Wednesday, June 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచట్టాన్నే రద్దు చేయాలంటే..ఇంకా రూల్స్‌ ఏంటి?

చట్టాన్నే రద్దు చేయాలంటే..ఇంకా రూల్స్‌ ఏంటి?

- Advertisement -

కేంద్రానికి లోబడే
రాష్ట్ర లేబర్‌ కోడ్‌ ల నియమాలు
యజమాన్యాలకు
అనుకూలంగానే రూల్స్‌ ఫ్రేమ్‌
కార్మక హక్కులకు కోత
కోడ్‌లపై ఆగ్రహం
రూల్స్‌‌పై సంప్రదింపు సమావేశాల్లో
యూనియన్ల విమర్శలు


నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
లేబర్‌ ‌కోడ్‌‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కార్మికశాఖ చేపడుతున్న చర్యలపై ఇటు కార్మికులు, అటు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అసలు కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉన్న నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను రద్దు చేయాలంటూ ట్రేడ్‌ ‌యూనియన్లు డిమాండ్‌ ‌చేస్తోంటే.. దాని గురించి మాట్లాడకుండా రూల్స్‌ ‌గురించి హడావుడి చేయటమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు లేబర్‌ ‌కోడ్‌లకు సంబంధించిన నియమాల(రూల్స్‌) ‌ఖరారు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నలుగురు అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసింది. సామాజిక భద్రత కోడ్‌ కు సంబంధించి అడిషనల్‌ ‌కమిషనర్‌ గంగాధర్‌, వేతన కోడ్‌ ‌రూల్స్‌ ‌పై జేసీఎల్‌ ‌శాంసుందర్‌, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం పని పరిస్థితులపై మోహన్‌‌రావు, ఓఆర్‌ ‌రెడ్డి, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ రూల్స్‌‌పై అడిషనల్‌ ‌కమిషనర్‌ ‌చంద్రశేఖర్‌ బాధ్యులుగా కమిటీలను ఏర్పాటు చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని కార్మికశాఖ కమిషనరేట్‌‌లో ఆయా అధికారులు తమకు అప్పగించిన అంశాలపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజంటేషన్‌ ‌చేశారు. వీటిపై కార్మిక సంఘాలు, యాజమాన్య, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపు సమావేశాలను ఈ నెల 11 నుంచి 16 వరకు నిర్వహించారు. 11న సోషల్‌ ‌సెక్యూరిటీ కోడ్‌-2020, 12న కోడ్‌ ఆన్‌ ‌వేజెస్‌-2019, 15న ఆక్యుపేషనల్‌ ‌సేప్టీ,హెల్త్‌ అండ్‌ ‌వర్కింగ్‌ ‌కండిషన్స్‌ ‌కోడ్‌-2020, 16న ఇండిస్ర్టియల్‌ ‌రిలేషన్స్‌ ‌కోడ్‌-2020పై పలు సూచనలు సలహాలను ఇవ్వాలని కార్మికశాఖ కోరింది. లేదా 45రోజుల్లో తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా అందించాలని సూచించింది. అయితే రూల్స్‌లో కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా నియమాలున్నాయని తెలుస్తున్నది. అవే గనుక అమలైతే..కార్మికుల బతుకు బస్టాండే అంటూ కార్మిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​రూల్స్‌‌కు సూచనలు సరే..
రూల్స్‌‌కు సూచనలు సరే..ఆ నాలుగు కోడ్‌‌ల రద్దు మాటేమిటంటూ కార్మిక సంఘాలు నిలదీస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏక పక్ష‍ంగా తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోదని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఆ కోడ్‌‌లను వ్యతిరేకిస్తున్నట్టు కార్మికులకు సంకేతం ఇచ్చి, ఆచరణలో వాటి అమలుకు చాపకింది నీరులా అధికారిక చర్యలు చేపడుతున్నదని ఆయా సంఘాలు ఐక్యంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది కార్మిక వర్గాన్ని మోసం చేయటం తప్ప మరొకటి కాదని విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోటితో చెప్పి నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నది.

​ కార్పొరేట్‌ ‌శక్తుల కోసమే… -ఎస్‌ ‌బాలరాజు, ఏఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పన్నెండేండ్లుగా కేంద్రం తీసుకొచ్చిన లేబర్‌ ‌కోడ్‌‌లను వ్యతిరేకిస్తూ వస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల డిమాండ్‌‌ను పెడచెవిన పెడుతూ నియంతృత్వంగా వ్యవహరిస్తూ వస్తున్నది. కొన్ని రాష్ర్టాలు వీటిని అమలు చేయబోమంటూ ప్రకటించాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోడీ విధానాలను అమలు చేసేందుకు పూనుకుంటున్నది. ప్రభుత్వం రూపొందించిన రూల్స్‌ ‌కార్మికులకు అనుకూలంగా లేవు. అవి వారి ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అసలు ఆ కోడ్‌‌లను చట్టబద్దత లేదు. అలాంటప్పుడు వాటికి రూల్స్‌ ఎందుకు? అందుకే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ కోడ్‌‌లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొద్దని కోరుతున్నాం. ప్రభుత్వం మోడీ దారిలోనే పోతే..ఆందోళన తప్పదు.

​కోడ్‌‌లను రద్దు చేయాలి… -విజయ్‌‌కుమార్‌ , ఐన్‌‌టీయూసీ కార్యదర్శి
కార్మిక హక్కులకు భంగం కలిగే విధంగా నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి అమలైతే.. పోరాడి సాధించుకున్న హక్కు లు పోయినట్టే.
పారిశ్రామికవర్గాలు, కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా ఆ కోడ్‌‌లను రూపొం దించారు. రాష్ట్రంలో రూపొందిం చిన రూల్స్‌‌లో కొన్ని సవరణలు చేయాలని సూచించాం. 45 రోజులలోపు మరి కొన్ని సవరణలను లిఖిత పూర్వకంగా ఇస్తాం. రాష్ట్రంలో కార్మిక వర్గానికి నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే..అందుకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

​ కేంద్రం దారిలోనే.. ఎస్‌ఎల్‌ ‌పద్మ టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వం ఏ రూల్స్ నైతే ఏర్పాటు చేసిందో ఆ రూల్స్ లోనే తెలంగాణ రూల్స్ ని రూపొందించారు. కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో లేబర్ చట్టాలు, రూల్స్ గతంలోని వాటికి భిన్నంగా ఉన్నాయి. ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. లేబర్ కోడ్స్ ను దేశవ్యాప్తంగా కార్మికులు ,కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడారు. లేబర్ కోడ్‌‌లో కార్మిక సంఘాలను ఏర్పరచుకునే హక్కు, సమ్మె హక్కు పైన యాజమాన్యం ఇష్టారాజ్యంగా తొలగించే దానిపై ఇతర అనేక అంశాల పైన చేసిన సవరణలన్నీ కార్మిక వ్యతిరేకమైనవి అని వాటిని రద్దు చేయాలని పోరాటం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రూల్స్ కూడా కార్మిక వ్యతిరేకమైనవిగా ఉన్నాయి.

పెడచెవిన పెడుతున్న ప్రభుత్వం -ఎం శ్రీనివాస్‌, ఐఎఫ్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కార్మికుల ప్రయోజనాలు, హక్కులకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉన్న 29 రకాల కేంద్ర చట్టాలను క్రోడీకరించి రూపొం దించిన నాలుగు లేబర్ కోడ్స్ ను రూపొందించింది. వీటిని రాష్ట్రంలో అమలు చేయొద్దని కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. కోడ్‌‌ల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన రూల్స్ వెనక్కి తీసుకోవాలి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వాటిలో కార్మిక వ్యతిరేక రూల్స్‌‌ను వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల సంక్షేమం, వారి హక్కులకు నష్టం వాటిల్లే అంశాలను పూర్తిగా తొలగించాలి.

రెండు నాల్కల ధోరణి…
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తున్నది. ఆ వైఖరితో రాష్ట్ర కార్మిక వర్గానికి తీరని నష్టం జరిగే ప్రమాదముంది. దీనికి రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లపై రాష్ట్ర ప్రభుత్వం రూపొంధించిన రూల్స్‌ ‌కేంద్రం తీసకొచ్చిన నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌లకు లోబడే ఉన్నాయి. ఇవి అమలైతే కార్మిక హక్కులకు భంగం కలిగినట్టే.. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం లేబర్‌ ‌కోడ్‌‌లను 2019,2020లలో పార్లమెంట్‌‌లో ప్రవేశ పెట్టినప్పటి నుంచి వీటిని వ్యతిరేకిస్తూ వస్తున్నాం. కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా వీటిని వ్యతిరేకించింది. కేరళ, తమిళనాడు కర్నాటక తదితర కొన్ని రాష్ర్టాలు ఆ కోడ్‌‌లను అమలు చేయబోమని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం కూడా అమలు చేయబోమంటూ ప్రకటించాలి. కార్మిక సంఘాల డిమాండ్‌‌ను లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ ‌కోడ్‌‌ల రూల్స్‌‌ను రూపొందించేందుకు వర్క్‌ ‌షాపు నిర్వహించటం బాధాకరం. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. కార్మికుల్లో ఈ ద్వంద వైఖరిని ఎండగడతాం.
పాలడుగు భాస్కర్‌ ,సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -