ఈయూ దేశాల ఒత్తిడి
ఆమెకు వందమందికి పైగా కళాకారుల మద్దతు
‘ఆర్టిస్ట్స్ ఫర్ పాలస్తీనా’ గ్రూప్ పేరిట రాసిన లేఖపై సంతకాలు
గాజా : ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి పాత్రికేయురాలిగా పనిచేస్తున్న ఫ్రాన్సెస్కా ఆల్బనేస్‌కు వంద మందికి పైగా ప్రముఖ కళాకారులు మద్దతు తెలిపారు. ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలగాల్సిందిగా పలు ప్రపంచ దేశాలు ఆల్బనేస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్టిస్ట్స్ ఫర్ పాలస్తీనా’ గ్రూప్ పేరిట రాసిన లేఖపై కళాకారులు సంతకాలు చేశారు. మానవ హక్కులు…ముఖ్యంగా జీవించే హక్కు కోసం పాలస్తీనా ప్రజలు చేస్తున్న ఆందోళనకు బాసటగా నిలిచిన ఆల్బనేస్‌కు వారంతా పూర్తి మద్దతు తెలిపారు. ‘బలప్రయోగం చట్టంగా ఉండకూడదని కోరుకునే వారు ఈ భూమిపై ప్రతి మూలలో ఉన్నారు. చట్టం అనే పదానికి నిజమైన అర్థ మేమిటో ఎవరికి తెలుసు?’ అని ఆ లేఖలో వారు ప్రశ్నించారు. లేఖపై సంతకాలు చేసిన వారిలో నటులు మార్క్ రుఫలో, జేవియర్ బార్డెమ్, నోబెల్ బహుమతి గ్రహీత, రచయిత అన్నే ఎర్నాక్స్, బ్రిటన్‌కు చెందిన సంగీత కళాకారుడు అన్నే లెనాక్స్ తదితర ప్రముఖులు ఉన్నారు. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణకాండను తీవ్రంగా విమర్శిస్తున్న వారిలో ఆల్బనేస్ ఒకరు. మానవాళికి ఉమ్మడి శత్రువు ఉన్నాడంటూ ఆమె గత వారం అల్ జజీరా వేదిక పై వ్యాఖ్యానించారు.
పాలస్తీనాలో మారణ హోమానికి కారణమైన వ్యవస్థను ఉమ్మడి శత్రువుగా అభివర్ణించానని ఆమె ఆ తర్వాత వివరణ ఇచ్చారు. ఫ్రాన్స్, జర్మనీ సహా పలు యూరోపియన్ దేశాలు ఆల్బనేస్‌ను బాధ్యతల నుంచి తప్పించా లని కోరుతూనే ఉన్నాయి. అనేక పశ్చిమ దేశాలు ఆమెను లక్ష్యంగా చేసుకొని విమర్శ లు సంధిస్తు న్నాయి. ఇజ్రాయిల్‌ను విమర్శిం చడాన్ని అవి జీర్ణించుకోలేకపోతున్నాయి. పాలస్తీనా పై ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధాన్ని విమర్శించే వారిని నేరస్థులుగా చూస్తున్నారని, అదే సమయం లో మారణహోమానికి కుట్రలు పన్నిన వారిని వదిలేస్తున్నారని సినీ నిర్మాత, రచయిత ఫ్రంక్ భరత్ విమర్శించారు. కాగా అంతర్జాతీయ చట్టం ప్రకారం మారణహోమాలను నివారించాల్సిన బాధ్యత ఆయా దేశాలపై ఉంటుందని, కానీ గత రెండు సంవత్సరాలుగా అవి తమ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో విఫలమవుతున్నాయని ఆల్బనేస్ ఆరోపిస్తున్నారు. ఆల్బనేస్‌పై యూరోపియన్ దేశాలు కన్నెర్ర చేయడంపై తన సహచరులు ఆందోళన చెందుతున్నారని మానవ హక్కులకు సంబంధించిన ఐరాస హై కమిషనర్ కార్యాలయ ప్రతినిధి మార్టా హర్తాదో చెప్పారు.



