Tuesday, February 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివలస పాలనను తలపించే అసమాన ఒప్పందం

వలస పాలనను తలపించే అసమాన ఒప్పందం

- Advertisement -

కొన్ని ప్రత్యేక అంశాలను వదిలేసినా, అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందంలో రెండు అసాధారణ లక్షణాలున్నాయి. వాటిని బట్టి అది అసమాన ఒప్పందం అని చెప్పగలం. గతంలో వలస పాలన రోజుల్లో తమ ప్రత్యక్ష పరిపాలనలో లేకుండా ఉండే మూడవ ప్రపంచ దేశాల మీద సామ్రాజ్యవాదులు బలవంతంగా రుద్దిన ఒప్పందాలను ఇది గుర్తుకు తెస్తోంది. అసలు ఒప్పందం పరిధిలోకి రాని సరుకులను మినహాయించితే, ఈ ఒప్పందం ప్రకారం భారతీయ సరుకుల మీద అమెరికా పద్దెనిమిది శాతం సుంకాన్ని విధిస్తుంది. అదే అమెరికన్‌ సరుకుల మీద భారతదేశం సున్నా శాతం సుంకాన్ని విధిస్తుంది. ట్రంప్‌ చెప్పినది ఇదే. ఇంత తేడా ఉండే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అంటేనే చాలా వికారం కలుగుతోంది. ‘పొరుగు వాడిని అడుక్కు తినేలా చేసే విధానం’ అమెరికా మన విషయంలో అనుసరిస్తున్నట్టు ఇప్పుడు మనం భావించాలి. ఈ విధానం ప్రకారం పొరుగుదేశంగా ఉన్న మనం ‘అడుక్కు తినే’ హోదాను అంగీకరిస్తున్నట్టు ఒప్పందం మీద సంతకం చేయాలన్నమాట! ఇక రెండవ అంశం: ఇప్పటి నుంచీ ఐదేళ్లపాటు ప్రతీ ఏడూ వంద బిలియన్ల డాలర్ల (దాదాపు రూ.90వేల కోట్లు)కు తగ్గకుండా అమెరికన్‌ సరుకులను మన దేశం కొనుగోలు చేయాలి. బూర్జువా వర్గం అమితంగా ప్రేమించే ‘స్వేచ్ఛా వాణిజ్య సిద్ధాంతం’ ఇప్పుడేమైనట్టు? కొనుగోలు చేసేవారి అభీష్టాన్ని బట్టి ఒక దేశపు కొనుగోలుదారులు మరొక దేశం నుండి కొనుగోలు చేసేందుకు స్వేచ్ఛ ఉంది అని ఆ సిద్ధాంతం చెప్తుంది. కాని దాన్ని పూర్తిగా ఉల్లంఘించి తన వద్ద నుండి తప్పనిసరిగా కొనుగోలు చేసి తీరాలంటూ ఒక దేశం మరొక దేశాన్ని నిర్బంధిస్తోంది. పైగా అటువంటి షరతు ఏదీ తనకు మాత్రం వర్తించకుండా వ్యవహరి స్తోంది. ఇప్పుడు అమెరికా భారతదేశం నుండి తప్పనిసరిగా కొనుగోలు చేయాలన్న షరతు ఏదీ ఈ ఒప్పందంలో లేదు. అంటే ఇది పూర్తిగా ఏకపక్షంగా ఉంది. అందుకే ఇది అసమాన ఒప్పందం అయింది.

ఇంత అసమానతలున్నాయి గనుక ఈ ఒప్పందం కచ్చితంగా మనమీద రుద్దబడిన ఒప్పందమే. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని డ్రామాలైనా ఆడవచ్చు గాని, ఈ ఒప్పందం మీద మన ప్రభుత్వం సంతకం పెట్టేలా దాని మెడలు వంచారన్నది మాత్రం స్పష్టం. ఇంత హీనంగా, ఒక అసమాన ఒప్పందం మీద మన ప్రభుత్వం సంతకం పెట్టడం అనేది స్వాతంత్య్రం అనంతర కాలంలో ఇదే మొదటిసారి. గత ప్రభుత్వాలేవీ ఇంతగా దిగజారి పోలేదు. ఇది మళ్లీ వలసపాలనను గుర్తు చేస్తోంది.

ఈ ఒప్పందం పర్యవసానాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న రెండు ముఖ్యమైన పర్యవసానాలు ఇలా ఉన్నాయి: మొదటిది: రష్యా నుండి చమురు కొనుగోలుకు సంబంధించినది. రెండవది: వ్యవసాయ రంగానికి సంబంధించినది. ఇక్కడ ముఖ్యంగా తలెత్తే ప్రశ్న ఏమంటే, అమెరికా నుండి ప్రస్తుతం అవుతున్న దిగుమతుల విలువ నలభై బిలియన్‌ డాలర్లుగా ఉంది. దానిని ఒక్క ఏడాదిలో ఎలా వంద బిలియన్లకు పెంచుతారు? కేవలం ఆ దిగుమతులమీద సుంకాలను సున్నా శాతానికి తెచ్చారు గనుక అమాంతం ప్రజలు వాటి దిగు మతులను రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయిలో ఎలా కొనుగోలు చేయగలుగుతారు? మన దేశంలో కొనుగోలుశక్తి తరిగిపోతోందే తప్ప పెరుగుదల లేదు కదా? అందువలన, భారత ప్రభుత్వం బహుశా రష్యా నుండి దిగుమతి అవుతున్న చమురును కొనడం ఆపివేసి అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం ప్రారంభించవచ్చు. అప్పుడు అమెరికా కోరిన విధంగా అక్కడి నుండి దిగుమతులు పెరుగుతాయి. కాని అదే సమయంలో చమురు దిగు మతుల కోసం మనం వెచ్చించే మొత్తం బాగా పెరిగిపోతుంది. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఎందుకంటే అమెరికన్‌ చమురు రష్యన్‌ చమురు కన్నా కనీసం ఇరవై శాతం ఎక్కువ ఖరీదు.

ప్రస్తుతం మన మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు మూడో వంతు రష్యా నుండి వస్తున్నాయి. ఇటీవలి కాలంలో మన ప్రభుత్వం క్రమంగా రష్యా నుండి కొనుగోలు తగ్గిస్తూ వస్తోంది. ఇదంతా అమెరికాను ప్రసన్నం చేసుకోడానికే అని వేరే చెప్పనక్కర్లేదు. మన మొత్తం చమురు దిగుమతుల విలువ సుమారు 120 బిలియన్ల డాలర్లు. అందులో మూడవ వంతు రష్యా నుంచి కొంటున్నాం. అంటే అది నలభైౖ బిలియన్ల డాలర్లు. ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలు నిలిపివేసి అమెరికా నుండి కొనడం మొదలుపెడితే, మన మొత్తం చమురు దిగుమతుల బిల్లు కనీసం ఎనిమిది బిలియన్ల డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుంది. మన దేశం నుండి అమెరికాకు సంపదను తరలించుకుపోయే మరొక ఒప్పందం ఇది. అయితే ఈ సంపద మన దేశీయ చమురు కంపెనీల నుంచి తరలిపోయేది మాత్రం కాదు. ఈ అదనపు ఖర్చును వాళ్లు కొనుగోలుదారుల మీద మోపు తారు. అంటే ఈ ద్రవ్యోల్బణ భారాన్ని మన శ్రామిక వర్గం భరించాలన్నమాట. ఆ శ్రామికవర్గంలో అత్యధిక శాతం వేతనాలు ధరల సూచీతో అనుసంధానం అవలేదు. కాబట్టి వాళ్ల ఆదాయాలు పెరగవు. రష్యాకి బదులు అమెరికన్‌ చమురును కొనడం అంటే భారాన్ని ప్రజల మీదకి నెట్టడానికే అది దారితీస్తుంది. అందుచేత ఈ ఒప్పందం అంతర్జాతీయ దౌత్య వ్యవహారంగా చూడకూడదు. శ్రామిక ప్రజానీకం మీద అదనపు భారాన్ని మోపే ముఖ్యమైన వర్గ సమస్యగా దీన్ని చూడాలి.

ఇక వ్యవసాయ రంగానికి వస్తే, ఒప్పందం పరిధిలోకి బియ్యం, గోధుమ వంటి పంటలు రావు గనుక మన వ్యవసాయం దెబ్బ తినదని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని ఈ రంగంలోని కొన్ని ప్రాధాన్యత గలిగిన పంటలు, ఉప ఉత్పత్తులు దెబ్బ తింటాయి. బహిరంగంగా చెప్పకపోయినా, వాణిజ్య మంత్రి ఈ విషయాన్ని అంగీకరించారు. యాపిల్‌, పత్తి, జీడి, బాదం వంటి పప్పులు, తాజా పండ్లు, ప్రాసెస్డ్‌ పండ్లు, సోయాబీన్‌ తైలం, వైన్‌ తదితర మద్యాలు, కోళ్లకు, పశువులకు ఉపయోగించే మేత (మొక్క జొన్నలతో తయారు చేసేది), ఎర్రజొన్నలు వంటివి దిగుమతి చేసుకోడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందువలన అమెరికన్‌ ఉత్పత్తులు స్వల్పకాలంలోనే భారతీయ మార్కెట్‌లో గుత్తాధిపత్యం సాధించగలుగుతాయి. జమ్ము, కాశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు ప్రత్యేకించి బాగా నష్టపోతాయి.

మన దేశంలో పశువుల మేతకు కొరత ఉంది గనుక దిగుమతులను అనుమతించడం ప్రయోజనకరమే అని వాదించవచ్చు. కాని మనకు అవసరమైన మేరకు వాటిని దిగుమతి చేసుకోవడం వేరు, ఏకంగా మన మార్కెట్‌లోకి నిర్నిబంధంగా వాటి ప్రవేశానికి అనుమతించడం వేరు. పైగా అవి సున్నా సుంకంతో వచ్చి దిగ బడతాయి. ఇక డెయిరీ ఉత్పత్తులను ఈ ఒప్పందం నుంచి మినహాయించారంటూ వాణిజ్య మంత్రి చెప్తున్నారు. కాని దానివలన ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఈ ఒప్పందానికి ముందే యూరో పియన్‌ యూనియన్‌ దేశాలతో, న్యూజిలాండ్‌, బ్రిటన్‌లతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో డెయిరీ ఉత్పత్తుల దిగుమతులకు తలుపులు తెరిచారు.

అక్కడ అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఒప్పందం ఫలితంగా అమెరికన్‌ రైతుల ఆదాయాలు బిలి యన్ల డాలర్ల మేరకు పెరగబోతున్నాయంటూ మాట్లాడుతోంది. ఇక్కడ భారత ప్రభుత్వం మాత్రం మన వ్యవ సాయ రంగానికేమీ ఢోకా ఉండదంటూ బుకాయిస్తోంది. అమెరికన్‌ రైతులకు భారత మార్కెట్‌లో గణనీయమైన వాటా చేజిక్కుతోంది అంటే భారతీయ రైతులకు మన మార్కెట్‌ లో చోటు మిగలదనే కదా అర్థం?
ఇక్కడ కూడా పాత వలస పాలన నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థలోకి వలసవాదులు చొరబడ్డప్పుడు ఇక్కడి రైతులు, వ్యవసాయ కూలీలు చాలా ఎక్కువగా దెబ్బతిన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే మళ్లీ అటువంటి దుస్థితి తలెత్తదు అన్న ఆలోచనే వారందరినీ జాతీయోద్యమం వైపు నడిపించింది. కాని ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఆనాటి పరిస్థితులే తలెత్తనున్నాయి. ఆనాటి జాతీయోద్యమంలో ఎటువంటి పాత్రా పోషించని పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం వాళ్లకి ఆనాటి దుర్గతి పట్టిస్తోంది!

ఈ ఒప్పందాన్ని విమర్శిస్తూ చేసే వ్యాఖ్యానాలన్నీ ఈ దుస్థితికి పూర్తిగా మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అని అంటాయి. అయితే ఇవి పైపై విమర్శలుగానే ఉంటాయి. ఫాసిస్టు ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక తరగతుల ప్రయోజనాలకోసం మాత్రమే పనిచేస్తాయి. అందుకే ఇండో-అమెరికన్‌ వాణిజ్య ఒప్పందం ఖరారైందన్న వార్తలు మన దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. మన దేశంలోని బడా పెట్టుబడిదారులకు, ఉన్నతాదాయ వర్గాల వారికి అమెరికాతో అటువంటి ఒప్పందం చాలా వాంఛనీయం. దాని వలన శ్రామిక ప్రజానీకానికి, రైతాంగానికి ఎంతనష్టం వాటిల్లినా వారికది అనవసరం. భారత బడా బూర్జువావర్గానికి అమెరికన్‌ మార్కెట్‌ లోకి తమ సరుకులను ఎగుమతి చేసే అవకాశాలు పెరగడం, అది పద్దెనిమిది శాతం సుంకంతో అయినప్పటికీ, ఆనందదాయకమే. గ్లోబల్‌ స్థాయికి ఈ వర్గం ఎదగాలనే కోరిక నెరవేరుతుంది కదా. ఇక ఉన్నతాదాయ వర్గాలలో తమ బిడ్డలు అమెరికాలో స్థిరపడిన వారికి, ఇకముందు స్థిరపడాలని కోరు కుంటున్నవారికి, ఇకముందు ట్రంప్‌ శత్రుత్వాన్ని చవిచూడన వసరం లేదు కదా. తమ కోరికలు నెరవేరేటప్పుడు ఇక తక్కిన వారు స్వదేశంలో ఎలా పోతే వారికేమిటి? ఈ విధంగా వలస పాలనకు వ్యతిరేకంగా ఆనాడు ఏర్పడిన జాతీయ ఐక్య సంఘటన నుంచి బడా బూర్జువా వర్గం, ఉన్నతాదాయ వర్గాల ప్రజలు విడగొట్టుకుని తమ స్వంత ప్రయోజనాల కోసం శ్రామికప్రజల ప్రయోజనాలను బలి పెట్టడానికి తయారైనందువల్లే సామ్రాజ్య వాదానికి ఈ విధంగా మోడీ ప్రభుత్వం లొంగిపోయింది.
ఇలా గతకాలపు జాతీయ ఐక్య సంఘటన ముక్కలు కావడం బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం గద్దెనెక్కక ముందు నుంచీ మొదలైంది. వాస్తవానికి నయా ఉదారవాద వ్యూహాన్ని చేపట్టిన ప్పటి నుంచే ఈ విచ్ఛిన్నం ప్రారంభమైంది. ఇక్కడ ఫాసిస్టు శక్తుల నాయకత్వంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా శ్రామిక ప్రజనీకపు ప్రయోజనాలను బలి చేసే విధంగా ఒప్పందం చేసుకోవడం ఆనాడు మొదలైన ప్రక్రియ కొనసాగింపుగానే చూడాలి.

నేటి మోడీ ప్రభుత్వం లొంగుబాటు, సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లిన తీరు, మన గత ప్రధాని ఒకరు ప్రదర్శించిన వైఖరికి పూర్తి భిన్నంగా ఉంది. ఆమె కూడా బడా బూర్జువా నాయకత్వంలోని ప్రభుత్వానికే నాయకత్వం వహించారు. కాని ఆమె అమెరికన్‌ ప్రభుత్వ ఒత్తిడిని తిరస్కరించిన తీరు చాలా దృఢమైన వైఖరిని సూచించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆమె కళ్లలోకి సూటిగా చూడడానికే భయపడ్డానని ఒప్పుకున్నాడు. తేడా ఎక్కడుందంటే అప్పుడు ఆమె ప్రభుత్వ అదుపులో ఆర్థిక విధానాలను అమలు చేసే వ్యవస్థకు నాయకత్వం వహించారు. ఆ ప్రభుత్వం కొద్ది దశాబ్దాలకు ముందే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం ఫలితంగా ఆవిర్భవించింది. ఆ ప్రభుత్వం బూర్జువా అభివృద్ధి విధానాలనే అమలు చేసినా, శ్రామిక ప్రజల ప్రయోజనాలు పట్టనట్టు వ్యవహరించలేదు.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -