Monday, April 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరెండో విడత చర్చలకు సిద్ధం

రెండో విడత చర్చలకు సిద్ధం

- Advertisement -

వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చర్చలకు ఇరాన్‌ తిరస్కరణ
పాకిస్తాన్‌కు వెళ్లనున్న యూఎస్‌ ప్రతినిధులు
అమెరికాకు ఇజ్రాయిల్‌ గొప్ప మిత్రదేశం : ట్రంప్‌
చాలా దూరంలో తుది ఒప్పందం : ఇరాన్‌
బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని మూసేస్తాం : హౌతీలు

న్యూయార్క్‌ / టెహ్రాన్‌ : పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలకు సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘించి ందని ఆరోపిస్తూ, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టెహ్రాన్‌ను హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరిపే చర్చల కోసం అమెరికా ప్రతినిధులు సోమవారం ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారని ట్రంప్‌ ప్రకటించారు. ఆదివారం సోషల్‌ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్‌లో.. ఇస్లామాబాద్‌లో ఇరాన్‌ ప్రతినిధులతో జరగనున్న రెండో విడత ముఖాముఖి చర్చలకు అమెరికా ఏ అధికారులను పంపుతుందో ట్రంప్‌ వివరంగా చెప్పలేదు. గత వారాంతంలో జరిగిన చర్చలలో అమెరికా ప్రతినిధి బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాయకత్వం వహించారు. కానీ ఆ చర్చలు ఎలాంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి.బుధవారం ముగియనున్న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని, శనివారం హార్ముజ్‌ జలసంధిలో కాల్పులు జరపడం ద్వారా ఇరాన్‌ ఉల్లంఘించిందని ట్రంప్‌ ఆరోపించా రు. అమెరికా అందిస్తున్న ఒప్పందంలోని నిబంధనలను అంగీకరించకపోతే ఇరాన్‌లోని పౌర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. ”మేం చాలా సరసమైన, సహేతుకమైన ఒప్పందాన్ని అందిస్తు న్నాం. వారు దానిని అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే, వారు అంగీకరించకపో తే, యూఎస్‌..ఇరాన్‌లోని ప్రతి ఒక్క విద్యుత్‌ ప్లాంటును, ప్రతి ఒక్క వంతెననూ నాశనం చేయబోతోంది” అని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌లో రాశారు.

చర్చలకు ఇరాన్‌ నో
అయితే తాజా చర్చల గురించి ట్రంప్‌ చేసిన వాదనపై టెహ్రాన్‌ నుంచి తక్షణ స్పందన ఏదీ రాలేదు. అనంతరం ఇరాన్‌ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతున్నంత కాలం, పాకిస్తాన్‌కు సంప్రదిం పుల ప్రతినిధి బృందాన్ని పంపేందుకు ఇరాన్‌ తిరస్కరించినట్టు ఇరాన్‌ న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ ట్వీట్‌ చేసింది.

దిగ్బంధనం చట్టవిరుద్ధం
అమెరికా నౌకాదళ దిగ్బంధనం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా, అది ఒక ”చట్టవిరుద్ధమైన, నేరపూరితమైన” చర్య అని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ”ఇరాన్‌ ఓడరేవులు, తీరప్రాంతంపై అమెరికా విధించిన ‘దిగ్బంధనం’ పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిం చడమే కాకుండా, చట్టవిరుద్ధం, నేరపూరితం కూడా” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘాయీ ఎక్స్‌ పోస్ట్‌లో రాశారు. అంతేకాకుండా, ఇరాన్‌ ప్రజలపై ఉద్దేశపూర్వకంగా సామూహిక శిక్ష విధించడం యుద్ధ నేరం , మానవత్వానికి వ్యతిరేకమైన నేరం కిందకు వస్తుందని బఘాయీ జోడించారు. హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిచిన 24 గంటలలోపే మళ్లీ మూసివేసినట్టు ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూ షనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) నౌకాదళం శనివారం తెలిపింది. ఇరాన్‌ నౌకలు, ఓడరేవులపై అమెరికా తన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని స్పష్టం చేసింది.
పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ ఇషాక్‌ దార్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చీ ఆదివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ప్రస్తుత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి, నిరంతర సంభాషణలు, పరస్పర సంప్రదింపులు అత్యవసరమని తాము చర్చించినట్టు పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరాన్‌ను లొంగదీసుకొనేందుకు అమెరికా వ్యూహం
హార్ముజ్‌ జలసంధి వద్ద కొరకరాని కొయ్యగా మారిన ఇరాన్‌ను లొంగదీసుకొనేందుకు అమెరికా మరో వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు సంబంధించిన వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్లు ఎక్కడున్నా సీజ్‌ చేయాలనే వ్యూహంపై కసరత్తు చేస్తోంది. ఇరాన్‌ పోర్టులను దిగ్బంధించిన అమెరికా.. దాని జలరవాణా వ్యవస్థను కూడా దెబ్బతీయాలని భావిస్తోంది.
ఇరాన్‌కు అవసరమైన మెటీరియల్‌ సరఫరా చేసే నౌకలు.. ఇరాన్‌ చమురును తరలించే ట్యాంకర్లు అమెరికా రాడార్లలోకి రానున్నాయి. దీంతో ఉద్రిక్తతలు పశ్చిమాసియాను దాటి ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. ఇరాన్‌ నౌకలు నిన్న కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు బయటకు రావడం గమనార్హం. పశ్చిమాసియాకు దూరంగా ఉన్న ఇరాన్‌ వాణిజ్య నౌకలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి పెంటగాన్‌ సిద్ధమవుతోందని అమెరికా మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యూహం ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి సృష్టిస్తుందని అమెరికా అంచనా వేస్తోంది.
హార్ముజ్‌లో ఇప్పటివరకు అమెరికా 23 నౌకలను అడ్డుకుంది. వీటిల్లో ఆయుధాలు లేదా చమురు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌ రోజుకు 16లక్షల బ్యారెళ్ల చమురును విక్రయిస్తోంది. వీటిల్లో అత్యధికంగా చిన్న రిఫైనరీల ద్వారానే జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్‌ నౌకలు, కంపెనీలు, వ్యక్తులపై కొత్త ఆంక్షలను కూడా అమల్లోకి తీసుకొచ్చారు.

అమెరికాకు గొప్ప మిత్రదేశం
ఇజ్రాయిల్‌పై ట్రంప్‌ ప్రశంసలు

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయిల్‌పై ప్రశంసలు కురిపించారు. దాని ధైర్యసాహసాలను, విధేయతను మెచ్చుకున్నారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఆదివారం ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ అమెరికా వైపే ఇజ్రాయిల్‌ గట్టిగా నిలబడిందని చెప్పారు. ‘ప్రజలు ఇజ్రాయిల్‌ను ఇష్టపడినా లేకున్నా ఆ దేశం అమెరికాకు గొప్ప భాగస్వామిగా, మిత్రదేశంగా నిలిచింది. వారు ధైర్యవంతులు. సాహసికులు. తెలివైన వారు. ఘర్షణ, ఒత్తిడి సమయంలో ఇతరుల మాదిరిగా కాకుండా వారు తమ వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఇజ్రాయిల్‌ గట్టిగా పోరాడుతోంది. ఎలా గెలవాలో దానికి తెలుసు’ అని ట్రంప్‌ తెలిపారు. అదే సమయంలో ఆయన తన నాటో భాగస్వాము లపై విమర్శలు సంధించారు. ఇరాన్‌ యుద్ధాన్ని విమర్శించి, హార్ముజ్‌ జలసంధిని తెరిచేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను సమర్ధించడానికి నిరాకరించడం ద్వారా అవి తమ నిజస్వరూపాన్ని చాటుకున్నాయని మండిపడ్డారు.

ట్రంప్‌ పోస్టుపై వివరణ కోరిన ఇజ్రాయిల్‌
ఇదిలావుండగా లెబనాన్‌పై వైమానిక దాడులు జరప కుండా ఇజ్రాయిల్‌ను ‘కట్టడి చేశామ’ంటూ ట్రంప్‌ పెట్టిన పోసు ్టపై ఇజ్రాయిల్‌ వివరణ కోరింది. ట్రంప్‌ పోస్టు నెతన్యాహూను, ఆయన సలహాదారులను దిగ్భ్రాంతి పరచింది. ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ట్రంప్‌ పోస్టు విరుద్ధంగా ఉండడమే దీనికి కారణం.

తుది ఒప్పందం చాలా దూరంలో ఉంది : ఇరాన్‌
టెహ్రాన్‌ : అమెరికాతో యుద్ధానికి ముగింపు పలికేందుకు జరిపిన చర్చల్లో కొంత పురోగతి కన్పించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా చాలా దూరంలో ఉన్నదని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బఘేర్‌ ఘలీబఫ్‌ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో బఘేర్‌ వ్యాఖ్య ప్రాధాన్యత సంతరించుకుంది. తాము కొన్ని అంశాలపై పట్టుబట్టామని, అమెరికా కూడా అంతేనని చెప్పారు. ‘మా మధ్య అనేక అంతరాలు ఉన్నాయి. కొన్ని మౌలిక అంశాలు అలాగే ఉండిపోయాయి’ అని అన్నారు. తుది చర్చలకు చాలా దూరంలో ఉన్నామని తెలిపారు. తమ ముందు అనేక డిమాండ్లను ఉంచడానికి శత్రువులు ప్రయత్నించారని, వాటిని తాము అంగీకరించకపోవడం వల్లనే చర్చలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదని అన్నారు. ప్రభుత్వ టెలివిజన్‌తో ఆయన ఆదివారం మాట్లాడుతూ అనేక వారాల పాటు జరిగిన యుద్ధంలో క్షేత్ర స్థాయిలో తామే విజయం సాధించామని అన్నారు. ‘మేము శత్రువును నిర్మూలించలేదు. వారి వద్ద ఇప్పటికీ డబ్బు, ఆయుధాలు ఉన్నాయి. అయితే వ్యూహాత్మకంగా చూస్తే మా చేతిలో వారు ఓటమి పాలయ్యారు’ అని చెప్పారు. తమ డిమాండ్లకు అమెరికా అంగీకరించిందని, అందుకే కాల్పుల విరమణకు తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. తమతో జరిపిన యుద్ధంలో అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయిందని బఘేర్‌ తెలిపారు. హార్ముజ్‌ జలసంధి ఇప్పుడైనా, ఎప్పుడైనా తమ నియంత్రణలోనే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా తమ అణు కార్యక్రమాన్ని తోసిపుచ్చే హక్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు లేదని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తేల్చిచెప్పారు. ‘ఇరాన్‌ తన అణు హక్కులను ఉపయోగించుకోకూడదని ట్రంప్‌ అంటున్నారు. అయితే ఎందుకో, ఏం నేరం చేశామో చెప్పడం లేదు. ఒక దేశానికి ఉన్న హక్కును కాదనడానికి ఆయనెవరు?’ అని ప్రశ్నించారు.

భారత్‌తో సంబంధాలు బలంగా ఉన్నాయి : ఇరాన్‌ ప్రతినిధి
ఇరాన్‌, భారత్‌ మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని మన దేశంలో ఆ దేశపు సుప్రీం నేత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ అబ్దుల్‌ మజీద్‌ హకీం ఇలాహీ తెలిపారు. హార్ముజ్‌ జలసంధిలో రెండు భారత నౌకలపై జరిగిన కాల్పుల ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ‘దాని గురించి నాకు తెలీదు. అయితే అంతా సర్దుకుంటుందని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. అమెరికాతో యుద్ధాన్ని తాము కోరుకోలేదని అన్నారు. శాంతినే తాము వాంఛిస్తున్నామని, వారు కూడా దానినే కోరుకుంటారని అనుకుంటున్నానని చెప్పారు.

