Monday, February 16, 2026
E-PAPER
Homeమానవిఆలస్యమవుతుందా..?

ఆలస్యమవుతుందా..?

- Advertisement -

నెలసరి కొన్నిసార్లు ముందుగా.. లేదంటే ఆలస్యంగా రావడం మామూలే. అయితే కొంతమందిలో ప్రతిసారీ ఇలాగే జరుగుతుంటుంది. హార్మోన్ల అసమతుల్యతే దీనికి కారణమనుకుంటారు. కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు. జీవనశైలి మార్పులు, పలు ఆరోగ్య సమస్యలూ ఇందుకు కారణం కావచ్చని చెబుతున్నారు.

అందుకే ప్రతి నెలా పిరియడ్స్‌ ఇలా ముందుగా లేదంటే ఆలస్యంగా వస్తున్నట్లు గమనిస్తే, ఎవరికి వారే స్వయంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలని అంటున్నారు. తద్వారా అసలు సమస్యేంటో గుర్తించి, మొదట్లోనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవచ్చని సూచిస్తున్నారు. మరి మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్నలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

ఒత్తిడికి గురవుతున్నానా?
ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, ఆందోళన చెందడం చాలామందిలో కనిపిస్తుంది. అయితే ఇలా ఒత్తిడికి గురైన ప్రతిసారీ శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇది ఇతర హార్మోన్ల స్థాయుల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో నెలసరిని క్రమబద్ధీకరించే ల్యుటినైజింగ్‌, ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ వంటి హార్మోన్ల స్థాయులు అదుపు తప్పుతాయని పేర్కొంటున్నారు. దీని ప్రభావం నెలసరిపై పడి.. తద్వారా ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌కు దారితీస్తుందని చెబుతున్నారు. కాబట్టి నెలనెలా పిరియడ్స్‌ ఆలస్యమైతే.. ‘తాము ఏ విషయంలోనైనా టెన్షన్‌ పడుతున్నామా?’ అని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా మీ ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌కి ఒత్తిడి కారణమా? కాదా? అనేది తెలుస్తుందని సలహా ఇస్తున్నారు. ఒత్తిడి.. రుతు చక్రంపై ప్రభావం చూపుతుందని clevelandclinic అధ్యయనం పేర్కొంది.

డైటింగ్‌ చేస్తున్నారా..?
శరీరానికి పోషకాలన్నీ అందినప్పుడే హార్మోన్లు సక్రమంగా పని చేస్తాయి. కానీ కొందరైతే డైటింగ్‌ పేరుతో కడుపు మాడ్చుకుంటారు. దీనివల్ల శరీరానికి సరిపడా పోషకాలు, క్యాలరీలు అందవట. దీనివల్ల కూడా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ వంటి ప్రత్యుత్పత్తి హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదీ నెలసరి క్రమం తప్పడానికి, ఆలస్యంగా రావడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే పిరియడ్స్‌ ప్రతి నెలా ఆలస్యమవుతుంటే.. తాము డైట్‌లో ఏవైనా మార్పులు చేసుకున్నామా? క్యాలరీల్ని తగ్గించామా? అనే దిశగానూ ఆలోచించాలంటున్నారు. ఋతుక్రమ రుగ్మతలు ఉన్న మహిళలు అధిక చక్కెర కలిగిన ఆహారాలు లేదా పానీయాలను ఎక్కువగా తీసుకుంటారని, తగినంత పోషకాలు తీసుకోరని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.

వ్యాయామం మితిమీరిందా..?
మామూలుగా వర్కవుట్‌ రొటీన్‌ ప్రారంభించే వారు తక్కువ తీవ్రత ఉన్న సింపుల్‌ ఎక్సర్‌సైజ్‌లతో సార్ట్‌ చేస్తారు. కానీ, కొంతమంది త్వరగా బరువు తగ్గాలని మొదట్లోనే అధిక తీవ్రత ఉన్న వ్యాయామాల్ని రొటీన్‌లో చేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఆహారం కూడా సరిగ్గా తీసుకోరని చెబుతున్నారు. ఫలితంగా శరీరం శక్తి స్థాయుల్ని కోల్పోతుందంటున్నారు. ఇది పిరియడ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలియజేస్తున్నారు. తద్వారా నెలసరి ఆలస్యమవడం, కొంతమందిలో ఆగిపోవడం కూడా జరుగుతుందంటున్నారు. అంతేకాదు ఉన్నట్లుండి బరువు తగ్గినా, పెరిగినా కూడా పిరియడ్స్‌ సమస్యలు తప్పవంటున్నారు. నెలసరిని క్రమబద్ధీకరించే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లలో హెచ్చుతగ్గులే ఇందుకు ప్రధాన కారణమట. కాబట్టి, నెలసరి ఆలస్యమైతే మీ శారీరక బరువు, వ్యాయామాల విషయాల్లోనూ ఈ ప్రశ్నలు సంధించుకోవడం వల్ల అసలు కారణమేంటో ఓ అవగాహన వస్తుందని పేర్కొంటున్నారు. క్రమరహిత రుతుస్రావానికి అధిక వ్యాయామం కూడా ఒక కారణమని అధ్యయనం పేర్కొంది.

నిద్ర సరిపోతోందా..?
పని ఒత్తిడి, షిఫ్టుల వల్ల ఇప్పుడు చాలామంది ప్రశాంతమైన నిద్రకు నోచుకోలేకపోతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా బరువు పెరగడం, ఒబెసిటీ, పీసీఓఎస్‌ వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో దీర్ఘకాల నిద్రలేమి రుతుచక్రం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కాబట్టి, నెలసరి అదుపు తప్పినప్పుడు నిద్ర విషయంలోనూ ఎవరికి వారు కొన్ని ప్రశ్నలు వేసుకోవడం మేలని సలహా ఇస్తున్నారు. తమ జీవనశైలి మార్పుల విషయంలో ఇలా ఎవరికి వారే స్వీయ పరిశీలన చేసుకోవడం వల్ల నెలసరి ఆలస్యానికి గల కారణాలేంటో తెలుస్తాయంటున్నారు నిపుణులు. ఇవన్నీ డాక్టర్‌ ముందుంచితే మీ సమస్యకు తగిన చికిత్స అందించడం సులువవుతుందని చెబుతున్నారు. ఫలితంగా నెలసరి క్రమంగా వస్తుందని, ఆరోగ్యపరంగానూ మేలు జరుగుతుందని చెబుతున్నారు.

మందులు వాడుతున్నారా..?
దీర్ఘకాలం మందులు వాడే వారు, వాటిని మార్చినా మొదట్లో కొన్నాళ్ల పాటు నెలసరి అదుపు తప్పడం గమనిస్తుంటాం. ముఖ్యంగా గర్భ నిరోధక మాత్రలు, ఒత్తిడిని తగ్గించే మందులు, థైరాయిడ్‌-స్థూలకాయానికి సంబంధించిన మందులు, కొన్ని రకాల నొప్పి నివారిణులు కూడా నెలసరిపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, రక్తస్రావంలోనూ హెచ్చు తగ్గులొస్తాయని చెబుతున్నారు. అందుకే పిరియడ్స్‌ విషయంలో మార్పులేవైనా గమనిస్తే, ‘నేను వాడే కొత్త మందుల వల్లే ఇలా జరుగుతోందేమో’నని ఒకటికి రెండుసార్లు ప్రశ్నించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -