Thursday, June 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆరుట్ల ఆరంభ శూరత్వం కారాదు…

ఆరుట్ల ఆరంభ శూరత్వం కారాదు…

- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలల ప్రభుత్వ బడి ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్, అధునాతన సౌకర్యాలు, హంగులతో, డిజిటల్‌ తరగతులతో ఆర్భాటంగా ప్రారంభమైంది. పేద విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి విద్యను అందించ డమే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రతి మండలంలో కనీసం రెండు బడులను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ పేరిట ఏర్పాటు చేసేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో పైలట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాల బడులతో పాటు నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. ఆరుట్ల ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యాసంవత్సరమే విద్యాబోధన అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకే ఏడాది కొత్తగా వెయ్యి మంది పిల్లలు చేరడం విశేషమే! రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు బోధించే వెయ్యికి పైగా విద్యార్థులు చదివే పాఠశాలల్లో మూడున్నాయి. సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్‌ హంగులు, ఉత్తమ ఫలితాలు, పై చదువులకు ప్రైవేటు కళాశాలల్లో ఉచితంగా ఇక్కడి విద్యార్థులను చేర్చుకోవడం తదితర కారణాలతో తమ పిల్లలను ఈ బడిలో చేర్పించడానికి తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ఇందిరానగర్‌ పాఠ శాలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు నాలుగు వందల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 10జూన్‌2026 నాడు పాఠశాలలో ప్రవేశాల కోసం జరిగిన పరీక్షకు ఆరు వందల మంది విద్యార్థులు హాజరు కావడం విశేషం.

గతేడాది ఈ పాఠశాలలో 1,236 మంది చదువుకున్నారు. నిజామాబాద్ పట్టణ శివార్లలో ఉన్న బోర్గాం ఉన్నత పాఠశాలలో ఉపా ధ్యాయుల కొరత, తరగతి గదుల కొరత ఉన్నప్పటికీ ఆ పాఠశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థులు, తల్లిదం డ్రులు పోటీ పడుతున్నారు. తమ పిల్లలను చేర్చాలని తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయులపై అనేక ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం కానీ, ఏ ఎన్జీవో నిధులు కానీ, కార్పొరేట్ కంపెనీల సిఎస్ఆర్ నిధులు కానీ రాలేదు. కేవలం ఉపాధ్యాయులు, గ్రామస్తుల కృషి వల్ల ఇంత అభివృద్ధి జరిగింది. నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వారి రూ.8 కోట్ల పెట్టుబడితో పునరు ద్ధరిం చబడిన పాఠశాల. ఇది ప్రైవేట్ పాఠశాలల వలె ప్రసిద్ధి చెందింది. ఎయిర్ కండిషన్డ్ స్మార్ట్ తరగతి గదులు, కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత బోధన మరియు డిజిటల్ ల్యాబ్‌లు, ఆధునిక క్రీడా సౌకర్యాలతో నాణ్యత, మౌలిక సదుపాయాల వల్ల విద్యను అందించడంతో పరిమిత సంఖ్యలో ఉన్న సీట్లకు వేలాది మంది విద్యార్థులు అడ్మిషన్లకు పోటీ పడుతున్నారు. ఆరుట్ల పాఠశాలకు సోషల్‌ డెమొక్రటిక్‌ ఫోరం సంస్థ రూ.3 కోట్లు, రూ.23 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రహరీ, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులన్నీ మొత్తం రూ 12 కోట్లు ఖర్చు చేసి పూర్తిచేశారు. జీఎంఆర్‌ సంస్థ సహకారంతో గ్రీనరీ, ప్రీ ప్రైమరీ పాఠశాలకు అవసరమైన ఆటవస్తువులు, ఫర్నీచర్‌ సమకూర్చారు.

ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆడుకునేందుకు వీలుగా సుమారు అరెకరా స్థలంలో బాక్స్‌ నెట్‌ ఏర్పాటు చేశారు. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లేగ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి-వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వ‌స‌తులు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థు లను పాఠశాలకు తీసుకురావడానికి ప్ర‌భుత్వం అయిదు స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీ ప‌డుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదువు తున్న పిల్లలను సైతం టీపీఎస్‌లో చేర్పించేందుకు తల్లి దండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రీ-ప్రైమరీ విభాగంలో 150 మంది, ప్రైమరీ స్కూల్‌లో 600 మంది, హైస్కూల్ రెండు బ్లాకుల్లో కలిపి 800 మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 160 మంది, రెండో సంవత్సరంలో 104 మంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పే అంత గొప్ప పాఠశాలకు ప్రభుత్వ ఖజానా నుండి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కాని అది గొప్ప పాఠశాల అని, అనేక సమూహా లకు ఆ పాఠశాల దర్శించాలని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

అట్లే సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ పాఠశాలలకు ప్రభుత్వం నిధులేమీ ప్రత్యేకంగా కేటాయించలేదు. సిద్దిపేటకు నాట్కో ఫార్మా, నల్గొండ పాఠశా లకు కోమటిరెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయం చేయగా, నిజామాబాద్ పాఠశాల ఆమాత్రం నిధుల సహాయం లేకుండా ఈ స్థితికి వచ్చాయి. మరి ప్రభుత్వం ఇటువంటి పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, అభివృద్ధి చేస్తే విద్యార్థులు చేరరా ? ఆ దిశలో ప్రయత్నాలు ఏవి లేకపోవ డంతో విసుగు చెందిన తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపునకు చూస్తున్నారు. నిజానికి ప్రభుత్వానికి కావలసింది ఇదేనా?!
విద్యారంగంలో బోధన దీర్ఘకాలి కంగా జరిగే ప్రక్రియ. ఒక విద్యార్థి ఆరో తరగతిలో పాఠశాలలో చేరితే పదో తరగతి వరకు ఐదేళ్లపాటు చదువు కుంటాడు. అటువంటప్పుడు ఆ పాఠశాలలో తగినన్ని తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం వసతులు ఉన్నాయా? అన్ని సబ్జెక్టుల బోధనకు ఉపాధ్యా యులు ఉన్నారా? అనే అంశాలను చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను చేరుస్తారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠశాలకు కావ లసిన వసతులు అదనంగా కల్పిస్తారని విశ్వాసం తల్లిదండ్రులకు కలగాలి. ఆ గ్యారెంటీ లేనప్పుడు ఎంత గొప్ప పాఠశాల అని చెప్పుకున్నా తల్లి దండ్రులు తమ పిల్లలను చేర్చరు.

ఇట్లా అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలను ప్రత్యేక శ్రద్ధతో అక్కడి ఇబ్బందులను తొలగించడానికి విద్యా శాఖ వద్ద ప్రత్యేక ప్రణాళిక ఏదీ లేదు. అంతెందుకు? ఒక సబ్జెక్టు ఉపాధ్యాయుడు పదవీ విరమణ చెందడం ముందుగానే విద్యాశాఖకు తెలుసు! అతడు పదవీ విరమణ చెందగానే మరో ఉపాధ్యాయుడిని నియమించే విధానం మన విద్యాశాఖ చరిత్రలోనే లేదు! ప్రభుత్వం మళ్లీ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, పరీక్ష నిర్వహించి, ఫలితాలు ప్రకటించి, నియామకాలకు కౌన్సిలింగ్ జరిపితే, లేదా బదిలీల కౌన్సెలింగ్ జరిగితే తప్ప మరో ఉపాధ్యాయుడు రాడనేది ఉన్నతాధికారుల కన్నా మన ప్రజలకు బాగా తెలుసు! ఉన్న బడులను కాపాడానికి సర్పంచులు, ఉపాధ్యాయులు ప్రతి గ్రామాల్లో తిప్పలు పడుతున్నారు. ఎవరి స్పూర్తినో ఏమో కానీ ముఖ్యమంత్రి ఇప్పుడు బడులు మూస్తామని బాంబు వేశారు. ఈ రకమైన అనాలోచిత, దూరదృష్టి రహిత ప్రకటనలతో ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం సడలిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు విముఖత కలిగిన పర్యవసానమే విద్యార్థుల నమోదు తగ్గిపోవడం అనే వాస్తవాన్ని ప్రభుత్వ పెద్దలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

కె. వేణుగోపాల్, 9866514577

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -