్యలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి నీటిలో బోల్తా పడింది. పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న 10 మంది నీట మునిగిపోయారు. వారి కేకలు విన్న కోనూరు గ్రామస్థులు, మత్స్యకారులు వెంటనే నదిలోకి దూకి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే మిగిలిన నలుగురు నది ఉధృతికి కొట్టుకుపోయారు. నదిలో మునిగిపోయిన నలుగురిని గంధం సంధ్య (9), గంధం సైనీ (10), బత్తుల కార్తీక్ (12), చైతన్య (28)గా గుర్తించారు. స్థానికులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా నది తీర ప్రాంత గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణికులను నాటు పడవలపై తరలించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, ఫిట్నెస్ లేని పడవలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.



