జూన్ 16, 17 తేదీల్లో కొత్తపేట బీజేఆర్ భవన్లో రాష్ట్ర స్థాయి యువజన సమ్మేళనం
ఏర్పాట్లను పరిశీలించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
నవతెలంగాణ–దిల్సుఖ్నగర్
సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్న యువజన సమ్మేళనం ఏర్పాట్లను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతోపాటు జిల్లా, ఎల్బీనగర్ నాయకులు ఆదివారం పరిశీలించారు. సీపీఐ(ఎం) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యువజన సమ్మేళనం కార్యక్రమానికి పార్టీ అగ్ర నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో సభా వేదిక సౌకర్యాలు, పార్కింగ్ ఏర్పాట్లను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 40 కోట్ల మంది యువతీ, యువకులు ఉన్నారని తెలిపారు. పాలకులు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా దేశభక్తి పేరుతో మతోన్మాదం వైపు యువతను ప్రేరేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని ప్రశ్నించారు. పన్నెండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పటికే 24 కోట్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉండాలని, కానీ ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.
అదేవిధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ లెక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతను దారుణంగా మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు, సంఘటితం చేసేందుకు జూన్ 16, 17 తేదీల్లో కొత్తపేట బీజేఆర్ భవన్లో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ఎల్బీనగర్ ప్రాంతంలో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి యువతీ,యువకులు పెద్దఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. యువజన సమ్మేళనానికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాజ్యసభ సభ్యులు రహీమ్ తదితరులు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చంద్రమోహన్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
యువతను సంఘటితం చేసేందుకే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



