Monday, February 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసింగరేణి కార్మికుల కోసం పోరాటం

సింగరేణి కార్మికుల కోసం పోరాటం

- Advertisement -

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్‌ఎస్‌ తన మద్దతు సీపీఐకి ప్రకటించిందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ కాంగ్రెస్‌ ఇప్పటికే అలయన్స్‌ లో ఉన్నాయనీ, కొత్తగూడెంలో మేయర్‌ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఏఐటీయూసీ ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు.

అయితే ఎవరు కలిసి వచ్చినా, కలిసి రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్‌ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గూండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయన్నారు. సేవాలాల్‌ మహారాజ్‌ 287వ జయంతిని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరుపుకోడం ఆనందంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, భుక్యా జాన్సన్‌ రాథోడ్‌, వాల్యా నాయక్‌, రామచంద్రు నాయక్‌, రాంభల్‌, గాంధీ నాయక్‌, కరాటే రాజు, శ్రీనివాస్‌ గౌడ్‌ తదితర నేతలతో కలిసి భోగ్‌ భండార్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -