Tuesday, February 17, 2026
E-PAPER
Homeజాతీయంప్రజలకు చేరువగా ఆరోగ్య సేవలు

ప్రజలకు చేరువగా ఆరోగ్య సేవలు

- Advertisement -

డిజిటల్‌ విప్లవంలో చంద్రబాబుది కీలకపాత్ర : బిల్‌గేట్స్‌
‘గేట్స్‌ ఫౌండేషన్‌తో ఎపికి కొత్త దశ : సిఎం
పంటల పరిశీలన, స్వర్ణాంధ్ర, అమరావతిపై ప్రజంటేషన్లు

అమరావతి : ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ చేయాలనేదే గేట్స్‌ ఫౌండేషన్‌ ఆశయమని ఛైర్మన్‌ బిల్‌గేట్స్‌ అన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం ఆయన విజయవాడ చేరుకున్నారు. తొలుత ఎయిర్‌పోర్టులో మంత్రి నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, అనిత తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుండి నేరుగా సచివాలయంలో ఆర్‌టిజిఎస్‌ కేంద్రానికి చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడే ఉన్న మంత్రులను సిఎం పరిచయం చేశారు. డేటాలేక్‌, అవేర్‌ 2.0 వాట్సాప్‌ గవర్నెన్స్‌, సంజీవని డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు, రాజధాని అమరావతి అంశాలపైనా, పౌరులకు అందిస్తున్న సేవలను సిఎం చంద్రబాబు ఆయనకు వివరించారు. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలో ప్రాపర్టీ రికార్డులకు కల్పిస్తున్న భద్రతనూ తెలిపారు.

అలాగే చిత్తూరులో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును గేట్స్‌ ఆసక్తిగా పరిశీలించారు. హెల్త్‌ రికార్డుల ప్రక్రియ బాగుందని కితాబిచ్చారు. ఆర్‌టిజిఎస్‌లో డిస్‌ప్లే వాల్స్‌పై యువ ఐఎఎస్‌ అధికారులు గేట్స్‌కు ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. డిజిటల్‌ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు ఉన్నాయని తెలిపారు. దీనిలో ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. గేట్స్‌ ఫౌండేషన్లో ఆరోగ్య రంగానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనేది తన ఉద్దేశమని చెప్పారు. విద్యార్థుల సరైన రీతిలో తగిన స్థాయిలో విద్యాబోధన చేయడానికి, విద్యారంగంలో మార్పులకు ఎఐ సహాయపడుతుందని, ఎఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్‌ చేయడాన్ని అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎఐని ఇంతలా ఉపయోగించడం లేదని, ఎపి ముందుండటం మంచి పరిణామమని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు గుడ్‌ ఓల్డ్‌ ఫ్రెండ్‌ అని అన్నారు.

2047తో స్వర్ణాంధ్ర సాకారం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, గేట్స్‌ ఫౌండేషన్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బిల్‌గేట్స్‌ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ప్రజల సాధికారతకు దోహదపడుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్‌ 2047పై రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను గేట్స్‌కు వివరించారు. పలు పథకాల గురించి వాటి సాధనకు చేస్తున్న కృషిని తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌ అనేది ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం పది రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఎఐని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగితను 4.1 శాతం నుండి రెండు కంటే తక్కువకు తగ్గించడం, మహిళా కార్మికులను 45.8 శాతం నుండి 80 శాతానికి పెంచడం అక్షరాస్యతను 100 శాతం చేయడం ప్రధాన లక్ష్యాలని వివరించారు. విద్యారంగంలో అనుసరిస్తున్న ఆధునిక విధానాలకు గేట్స్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న సహకారంపై సంతోషం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమం కోసం సాంకేతిక సాయం తీసుకుంటున్నామని, ఎఐ ద్వారా సాగుకు సలహాలు అందిస్తున్నామని తెలిపారు. వైద్య రంగంలో హైలెవల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూపు ఏర్పాటు చేశామని జులై కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సంజీవని అందుబాటులోకి తెస్తామని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -