సౌదీ అరేబియా, ఖతార్ సహా
16 ముస్లిం దేశాలు
సోమాలిలాండ్ దౌత్యప్రతినిధి
నియామకంపై అభ్యంతరం
ఇది సార్వభౌమాధికార ఉల్లంఘనంటూ ప్రకటన
ఇరాన్‌తో సహా లెబనాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదానికి తెగబడుతున్నా నోరు విప్పని దేశాలు ఇప్పుడు ఒక్కసారిగా గళం విప్పాయి. ఇజ్రాయిల్‌పై గరంగరంగా ఉన్నాయి. సోమాలిలాండ్‌లో ఇజ్రాయిల్ ఒక దౌత్య ప్రతినిధిని నియమించడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఖతార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, టర్కీ సహా 16 అరబ్, ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు దోహాలో ఒక సంయుక్త ప్రకటనను జారీ చేశారు. ఇజ్రాయిల్ నిర్ణయం వల్ల సోమాలియా సమాఖ్య గణతంత్ర సార్వభౌమాధికారం, ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను నేరుగా ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు.
అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను ఉల్లంఘించేలా ఈ చర్య ఉన్నదని తెలిపాయి. ఒక ప్రమాదకరమైన పూర్వవచనాన్ని నెలకొల్పగలదని ఇస్లామిక్ దేశాలు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. సోమా లియా చట్టబద్ధమైన ప్రభుత్వ సంస్థలు మాత్రమే దాని ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రులు పునరుద్ఘాటించారు. ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, సోమాలియా, సూడాన్, లిబియా, బంగ్లాదేశ్, అల్జీరియా, పాలస్తీనా, టర్కీ, ఇండోనేషియా, పాకిస్తాన్, మౌరిటానియా, జోర్డాన్, ఒమన్ దేశాల విదేశాంగ మంత్రులు తమ నిరసనలను వ్యక్తపరిచారు. దేశాల ఐక్యతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలను వారు తిరస్కరించారు.
‘ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు…’
ఇజ్రాయిల్ నిర్ణయం ఆఫ్రికన్ యూనియన్ వ్యవస్థాపక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని సంయుక్త ప్రకటన నొక్కి చెప్పింది. ఇటువంటి చర్యలు హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతాన్ని అస్థిరపరిచి, ప్రాంతీయ శాంతి, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆ దేశాలు హెచ్చరించాయి. ఈ 16 దేశాలు సోమాలియా ఐక్యతకు తమ అచంచలమైన మద్దతును పునరుద్ఘాటించాయి. సోమాలిలాండ్ విషయంలో ఇజ్రాయిల్ చర్య తీవ్రమైన దౌత్య వివాదాన్ని రేకెత్తించింది. ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పంచుకున్న అధికారిక ప్రకటన ప్రకారం, సోమాలిలాండ్‌ను ”అని పిలవబడే” భూభాగంగా పేర్కొంటూ, ఇజ్రాయిల్ రాయబారి నియామకాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించారు. ఈ ఏకపక్ష చర్య సోమా లియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, దీన్ని ప్రపంచ వేదికపై అంగీకరించబోమని ముస్లిం దేశాలు వాదిస్తున్నాయి.
ఆఫ్రికా హార్న్‌లో శాంతి కోసం విజ్ఞప్తి
సోమాలియా సార్వభౌమత్వాన్ని గౌరవించాలని విదేశాంగ మంత్రులు అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయిల్ చొరవ ఈ ప్రాంతంలో కొనసాగుతున్న శాంతి ప్రయత్నాలను దెబ్బతీయగలదని వారు పేర్కొన్నారు. సోమాలియా సమగ్రతను కాపాడటానికి సాధ్యమైన అన్ని దౌత్యపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తామని, అటువంటి రాయబారిని గుర్తించబోమని 16 దేశాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి.
ఇజ్రాయిల్‌పై గరంగరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



