సమాజానికి సేవ చేయాలనే తపన, వృత్తిపట్ల అంకితభావం, మహిళల అభ్యున్నతిపై నిబద్ధత… ఈ మూడు విలువలను తన జీవిత ప్రయాణంలో అందంగా మేళవించుకున్న వ్యక్తిత్వం డా. విజయలక్ష్మి మాచర్ల సొంతం. దంత వైద్య రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూనే, సామాజిక బాధ్యతను మరువకుండా వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
బెంగళూరులో పుట్టి పెరిగిన డా. విజయ లక్ష్మి1998లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (BDS) పూర్తి చేసి తన వైద్య ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ ఎస్.ఎన్. గుప్తను వివాహం చేసుకుని, ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్‌లో ఏడేండ్లకు పైగా సేవలందించారు. ఆ అనుభవాన్ని పునాదిగా చేసుకుని హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో “విజయ డెంటల్”ను స్థాపించి, నాణ్యమైన దంత వైద్య సేవలను అందిస్తున్నారు.
ప్రపంచ స్థాయి సేవలు – మానవత్వమే లక్ష్యం
డా. విజయ లక్ష్మి నైపుణ్యం దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వివిధ దేశాల నుంచి వచ్చిన రోగులకు విజయవంతమైన చికిత్సలు అందించి, విశ్వాసాన్ని సంపాదించారు. ఆమెకు వైద్యం కేవలం వృత్తి కాదు, రోగుల జీవితాల్లో చిరునవ్వులు నింపే ఒక సేవా యజ్ఞం.
కోవిడ్ సంక్షోభంలో సేవామూర్తి
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం భయాందోళనలకు గురైన వేళ డా. విజయ లక్ష్మి మాత్రం ముందుండి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆహారం లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆహారాన్ని అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు. కష్టకాలంలో ప్రజల పక్కన నిలబడటమే నిజమైన వైద్య సేవ అని నిరూపించారు.
ఆరోగ్య అవగాహనకు వారధి
గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అనేక ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ నోటి ఆరోగ్యం, దంత సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషి ప్రశంసనీయం.
మహిళా సాధికారతకు మార్గదర్శి
డా. విజయ లక్ష్మి వ్యక్తిత్వంలోని అత్యంత విశిష్టమైన అంశం మహిళల సాధికారత పట్ల ఆమెకున్న నిబద్ధత. ఆమె నిర్వహిస్తున్న డెంటల్ క్లినిక్ పూర్తిగా మహిళా సిబ్బందితో పనిచేయడం విశేషం. ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, ఆర్థిక స్వావలంబనకు తోడ్పడుతున్నారు. ‘‘మహిళలు అవకాశాల కోసం ఎదురు చూడకూడదు… సృష్టించుకోవాలి’’ అనే సందేశాన్ని ఆమె తన కార్యాచరణ ద్వారా చాటి చెబుతున్నారు.
‘రూ.1 క్యాంపెయిన్’.. సేవలో వినూత్నత
ప్రతి ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే “రూ.1 క్యాంపెయిన్” ఆమె సామాజిక స్పృహకు ఓ నిదర్శనం. కేవలం ఒక రూపాయికే దంత పరీక్షలు, ఆరోగ్య అవగాహన సేవలు అందిస్తూ వందలాది మహిళలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే సందేశాన్ని సమాజానికి అందిస్తున్నారు.
నేటి మహిళలకు స్ఫూర్తి
కుటుంబ బాధ్యతలు, వృత్తి జీవితం, సామాజిక సేవ… ఈ మూడింటినీ సమర్థంగా సమన్వయం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్న డా. విజయలక్ష్మి మాచర్ల నేటి మహిళలకు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం. కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని, ఆ విజయాన్ని సమాజ సేవకు వినియోగిస్తే జీవితానికి నిజమైన అర్థం లభిస్తుందని ఆమె జీవితం తెలియజేస్తోంది. ‘‘వైద్యం నా వృత్తి… సేవ నా ధర్మం… మహిళల అభివృద్ధి నా సంకల్పం’’ అనే భావనతో ముందుకు సాగుతున్న డా. విజయ లక్ష్మి నిజంగా సమాజానికి ఒక స్ఫూర్తి ప్రదాత.
హిప్నో హిమకర్.జి
లైఫ్ కోచ్ ట్రైనర్ – 9390044031