ఇరాన్‌తో పాక్‌ ఆర్మీ చీఫ్‌ సంబంధాలపై…
అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారుల ఆందోళన

పాకిస్తాన్‌ సైనిక దళాల ప్రధానాధికారి అశిం మునీర్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధాలపై అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు మునీర్‌ అత్యంత ప్రీతిపాత్రుడన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ మునీర్‌ వ్యవహార శైలిపై అమెరికా జాతీయ భద్రతా సంస్థలో భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయని ఫాక్స్‌ న్యూస్‌ వార్తా సంస్థ తెలియజేసింది. ఇంటెలిజెన్స్‌ అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇరాన్‌ సైనిక నాయకత్వంతో మునీర్‌కు ఉన్న చారిత్రక సంబంధాలపై అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులే కాకుండా ప్రాంతీయ విశ్లేషకులు కూడా అనుమానాలు వెలిబుచ్చుతున్నారు. అమెరికా, ఇరాన్‌ మధ్య మునీర్‌ మధ్యవర్తిత్వం నెరపుతున్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఇరు పక్షాలతో ఆయనకు ఉన్న సంబంధాలు వ్యూహాత్మక ఇబ్బందులు సృష్టించవచ్చునని విమర్శకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)లోని కొందరు సీనియర్‌ వ్యక్తులతో మునీర్‌కు దీర్ఘకాల సాన్నిహిత్యం ఉన్నదని వారు ప్రస్తావించారు.

మునీర్‌కు ఖుద్స్‌ దళాల మాజీ కమాండర్‌ ఖసీం సొలైమని, ఐఆర్‌జీసీ కమాండర్‌ హుస్సేన్‌ సలామీలతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పాకిస్తాన్‌ రిటైర్డ్‌ జనరల్‌ అహ్మద్‌ సయీద్‌ చెప్పారు. ఈ సంబంధాల కారణంగానే ఆయన దౌత్య యత్నాలపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని తెలిపారు. ‘ఆయన అమెరికా నాయకత్వంతో మాట్లాడతారు. ఇంటెలిజెన్స్‌ అధికారులతో మాట్లాడతారు. అటు ఐఆర్‌జీసీతోనూ మాట్లాడ తారు’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ సైనిక, దౌత్య, రాజకీయ వ్యక్తులతో కూడా మునీర్‌కు సంబంధాలు ఉన్నాయని సయీద్‌ అన్నారు.కాగా ఫౌండేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ఆఫ్‌ డెమొక్రసీస్‌ (ఎఫ్‌డీడీ) సంస్థ విశ్లేషకులు కూడా సయీద్‌ అభిప్రాయాలతో ఏకీభవిం చారు. ‘పాకిస్తానీయులను ట్రంప్‌ నమ్మకూడదు. ఆఫ్ఘనిస్తాన్‌లో పాక్‌ మోసపూరిత భాగస్వామి. మన స్నేహితుడిగా నటిస్తూనే తాలిబాన్‌ను సమర్ధించింది. ఐఆర్‌జీసీతో మునీర్‌కు ఉన్న సంబంధాలు ట్రంప్‌ ప్రభుత్వానికి రెడ్‌ సిగల్‌ వంటివి’ అని వారు హెచ్చరించారు. మునీర్‌ ఇటీవలే ఇరాన్‌లో మూడు రోజుల పాటు పర్యటించారు. ఇరాన్‌ అధ్యక్షుడితో, విదేశాంగ మంత్రితో, పార్లమెంట్‌ స్పీకర్‌తో, సీనియర్‌ సైనిక నాయకత్వంతో భేటీ అయ్యారు. ఇరాన్‌, అమెరికా మధ్య రెండో విడత చర్చలు కూడా పాకిస్తాన్‌లోనే జరిగే అవకాశం ఉంది.

సిద్ధంగా ఉండండి సైన్యాన్ని అప్రమత్తం చేసిన నెతన్యాహూ
హార్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు తలెత్తిన వేళ ఇరాన్‌తో మరోసారి ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నదని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇజ్రాయిల్‌ సైనిక దళాలను అప్రమత్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ నుంచి ఎప్పటిక ప్పుడు వస్తున్న సంకేతాలను ఇజ్రాయిల్‌ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ట్రంప్‌ తరచుగా తన వైఖరిని మార్చుకుంటుండడమే దీనికి కారణం. త్వరలోనే ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని ఒకసారి, టెహ్రాన్‌పై బాంబు దాడులు చేస్తామని మరోసారి ఆయన చెబుతుంటారు. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తిరిగి మూసివేయడంతో ట్రంప్‌ తాజాగా ఓ ప్రకటన చేస్తూ బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు టెహ్రాన్‌ను అనుమతించబోనని అన్నారు.
పరిస్థితి ఏ మలుపు తీసుకుంటుందో అర్థం కావడం లేదని ఇజ్రాయిల్‌ అధికారులు తెలిపారు. పరిస్థితులు ఎలా మార తాయో చెప్పలేమని ఓ అధికారి చెప్పారు. ఒప్పందం కుదుర్చు కోవాలని ట్రంప్‌ భావిస్తున్నప్పటికీ ఇరాన్‌ కఠిన వైఖరి అవలంబి స్తోందని ఆయన ఆరోపించారు. ఇదిలావుండగా ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేం దుకు ఇజ్రాయిల్‌ సైన్యం సన్నాహాలు పూర్తి చేసింది. వైమానిక దళాన్ని కూడా ప్రధాని అప్రమత్తం చేశారని, లక్ష్యాల జాబితా సిద్ధమైందని వార్తలు వచ్చాయి. కాగా హోం ఫ్రంట్‌ కమాండ్‌ జారీ చేసిన మార్గదర్శకాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా పాఠశాలలు తెరుచు కున్నాయి. అయితే మెమోరియల్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో పరిస్థితి అనిశ్చితిలో పడింది. మరోవైపు లెబనాన్‌ విషయంలో కూడా ఇజ్రాయిల్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్‌ అమ్ముల పొదిలో ‘మస్కిటో ఫ్లీట్‌’
హార్ముజ్‌లో అమెరికా నౌకాదళానికి ముప్పు

హార్ముజ్‌ జలసంధిపై అమెరికా దిగ్బంధనం నేపథ్యంలో.. ఇరాన్‌ ‘మస్కిటో ఫ్లీట్‌’తో ఇప్పటికే దడపుట్టిస్తోంది. ఇది చిన్నగా ఉన్నా.. వేగవంతమైన దాడి సామర్థ్యం కలిగి ఉండటమే కాదు, అమెరికాపై బలాన్ని ప్రదర్శిస్తోంది. న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల వల్ల ఇరాన్‌ ప్రధాన యుద్ధనౌకలకు గణనీయమైన నష్టం వాటిల్లింది. పర్షియన్‌ గల్ఫ్‌ తీరం వెంబడి ఉన్న ఇరాన్‌ నావికా స్థావరాల వద్ద అనేక యుద్ధనౌకలు దెబ్బతిన్నాయి.
అయినప్పటికీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) నౌకాదళానికి చెందిన ఒక ‘షాడో ఫ్లీట్‌’ హార్ముజ్‌లో అమెరికా యుద్ధనౌకలకు గణనీయమైన ముప్పును కలిగిస్తూనే ఉంది. ఐఆర్‌జీసీ చెందిన ఈ నౌకాదళంలో.. ‘హిట్‌-అండ్‌-రన్‌’ వ్యూహాన్ని ఉపయోగించే చిన్న, వేగవంతమైన పడవలు ఉంటాయి. ఈ పడవలు, రహస్య తీరప్రాంత స్థావరాల నుంచి క్షిపణి, డ్రోన్‌ దాడులను ప్రారంభిస్తూ, హార్ముజ్‌ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తోంది.
లెబనాన్‌లో కాల్పుల విరమణ జరిగే వరకు ఈ కీలకమైన సముద్ర మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్‌ స్పష్టం చేసింది. అయితే అమెరికా మాట తప్పుతుంటే.. ఇరాన్‌ ప్రకటనలు మారాయి. హార్ముజ్‌ జలసంధి తమ నియంత్రణలో ఉందని, ఇరాన్‌ అనుమతి లేకుండా ఏ నౌకలూ దాని గుండా వెళ్లడానికి వీల్లేదని ఐఆర్‌జీసీ ఇప్పుడు ప్రకటించింది. ఐఆర్‌జీసీ నౌకాదళం ఇరాన్‌ సాధారణ నౌకాదళం నుంచి విడిగా పనిచేస్తూ, గెరిల్లా తరహా యుద్ధ వ్యూహాలను అనుసరిస్తోంది. ఇందులో చిన్నగా ఉండి, వేగంగా కదులుతూ, గుర్తించడం కష్టమైన పడవలు శత్రు లక్ష్యాలపై ఆకస్మిక దాడులు చేస్తాయి.

ఇరాన్‌ నౌకాదళానికి భారీ నష్టాలు
ఇజ్రాయిల్‌, అమెరికా దాడుల్లో ఇరాన్‌ సాధారణ నౌకాదళం భారీ నష్టాలను చవిచూసినప్పటికీ, ఐఆర్‌జీసీ నౌకాదళం వందల నుంచి వేల సంఖ్యలో చిన్న పడవలతో కూడిన పెద్ద సముదాయాన్ని నిర్వహిస్తోంది. ఈ ఐఆర్‌జీసీ మస్కిటో ఫ్లీట్‌ తీరం వెంబడి ఉన్న రహస్య భూభాగ స్థావరాల్లో దాగి ఉంటోంది. అవసరాన్ని బట్టి ఈ పడవలను వేగంగా సముద్రంలోకి పంపవచ్చు. ఇరాక్‌ యుద్ధ సమయంలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఇరాన్‌ ఈ వ్యూహాన్ని అవలంబించింది.
అమెరికా నౌకాదళ శక్తిని నేరుగా ఎదుర్కోలేమని ఇరాన్‌ గ్రహించినప్పుడు, అది మస్కిటో ఫ్లీట్‌ను ఉపయోగించే వ్యూహాన్ని అవలంబించింది. ఐఆర్‌జీసీ నౌకాదళంలో సుమారు 50,000 మంది సిబ్బంది ఉన్నారు. ఇది పర్షియన్‌ గల్ఫ్‌లో చురుకుగా ఉంది. ఐఆర్‌జీసీ ప్రారంభంలో సాధారణ పడవలకు మెషిన్‌గన్‌లు, రాకెట్‌ లాంచర్‌లను అమర్చింది. కానీ ఇప్పుడు తన సామర్థ్యాలను విస్తరించింది. దీని వద్ద హై-స్పీడ్‌ ఫ్రిగేట్‌లు, మినీ-జలాంతర్గాములు, సముద్ర డ్రోన్‌లు కూడా ఉన్నాయి. దీనిలోని కొన్ని పడవలు 100 నాట్‌ల (185.2 కి.మీ/గం) కంటే ఎక్కువ వేగాన్ని అందుకోగలవు, దీనివల్ల అవి వేగంగా దాడి చేసి తప్పించుకోగలవు.
ఈ ముప్పులను ఎదుర్కోవడానికి అమెరికా యుద్ధనౌకలు ఆధునిక ఆయుధాలతో సన్నద్ధమై ఉండగా, వాణిజ్య నౌకలు అటువంటి ముప్పులను ఎదుర్కోవడానికి అవసరమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానంతో సన్నద్ధమై లేవని అమెరికా భావిస్తోంది. అయితే ఇరాన్‌ వ్యూహాత్మకంగా దెబ్బతీస్తున్న తీరు ట్రంప్‌ను భయపెట్టిస్తోంది. అమెరికా నౌకాదళం ఒమన్‌ గల్ఫ్‌, అరేబియా సముద్రంలో మోహరించి, హార్ముజ్‌ జలసంధి గుండా ఇరాన్‌ నౌకలు వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఒకవేళ అమెరికా హోర్ముజ్‌పై తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే, ఎర్ర సముద్రం వంటి ఇతర కీలక సముద్ర మార్గాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరించవచ్చని ఇరాన్‌ హెచ్చరించింది.

తిరుగుముఖం పట్టిన నౌకలు
భారత్‌ పతాకంతో శుక్ర, శనివారాల్లో హార్ముజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన ఎనిమిది నౌకలు తిరుగుముఖం పట్టాయి. సన్మర్‌ హెరాల్డ్‌ అనే నౌకపై ఇరాన్‌ దళాలు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ)కు చెందిన ముడి చమురు ట్యాంకర్‌ దేశ్‌ గరిమ డ్రైడాక్‌ మరమ్మతుల కోసం పర్షియన్‌ గల్ఫ్‌కు వెళ్లింది. అది కూడా హార్ముజ్‌ నుంచి బయటికి వచ్చింది. దాడికి గురైన సన్మర్‌ హెరాల్డ్‌ నౌకలో రెండు మిలియన్‌ బ్యారల్స్‌ ముడి చమురు ఉంది. ఇది హార్ముజ్‌ లోపలికి వెళ్లి లారక్‌ దీవిని కూడా దాటింది. సన్మర్‌ హెరాల్డ్‌ నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని దాని యజమాన్య సంస్థ తెలియజేసింది. డ్రై డాకింగ్‌కు వెళ్లిన మరో ముడి చమురు నౌక సన్మర్‌ సుపర్ణ ఇప్పటికీ పర్షియన్‌ గల్ఫ్‌లోనే ఉంది. అది సురక్షితంగానే ఉన్నదని తెలుస్తోంది. రెండు మిలియన్‌ బ్యారల్స్‌ ఇంధన చమురుతో, కువైట్‌ ముడి చమురుతో ప్రయాణిస్తున్న మరో పెద్ద నౌక దేశ్‌ విభర్‌ కూడా వెనుదిరిగింది. హెంగం దీవికి దక్షిణంగా ఉన్న ఈ నౌక దిశ మార్చుకుంది. కంటైనర్‌ నౌకలైన సీఎంఏ జీజీఎం డైమండ్‌, సీఎంఏ జీజీఎం మానస్‌లు లారక్‌ దీవిని దాటాయి. చమురు ట్యాంకర్‌ దేశ్‌ సురక్ష కూడా లారక్‌ దీవి నుంచి వెనుదిరిగింది. గ్రేట్‌ ఈస్ట్రన్‌ షిప్పింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన జగ్‌ అర్నవ్‌ నౌక సైతం వెనక్కి వస్తోంది.

బాబ్‌ అల్‌ మాండెబ్‌ను మూసేస్తాం : హౌతీల ప్రకటన

అమెరికా-ఇజ్రాయిల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్‌ హర్మూజ్‌ను మూసివేయడంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్‌ సంక్షోభం నెలకొంది. ఇప్పుడు సూయజ్‌ కెనాల్‌కు వెళ్లే మార్గంలోని మరో జలసంధిని మూసివేస్తామని యెమన్‌లోని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచశాంతికి విఘాతం కలిగే చర్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కొనసాగిస్తే తాము బాబ్‌ అల్‌ మాండెబ్‌ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి దాన్ని మూసేస్తే.. తిరిగి తెరిపించడం ప్రపంచంలోని ఏ ఒక్కరికీ సాధ్యం కాదని హౌతీ ప్రభుత్వ విదేశాంగశాఖ ఉప మంత్రి హుస్సేన్‌ పేర్కొన్నారు.

మాండెబ్‌ జలసంధి ఎక్కడుందంటే…
యెమన్‌, జిబౌటి మధ్య మాండెబ్‌ జలసంధి ఉంది. ఇది ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తోంది. సూయజ్‌ కాలువ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక మార్గం. ఎర్ర సముద్రానికి, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌కు మధ్య ద్వారంలా ఇది ఉంది. దీని వెడల్పు దాదాపు 30 కి.మీ. మాత్రమే. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమా సియా మధ్య ప్రయాణించే నౌకలకు ఇది చాలా కీలక మార్గం. నిత్యం ఈ మార్గంలో 45లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవు తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10-12 శాతం దీని ద్వారా నే పయనిస్తోంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్‌ఎన్‌జీ, తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా రూ.93.95లక్షల కోట్ల విలువైన సర కులు ఈ జలసంధి గుండా రవాణా అవుతున్నట్టు అంచనా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -