పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి
లంబాడి తండా ‘డబుల్’ ఇండ్లలో లిఫ్టులకు రిపేర్ చేయించాలి
కాంగ్రెస్ గ్యారంటీలు అందరికీ వర్తింపజేయాలి :
సీపీఐ(ఎం) ‘బస్తీ బాట’లో కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి భగత్‌సింగ్ నగర్‌లో దశాబ్దాలుగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని బస్తీల్లో నెలకొన్న ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ‘బస్తీ బాట’ కార్యక్రమం ప్రారంభమైంది. ముషీరాబాద్ జోన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లి డివిజన్ భగత్‌సింగ్ నగర్ గుడిసెలు, లంబాడీ తండాలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టి.జ్యోతి ప్రారంభించి, స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడు తూ.. భగత్‌సింగ్ నగర్ గుడిసెల్లో నివసిస్తున్న 73 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్తీలో జనాభాకు అనుగుణంగా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.
లిఫ్టులు లేక అవస్థలు.. కమర్షియల్ విద్యుత్ భారాలు
లంబాడీ తండాలో నిర్మించిన జీ-ఫ్లస్9 డబుల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో ఉన్న రెండు లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల 118 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని జ్యోతి తెలిపారు. వృద్ధులు, రోగులు పైఅంతస్తులకు మెట్ల ద్వారా వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి లిఫ్టులకు రిపేర్లు చేయించాలని కోరారు. అలాగే, బస్తీ ప్రజల అవసరాల కోసం వినియోగించే బోర్ మోటార్లకు విద్యుత్ శాఖ అధికారులు కమర్షియల్ కనెక్షన్లు ఇచ్చి దోచుకుంటున్నారని, వాటిని వెంటనే గృహ అవసరాల కేటగిరీలోకి మార్చాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల వాగ్దానాలు ఏమాయ్యాయి?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు బస్తీల్లో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని జ్యోతి విమర్శించారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి వంటి పథకాలు కొందరికి మాత్రమే అందుతున్నాయని, అర్హులైన పేదలందరికీ వర్తింపజేయాలని కోరారు. బస్తీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సీపీఐ(ఎం) పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ బస్తీబాట కార్యక్రమంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.వెంకటేష్, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, ఎం.దశరథ్, ముషీరాబాద్ జోన్ కార్యదర్శి ఆర్.వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, జోన్ నాయకులు కె.రమేష్, ఏఏకె పాషా, ఆర్.వెంకటమ్మ, డి.సైదులు, నర్సింగ్ రావు, జావేద్, లెనిన్, మల్లయ్య, రాజు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
బస్తీ సమస్యలు తీర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



