Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంపశ్చిమబెంగాల్‌లో 7 లక్షల కొత్త ఓట్లు

పశ్చిమబెంగాల్‌లో 7 లక్షల కొత్త ఓట్లు

- Advertisement -

జాబితాలో జత చేసిన ఈసీ..
మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌ ఉండగా
యాడింగ్‌పై అనుమానాలు
కోల్‌కతా :
మరో నాలుగు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌కు సరిగ్గా నాలుగు రోజుల ముందు బెంగాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటరు జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చింది. అయితే ఈ అదనపు ఓటర్ల వయసు, వారు పురుష లేదా మహిళా ఓటర్లా అనే విషయాన్ని సీఈసీ వెల్లడించకపోవడం గమనార్హం. అలాగే ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం అందిన ఫారం-6 దరఖాస్తుల సంఖ్యను గానీ, వాటిలో ఎన్ని తిరస్కరణకు గురయ్యాయో అనే విషయాన్నీ వెల్లడించలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే బెంగాల్‌ ఓటరు జాబితాల్లో లక్షలాది మందిని చేర్చడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంపై టీఎంసీ, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటిదశ పోలింగ్‌లో (ఏప్రిల్‌ 23న) ఓటు వేయనుండగా, మిగిలిన 3.88 లక్షల మంది ఓటర్లు రెండో దశ పోలింగ్‌లో (ఏప్రిల్‌ 29న) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా మొత్తం గణాంకాలను విడుదల చేశామని పేర్కొన్నారు. వివరణాత్మక సమాచారాన్ని తర్వాత విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6,82,51,008గా ఉందని, మరిన్ని పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
పోలీస్‌ ఉన్నతాధికారులతో సీఈసీ మీటింగ్‌
రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో బెంగాల్‌ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌ శనివారం సీనియర్‌ పోలీస్‌ అధికారులతో వర్చువల్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగ కూడదని, అలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో హింసకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని అగర్వాల్‌ ప్రశ్నించారు. అలాగే తరచూ నేరాలకు పాల్పడేవారిని, ఎన్నికల సంబంధిత నేరాల చరిత్ర ఉన్నవారిని గుర్తించాలని ఆదేశించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి : ఈసీ అగర్వాల్‌
”శాంతిభద్రతల నిర్వహణలో ఎలాంటి లోపం జరిగినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. బాధ్యత గల అధికారులు సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎన్నికల రోజున ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తక్షణమే, కఠినమైన చర్యలు తీసుకోవాలి. పోలింగ్‌ సమయంలో ఏ ప్రాంతంలోనైనా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లేదా పేలుడు పదార్థాలు లభిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి అలాంటి సందర్భాల్లో సంబంధిత పోలీస్‌ స్టేషన్‌దే బాధ్యత. వెంటనే చర్యలు తీసుకోకపోతే అధికారులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుంది. ” అని బెంగాల్‌ ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్‌ కుమార్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు.
152 స్థానాల్లో పోలింగ్‌
బెంగాల్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 23న జరగనుంది. 294 స్థానాలకుగానూ 152 నియోజకవర్గాల్లో తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. కూచ్‌ బెహార్‌, అలీపుర్‌ద్వార్‌, జల్‌పారుగురి, డార్జిలింగ్‌, ఉత్తర దినాజ్‌పుర్‌, దక్షిణ దినాజ్‌పుర్‌, మాల్దా, ముర్షిదాబాద్‌, పురూలియా, బాంకురా, ఝార్‌గ్రామ్‌, పశ్చిమ మేదినీపుర్‌, పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలతో పాటు, బీర్భూమ్‌, నాదియా జిల్లాలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది.
టీఎంసీ వర్సెస్‌ బీజేపీ
ఈ సారి బెంగాల్‌ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టిన టీఎంసీ, నాలుగో సారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో మిస్‌ అయిన బెంగాల్‌ను ఈ సారి ఎలాగైనా దక్కించుకోవటానికి అడ్డదారులు అన్వేషిస్తోందని, ఇందులో భాగంగానే ఏడు లక్షల ఓటర్లను యాడ్‌ చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -