Wednesday, June 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిలువైన జర్నలిజానికి నిలువెత్తు రూపం

విలువైన జర్నలిజానికి నిలువెత్తు రూపం

- Advertisement -

సమాజంలో జరిగే పరిణామాలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించవు. వాటిలో చాలావరకు వార్తల రూపంలోనే వారి ముందుకు వస్తాయి. అయితే వార్త కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, ఒక దృక్పథాన్ని కూడా చేరవేస్తుంది. అందుకే వార్తను సామాజిక బాధ్యతగా చూడాలన్న ఆలో చనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ ఆలోచనకు ఆచరణలో ప్రతినిధిగా నిలిచిన వారిలో కామ్రేడ్ మోటూరి హనుమంతరావు అగ్రగణ్యులు. ఆయన్ను చాలామంది కమ్యూనిస్టు నాయకుడిగా, పార్లమెంటేరియన్‌గా గుర్తుంచుకుంటారు. కానీ జర్నలిస్టుగా కూడా సమాజంపై ఆయన అత్యంత సుదీర్ఘమైన, స్థిరమైన ముద్ర వేశారు. ప్రజాశక్తి వ్యవస్థాపక సంపాదకునిగా ఆయన నిర్వహించిన పాత్ర తెలుగు పత్రికారంగ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. అందుకే మోటూరుని స్మరించుకోవడం అంటే ఒక వ్యక్తిని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు, వార్తల వెనుక దాగి ఉన్న సమాజాన్ని చూడగల జర్నలిస్టిక్ దృష్టిని తిరిగి ఆవిష్కరించుకోవడం. ఆ దృష్టి ఆయన వ్యక్తిగత ప్రతిభకు, వృత్తి జీవితానికే పరిమితమైనది కాదు. వార్తను కేవలం సమాచారంగా కాక, సామాజిక మార్పునకు సాధనంగా చూసిన ప్రత్యామ్నాయ జర్నలిజానికి అది ప్రతీక. జర్నలిజం అనేది కేవలం సంఘటనలను నమోదు చేసే ప్రక్రియ కాదని, సమాజ చలనాలను విశ్లేషించి ప్రజల ముందుంచే బాధ్యతాయుతమైన సామాజిక కర్తవ్యమని ఆయన తన ఆచరణ ద్వారా నిరూపించారు. అందుకే మోటూరి వారసత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, జర్నలిజం స్వభావాన్ని కూడా లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. పత్రికల పాత్ర ఏమిటి? అవి ఎవరికి జవాబుదారీగా ఉండాలి? సమాజంలో వాటి స్థానం ఏమిటి? వంటి ప్రశ్నలకు ఆయన చూపిన దారిలోనే సమాధానాలు కనిపిస్తాయి.

పత్రికలు వార్తలను మాత్రమే ప్రచురించవు. అవి సమాజాన్ని చూడటా నికి ఒక కిటికీని నిర్మిస్తాయి. ఆ కిటికీ ఎటు తెరుచుకుంటుందో అటువైపే ప్రజల చూపు నిలుస్తుంది. ఆ చూపు ఆధారంగా వారి అవగాహన, చర్చలు, అభిప్రాయాలు రూపుదిద్దుకుంటాయి. ఎందుకంటే, సమాజం ఎప్పుడూ పూర్తిగా “ప్రత్యక్ష అనుభవం”గా ప్రజల ముందుండదు. రాజకీయ నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, రైతు-కార్మిక సంక్షోభాలు, విద్య-వైద్య వ్యవస్థల పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలు… ఇవన్నీ ప్రజలు ప్రధానంగా మీడియా ద్వారానే గ్రహిస్తారు. అందుకే ఒక సంఘటనను ఏ కోణంలో ప్రజల ముందుంచాలన్నది చిన్న విషయం కాదు. అది ప్రజాభిప్రాయ దిశను నిర్ణయించే ప్రక్రియ. ఉదాహరణకు, రైతుల ఆత్మహత్యలను ఒక పత్రిక వ్యక్తిగత విషాదంగా చూపవచ్చు. మరో మీడియా వాటిని వ్యవసాయ సంక్షోభ ఫలితంగా విశ్లేషించ వచ్చు. సంఘటన ఒకటే. దృక్పథాలే రెండు. దృక్పథం మారగానే దాన్ని అర్థం చేసుకునే విధానం మారిపోతుంది. ఇదే జర్నలిజం ఫ్రేమింగ్ శక్తి. అందుకే జర్నలిజం కేవలం సమాచార ప్రసార వ్యవస్థ కాదు. అది ప్రజాభిప్రాయ నిర్మాణంలో భాగస్వామి. దాని దృక్పథాన్ని బట్టి, ఘటన వార్తగా తయారయ్యే సమయంలో దాని స్వభావం మారిపోతుంది. ఏ సంఘటనను ఎలా ఫ్రేమ్ చేయాలి, ఏ అంశాన్ని కేంద్రంలో ఉంచాలి, ఎవరి అభిప్రాయాలను వినిపించాలి, ఎవరి గొంతు నొక్కేయాలన్నది మొత్తం దాని దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. ఈ దఅష్టికోణమే పత్రికను ఒక సాధారణ సమాచార వాహకంగా కాకుండా, ఆర్థిక, రాజకీయ, సామాజిక నిర్మాణాలను ప్రభావితం చేసే శక్తిగా మారుస్తుంది.

మోటూరు సంపాదకత్వ ప్రత్యేకత కూడా ఇక్కడే స్పష్టమవుతుంది. ఆయనకు వార్త అంటే అధికార వర్గాలు చెప్పిన ప్రకటనలను నమోదు చేయడం కాదు. ఆ ప్రకటనల ప్రభావం ఎవరిపై పడుతుందో చూడటం. ప్రభుత్వ విధానాన్ని వివరించడం మాత్రమే కాదు, ఆ విధానం ఓ రైతు జీవితంలో, ఓ కార్మికుడి దినచర్యలో, ఓ సామాన్య కుటుంబంలో ఎలా ప్రతిఫలిస్తుందో గుర్తించడం. అందుకే ఆయన నేతృత్వంలో ప్రజాశక్తి అధికార కేంద్రాల చుట్టూ తిరిగే పత్రికగా కాకుండా, ప్రజల జీవితాల మధ్య నుంచి వార్తలను అర్థం చేసుకునే పత్రికగా రూపుదిద్దు కుంది. అదే వార సత్వాన్ని నవతెలంగాణ కూడా కొనసాగిస్తోంది. ఆయన జర్నలిజాన్ని అధికారానికి అనుబంధ వృత్తిగా కాకుండా ప్రజాస్వామ్యానికి అవసరమైన సామాజిక జోక్యంగా చూశారు. రైతుల సమస్యలను కేవలం పంట దిగుబడుల గణాంకాలుగా కాకుండా రైతు కుటుంబాల జీవన సంక్షోభంగా, ఒక ఉద్యమాన్ని కేవలం ర్యాలీగా కాకుండా దాని వెనుక ఉన్న సామాజిక కారణాల ప్రతిఫలనగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రజల పోరాటాలు ఆయన సంపాదకత్వంలో సంఘటనలుగా కాకుండా సామాజిక ప్రక్రి యలుగా పాఠకుల ముందుకు వచ్చేవి. జర్నలిజం సమాజాన్ని మార్చే శక్తులకు దిశానిర్దేశం చేయగలదనే విశ్వాసం ఆయనది. ఆ విశ్వాసమే ఆయన్ను సాధారణ సంపాదకుల నుంచి వేరు చేసి ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీకగా నిలబెట్టింది. ప్రత్యామ్నాయ జర్నలిజం అనేది ఒకరోజులో పుట్టిన భావన కాదు. సమాజంలోని అంతర్గత వైరుధ్యాలు, ప్రధాన స్రవంతి మీడియా నిర్మాణ పరిమితులు, ప్రజా ఉద్యమాల చారిత్రక అవసరాలు కలగలసి దాన్ని రూపొందించాయి. ఆ మేరకు భారతదేశంలో స్వాతంత్య్రోద్యమ కాలం నుంచే పత్రికలు రాజకీయ చైతన్య నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి.

కానీ స్వాతంత్య్రానంతరం పరిస్థితి క్రమంగా మారింది. మీడియా వ్యాపా రీకరణ వైపు, పెట్టుబడి ఆధారిత నిర్మాణాల వైపు మళ్లడంతో వార్తల ప్రాధాన్యాలు కూడా మారిపోయాయి. ఈ మార్పు ఫలితంగా అట్టడుగు వర్గాల జీవన వాస్తవాలు ప్రధాన వార్తా ప్రవాహం నుంచి నెమ్మదిగా బయటకు నెట్టబడ్డాయి. రైతు సమస్యలు గణాంకాలుగా మారాయి. కార్మిక పోరాటాలు “లేబర్ ఇష్యూస్‌”గా కుదించబడ్డాయి. గిరిజనుల భూ సమస్యలు, దళితులపై దాడులు తాత్కాలిక వార్తలుగా, స్థానిక ఘటనలుగా మిగిలిపోయాయి. ఈ నిర్మాణాత్మక ఖాళీ ప్రత్యామ్నాయ జర్నలిజం అవసరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఈ ధోరణులను మోటూ‌రు చాలా ముందుగానే గుర్తిం చారు. ప్రజల జీవితాల నుంచి వార్తలను వేరు చేసే ప్రతి ప్రయత్నం చివరికి జర్నలిజాన్నే బలహీనపరుస్తుందని వారు హెచ్చరించారు. అందుకే వార్తా ఎంపికలోనూ, సంపాదకీయ దృష్టిలోనూ ప్రజా ప్రయోజనాలను కేంద్రంగా నిలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆయన గుర్తించిన ధోరణులు నేడు మరింత సంక్లిష్ట రూపాన్ని సంతరించుకున్నాయి. దీనికి ప్రధాన కారణం మీడియా రంగంలో కార్పొరేట్ ఆధిపత్యం బలపడటం. పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ న్యూస్ పోర్టల్స్… ఇవన్నీ కొద్దిమంది వ్యాపార సమూహాల చేతుల్లో కేంద్రీకృతమ వుతున్నాయి. ఫలితంగా వార్త ఇప్పుడు కేవలం ఎడిటోరియల్ ప్రక్రియ మాత్రమే కాదు.. అది పెట్టుబడి, ప్రకటనల ఆదాయం, బ్రాండ్ విలువలతో ముడిపడిన ఒక వ్యాపార ఉత్పత్తిగా మారింది.

ఈ కేంద్రీకరణ సంపాదక స్వతంత్రతను దెబ్బతీస్తోంది. ఏది వార్తగా మారాలి, ఏది విస్మరిం చబడాలన్నది మార్కెట్ శక్తుల ప్రభావంతో నిర్ణయించబడుతోంది. ఇదే సమయంలో డిజిటల్ మీడియా విస్తరణ కొత్త పరిస్థితిని సృష్టించింది. సమాచార ప్రసార వేగం పెరిగింది. కానీ అదే స్థాయిలో దాని నాణ్యత పెరగలేదు. సోషల్ మీడియా వేదికల్లో ఏది ప్రజల దృష్టికి చేరాలి, ఏది చేరకూడదు అన్నది అల్గోరిథమ్స్ నిర్ణయిస్తున్నాయి. ఫలితంగా సమాచారం వ్యక్తిగత ఆసక్తుల చుట్టూ తిరుగుతోంది. ప్రజా అవసరాలు క్రమంగా కనిపించకుండా పోతున్నాయి. సెలబ్రిటీ కల్చర్, ప్రమోషనల్ కంటెంట్ అధిక ప్రాధాన్యం పొందడం వల్ల ప్రజల దృష్టి సామాజిక సమస్యల నుంచి వినోదాత్మక, వ్యక్తి కేంద్రిత కథనాల వైపు మళ్లుతోంది. దీంతో ప్రజల సమాచార వినియోగం “ఎకో ఛాంబర్‌”లుగా మారుతోంది. ఒకే రకమైన అభిప్రాయాలు తిరిగి తిరిగి బలపడుతూ, భిన్నాభిప్రాయాలు, వాస్తవాలు కనిపించ కుండా పోతున్నాయి. దీనికి తోడు ఫేక్ న్యూస్, మానిప్యులేటెడ్ కంటెంట్, భావోద్వేగాలను లక్ష్యంగా చేసుకున్న ప్రచారం వల్ల సత్యానికీ అసత్యానికి మధ్య సరిహద్దులు మసకబారుతున్నాయి. ఈ పరిణామాలన్నీ విడివిడిగా అనిపించినా, ఒకే దిశలో కలిసి సాగు తున్న ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వార్త స్వరూపాన్నే ప్రభావితం చేస్తోంది. వార్త ఇప్పుడు ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే అద్దం కంటే, వారి ‌దృష్టిని మళ్లించే శక్తిగా మారుతోంది. ఈ మార్పులో అసలు ప్రమాదం “ఏది కనిపి స్తోంది” అన్నదికాదు, “ఏది కనిపించకుండా పోతోంది” అన్నదే.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ జర్నలిజం పాత్ర మరింత కీలకమ వుతుంది. అది కేవలం సిద్ధాంత వాదనగా కాకుండా, రోజువారీ వార్తా ఆచరణలో వ్యక్తమవ్వాలి. వార్తను ప్రజల జీవితాల దగ్గరికి తీసుకురావడం, గణాంకాల వెనుక ఉన్న మానవ జీవనాన్ని బయటపెట్టడం, విధానాల వెనుక ఉన్న శక్తి సంబంధాలను గుర్తించడం… ఇవన్నీ పాత్రికేయ విలువలుగా బలపడాలి. అవి కేవలం సూత్రాలుగా మిగలకూడదు. కార్యాచరణగా రూపుదిద్దుకోవాలి. ఇది జరగాలంటే సంస్థాగత వ్యవస్థలోనే కాదు, ప్రజా అవగాహనలో కూడా మార్పు అవసరం. వార్తను “ఉత్పత్తి”గా చూసే దృష్టి బలపడుతున్నప్పుడు, దాన్ని “సామాజిక బాధ్యత”గా నిలబెట్టడం మరింత కఠినమైన పోరాటంగా మారుతుంది. ఈ పోరాటం మీడియా సంస్థల లోపలే కాదు, పాఠకుల అవగాహనలో కూడా కొనసాగాలి. ఎందుకంటే చివరికి ఏది వార్తగా నిలుస్తుందో నిర్ణయిం చాల్సింది ఎడిటోరియల్ బోర్డులు మాత్రమే కాదు, ప్రజల స్వీకరణ శక్తి కూడా. అందుకే ప్రత్యామ్నాయ జర్నలిజం భవిష్యత్తు ఒక సంస్థ లేదా ఒక వ్యక్తిపై ఆధారపడే విషయం కాదు. అది ఒక దృక్పథం ఎంత విస్తృతంగా జీవిస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది.

మ్రేడ్ మోటూరు హనుమంతరావు అందించిన వారసత్వం కూడా ఇదే. అది కేవలం ఒక సంపాదకీయ పద్ధతి కాదు, వార్తను ప్రజల జీవితాల నుంచి చదివే చూపు. అట్టడుగు వర్గాల బాధలు, పోరాటాలు, ఆకాంక్షలను పత్రిక చివరిపేజీల్లో కాకుండా మొదటి పేజీల్లో నిలబెట్టాలనే సంకల్పం. వినిపించని గొంతులను వినిపించడం, గణాంకాల వెనుక దాగిన మానవ వేదనను గుర్తించడం. సంచలనాల హోరులో కూడా సమాజంలోని నిజమైన సమస్యల నుంచి చూపు మరలకుండా నిలబెట్టడం. ఒత్తిళ్లు, బెదిరింపుల మధ్య కూడా ప్రజల పక్షాన నిలిచే ధైర్యం. ఇవే ఆయన వారసత్వం యొక్క అసలు బలం. వార్త ఏ వైపు నిలబడాలి అన్న ప్రశ్న నిరంతరం ఎదురవుతున్న ఈ కాలంలో మోటూరి వారసత్వం గతానికి చెందిన స్మృతి కాదు. వర్తమా నానికి అవసరమైన ప్రమాణం. జర్నలిజంలో అసలు ప్రశ్న వార్త ఎంత వేగంగా చేరిందన్నది మాత్రమే కాదు. ఎంత మందిని చేరిందన్నదీ కాదు. అది ఎవరి పక్షాన నిలిచింది? ఎవరి బాధను సమాజం ముందుకు తీసుకొచ్చింది? అన్నదే. ఈ ప్రశ్నకు మోటూరు పాత్రికేయ జీవితం ఒక ఆచరణాత్మక సమాధానం. ప్రజల జీవితాలను చూడలేని వార్త అధికారాన్ని మాత్రమే చూస్తుంది. ప్రజల గొంతును వినలేని వార్త ప్రచారాన్ని మాత్రమే మోస్తుంది. ప్రజల పోరాటాలను అర్థం చేసుకోలేని వార్త సంఘటనలను నమోదు చేయొచ్చు గానీ, సమాజాన్ని చూపించలేదు.
(నేడు ఎం.హెచ్ 25వ వర్థంతి)

రమేశ్‌ రాంపల్లి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -