Monday, June 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశం దశ, దిశను మార్చేది యువతే

దేశం దశ, దిశను మార్చేది యువతే

- Advertisement -

భయం, ద్వేషం లేని భారత్ సీజేపీ లక్ష్యం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను పదవి నుంచి తప్పించాలి
ప్రముఖ పర్యావరణవేత్త
సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ డిమాండ్‌
బాధ్యతను విస్మరిస్తున్న రాజకీయ నేతలు : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌నాగేశ్వర్‌
ఇందిరా పార్క్‌ ‌వద్ద కాక్రోచ్‌ ‌జనతా పార్టీ ధర్నా
డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐతో పాటు యువజన,
విద్యార్థి, స్వచ్ఛంద సంస్థల మద్దతు

​నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దేశం దిశ, దశను మార్చేది యువతేనని ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ అన్నారు. నీట్‌లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని ఆదివారం హైదరాబాద్‌లోని ధ‌ర్నాచౌక్ వ‌ద్ద‌ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ‌‌భారీ ధర్నా నిర్వహించారు. నగరంలోని జరిగిన సభలో వాంగ్‌‌చుక్‌ ‌మాట్లాడుతూ సీజేపీ ఒక రాజ‌కీయ వేదిక కాద‌నీ, ప్ర‌తి భారతీయుడిని మేల్కొల్పడమే దాని ప్రాథ‌మిక ల‌క్ష్యమని చెప్పారు. విద్యార్థుల భ‌విష్య‌త్ తీర్చిదిద్దే సంస్థ‌ల్లో వ్య‌వ‌స్థాగ‌త స‌మ‌స్య‌లు స‌రిదిద్ద‌డంతో పాటు పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీ త‌నం ఉండేలా చూడడంపై దేశం దృష్టి పెట్టాల‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రితో స‌హా ప్ర‌తి ఒక్క‌రూ జ‌వాబుదారీగా ఉండాల‌ని తెలిపారు. 17 లక్ష‍ల మంది విద్యార్థుల జీవితాల తో చెలగాటమాడి, ఐదుగురి మరణానికి కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌ రాజీనామా చేయాలనీ, లేదంటే ఎన్డీఏ సర్కార్‌ ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్ర‌జ‌ల గొంతులు అణ‌చివేయ‌కుండా, పౌరులు నిర్భ‌యంగా త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేసేలా దేశంలో పరిస్థితులు ఉండాల‌న్నారు. భయం, ద్వేషం లేని(ముక్త్‌ ) భారతే సీజేపీ లక్ష్యమని చెప్పారు. కేబీఆర్ పార్క్‌, మూసీ పరిరక్ష‍ణ కోసం తెలంగాణలో జరుగుతున్న పోరాటాలను ఆయన ప్రశంసించారు. 50 ఏండ్ల క్రితం సింగపూర్‌ ‌దేశం ఇండియాతో పోల్చితే అత్యంత దిగువన ఉండేదని గుర్తు చేశారు.

నిత్యం మత కల్లోలాతో సతమతమయ్యే దేశం నేడు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన ధనిక దేశంగా మారిందన్నారు. అక్కడి పాలకులు, ప్రజలు కలిసి కట్టుగా సాగించిన ప్రయాణమే అందుకు కారణమని చెప్పారు. భారత యువత నిబద్దతతో పని చేస్తే దేశం ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ కె.నాగేశ్వ‌ర్‌ మాట్లాడుతూ దేశంలో పాలకులు తమ బాధ్యతలను విస్మరించారని విమర్శించారు. గతంలో నేతలు ఇందుకు భిన్నంగా శాఖాపరమైన తప్పిదాలకు సైతం నైతిక బాధ్యత వహించేవారని గుర్తు చేశారు. భారీ రైలు ప్ర‌మాదం త‌ర్వాత మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి పేరును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉల్లిగడ్డ ధర పెరిగిందంటే… మేము ఉల్లిగడ్డ తినబోమని ఆర్థిక శాఖ మంత్రి, పెట్రోల్ డీజిల్ పెరుగుతున్నాయంటే బంగారం కొనొద్దని దేశ ప్రధాని చెప్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల‌కు ఉద్యోగాలు ఇస్తే మీరు విదేశాల నుంచి తీసుకురాని మిలియన్ డాలర్లు తీసుకువ‌స్తార‌ని చెప్పారు. ఆడ పిల్లలపై లైంగికదాడులు జరుగుతున్నాయంటే వాళ్ళు అంత రాత్రి బయటకు ఎందుకు పోతున్నారంటూ పాలకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై…. అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహి, పాకిస్తాన్ వ్యక్తి అంటూ ముద్ర‌లు వేస్తున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

మీరు కాదు మేము అసలైన దేశ భక్తులమని చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఆన్‌‌లైన్‌లో ప్రారంభం అయిన ఈ (కాక్రోచ్‌) ఆవేశం… ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ వరకు వచ్చిందని చెప్పారు. మీడియా, సోషల్ మీడియా, రాజకీయం మీ చేతిలో పెట్టుకుంటారు కానీ జనాగ్రహాన్ని చేతిలో పెట్టుకోలేరని పాలకులను హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున త‌మ పోరాటం కొన‌సాగించాలని యువతకు పిలుపునిచ్చారు. విద్యా కమిషన్‌ ‌మాజీ చైర్మెన్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ కనీసం ఒక పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించలేని వారు దేశాన్ని పాలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర క్యాబినెట్ లోని వారి లంచగొండితనం, మూర్ఖత్వం వల్లే ప్రతి ఏటా పేపర్లు లీక్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పన్నెండేండ్ల మోడీ పాలనలో పేదలకు ఎలాంటి న్యాయమూ జరగలేదన్నారు. దేశంలో నాణ్యమైన విద్యను ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందనీ, డిగ్రీ చదివిన పిల్లల్లో కేవలం ఆరు శాతం మందికే నైపుణ్యాలు ఉంటే మిగతా 94 శాతం మంది విద్యార్థుల గతేంటని నిలదీశారు. నీట్‌ కుంభకోణానికి బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ కేవలం రాజీనామా చేస్తే సరిపోదనీ, ఆయనను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. సీజేపీ అధికార ప్రతినిధి విజేత ద‌హియా మాట్లాడుతూ అభివృద్ధి అంటే…ప్ర‌జ‌ల‌ను ఇండ్ల నుంచి ఖాళీ చేయించ‌డం, చెట్ల‌ను న‌రికివేయ‌డం కాదన్నారు. ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందనే విషయాన్ని పాలకులు గుర్తించాలని సూచించారు.

​నీట్ నుంచి నెట్ వరకు లీకేజీల పరంపర : 
సీజేపీ బహిరంగ సభలో డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ
నీట్‌ ‌నుంచి నెట్ వరకు దేశంలో కొనసాగుతున్న లీకేజీల పరంపర వల్ల విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని మద్దతు ప్రకటించాయి. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష‍ులు కోట రమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ 2019 నుంచి 2026 వరకు 65కు పైగా జాతీయ స్థాయి పరీక్షల పేపర్ లీకేజీలు లేదా అవకతవకలు జరిగాయని అధ్యయనాల్లో తేలిందన్నారు. 2024లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ వివాదం, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరుపై వచ్చిన ఆరోపణలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనం పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణ వ్యవస్థపై సమగ్ర న్యాయ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎండీ జావిద్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, కె. అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్, రాష్ట్ర నాయకులు రజనీకాంత్, శ్రీమాన్, భరత్, అర్జున్, వెన్నెల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -