Thursday, June 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఉద్యమ గడ్డపై ఉద్యోగాల గోస

ఉద్యమ గడ్డపై ఉద్యోగాల గోస

- Advertisement -

ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ యువత భవిష్యత్తును కోల్పోయిన సమాజం తరాల పాటు నష్టపోతుంది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేరకపోవడం చారిత్రక విషాదం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ఎన్నికల వేళ నిరుద్యోగులకు ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. నాడు ప్రతిపక్ష నేతగా యువత పోరాటాలకు అండగా నిలిచిన రేవంత్ రెడ్డి, నేడు ముఖ్యమంత్రి పీఠంపై ఉండి కూడా ఆ హామీలను కాగితాలకే పరిమితం చేయడం నిరుద్యోగ లోకాన్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యో గాలను భర్తీ చేస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు ఆ హామీని గాలికొదిలేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల తరఫున గొంతెత్తారు, ఉద్యోగాల కోసం పోరాడిన యువతకు మద్దతుగా నిలిచారు. ఉద్యోగుల రావాలంటే ‘‘మీరు ముప్ఫయి లక్షల మంది ఉన్నారు, మీ కుటుంబంలో ఇద్దరిని కలుపుకుంటే తొంభై లక్షల మంది అవుతారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మీ భవిష్యత్తు మారుస్తుంది, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది, ఉద్యోగాల కల సాకారమవుతుందని’’ హామీ ఇచ్చారు. కానీ నేడు ఆ వాగ్దానాలన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి.

రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం పూర్తవుతున్నా, నిరుద్యోగ యువత ఆశ యాలు సిద్ధించలేదు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం.. ఖాళీ పోస్టులు, పదవీ విరమణలతో ఏర్పడిన ఖాళీలను కలిపితే రాష్ట్రంలో సుమారు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ, వాటి భర్తీపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మరోవైపు ఉద్యోగ ఖాళీలపై శాంతికుమారి కమిటీ నివేదిక ఏమైందో ఇప్ప టికీ తెలియదు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల వేలాది మంది యువత జీవితాలు రోడ్డున పడ్డా, బాధ్యులపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోలేదు. దీంతో నిరుద్యోగులు న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. నెలవారీ నిరుద్యోగ భృతిగా రూ.4వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ హామీని పూర్తిగా విస్మరించింది. నిరుద్యోగులకు భరోసానిచ్చే ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక లక్షలాది మంది యువత ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతు న్నారు. ప్రస్తుతం టీజీపీఎస్సీలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు సుమారు 35 లక్షల మంది ఉన్నారు. వారికి సరిపడా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఆ దిశగా ఎలాంటి సరైన చర్యలు కనిపించ డం లేదు.

ఉద్యోగాలు రాక, భవిష్యత్తు శూన్యంగా మారి ఇప్పటికే ఇరవై మందికి పైగా నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరం. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ, హాస్టళ్లలో మగ్గి పోతూ, తమ కుటుంబాలపై భారంగా మారకూడదని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను ప్రభుత్వం పూర్తిగా వమ్ము చేస్తోంది.
​ఇప్పటికైనా ​రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ​ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను తక్షణమే అమలు చేయాలి. ​నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలి. ​వివాదాస్పదమైన జీవోలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలి. నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, వారి న్యాయమైన ఉద్యమాలను అణచివేయడం, ముందస్తు అరెస్టులు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. నిరుద్యోగుల గొంతు నొక్కడం కాదు, వారి సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం యువత ఆశయాల పునాదులపైనే నిలిచింది. ఆ యువత భవిష్యత్తును రక్షించడం ఏ ప్రభుత్వానికైనా చారిత్రక బాధ్యత. నిరుద్యోగుల సమస్యను నిర్లక్ష్యం చేయడం కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, అది సాక్షాత్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని విస్మరించడమే అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -