కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ
జులై 1న దేశవ్యాప్తంగా ఆందోళనలు
ఆగస్టు 10న జైలు భరో
‘ఉపాధి హామీ’ని విచ్ఛిన్నం చేసేలా చట్టం
దీన్ని రద్దు చేసి పాత చట్టాన్నే కొనసాగించాలి :
వ్యవసాయ కార్మిక, సంఘర్ష్ మోర్చా అఖిల భారత వేదిక నేతల పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ఉద్దేశించిన కొత్త చట్టం విక్షిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గర్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (వీబీ జీ ఆర్ఎఎంజీ)ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టేందుకు వ్యవసాయ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికులు ఆ రోజు పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు వ్యవసాయ కార్మిక, సంఘర్ష్ మోర్చా అఖిల భారత వేదిక నేతలు తెలిపారు. అలాగే ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైలు భరో నిర్వహిస్తామని అన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం… కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చట్టం ఉపాధిని విచ్ఛిన్నం చేస్తే, ఈ చట్టం అమలుకు తీసుకొచ్చిన నిబంధనలు విధ్వంసం చేసేలా ఉన్నాయని విమర్శించారు. బుధవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బి.వెంకట్, గుల్జార్ సింగ్ గోరియా, నిఖిల్ దేవ్, ముఖేష్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం అమలుకు 55 క్లాజులు (పాయింట్స్), వందల సబ్ పాయింట్లతో విడుదల చేసిన డ్రాప్ట్ రూల్స్ అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. మొత్తం అధికారాలన్నీ స్టీరింగ్ కమిటీకి కట్ట బెట్టారని, కమిటీలో మొత్తం అధికారులే ఉన్నారని పేర్కొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘాలకు, ఉపాధి కార్మికులకు ప్రాతినిధ్యం లేని అధికార కేంద్రంగా ఉందని విమర్శించారు. అలాగే కౌన్సిల్‌కు ప్రతిపాదించిన రూల్స్ చూస్తే పని హామీ ఉండదని, అధికారాలు లేకుండా రాష్ట్రాలు చివరికి ఉత్సవ విగ్రహాల వలే మిగిలిపోతాయని తెలిపారు. స్టీరింగ్ కమిటీ ఎంత బడ్జెట్‌ను ప్రతిపాదిస్తే, కేంద్ర ప్రభుత్వం అంతమాత్రమే విడుదల చేస్తుందని అన్నారు. అదనంగా పైసా కూడా ఇవ్వరని, నిరుద్యోగ భృతిని మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని రూల్స్‌లో స్పష్టంగా చెప్పారని వివరించారు. డిమాండ్ బేస్ స్థానంలో కేంద్రం ఎంత ఇస్తే అంతమాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధి కార్మికులే కాదనీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. కొత్త చట్టం కింద కేంద్ర బడ్జెట్‌లో వివిధ రాష్ట్రాలకు కేటాయింపుల ప్రతిపాదన చేశారని, దాని ప్రకారం తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇంత తక్కువ అని అడిగే హక్కు లేదని అన్నారు. రాష్ట్ర 40 శాతం వాటా రూ.2,550 కోట్లు కలిపి మొత్తం రూ.6,376 కోట్లు ఈ ఏడాది అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే రాష్ట్రంలో 30.99 లక్షల మంది పనిచేస్తున్నారని, అందరికీ 125 రోజులు పని కల్పించా లంటే, మరో రూ.2,819 కోట్లు కావాలని అన్నారు.
కేంద్రం అదనంగా పైసా కూడా ఇవ్వదని, అంటే తెలంగాణ రూ.6,443 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ. 7,707 కోట్లు, రాష్ట్రం 40 శాతం వాటా రూ.5,138 కోట్లు కలిపి మొత్తం రూ.12,845 కోట్లు ఈ ఏడాది అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. ఏపీలో 54.99 లక్షల జాబ్ కార్డు దారులు పనిచేస్తున్నారనీ అయితే యాక్టివ్ కార్డుదారులకు ఈ మొత్తాన్ని వేతనాలుగా ఇస్తే కేవలం 71 పనిదినాలు మాత్రమే వస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా 125 పని దినాలు కల్పించాలంటే, రూ.22,746 కోట్లు కావాలని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వదని అన్నారు. అంటే, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కాకుండా మరో రూ.9,901 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆ మొత్తం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలే 40 శాతం వాటా, అదనపు పని దినాలకు మొత్తం రూ.24,000 కోట్ల నిధులు కేటాయించాల్సి వస్తోందని, ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు.
అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఉపాధిపై ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందో గత ఐదు నెలల ఉపాధి అనుభవం చెబుతోందని అన్నారు. 2025 జనవరి నుంచి మే వరుకు దేశవ్యాప్తంగా 128.1 కోట్ల పని దినాలు కల్పిస్తే, కొత్త చట్టం ఆమోదించిన తరువాత 2026 జనవరి నుంచి మే వరకు 79.1 కోట్ల పనిదినాలకు పడిపోయాయని తెలిపారు. 40.8 కోట్ల (35 శాతం పైగా) పని దినాలు తగ్గాయని పేర్కొన్నారు. చట్టం అమలు కాకముందు పరిస్థితి ఇలా ఉంటే జులై 1 నుంచి చట్టాన్ని అమలు చేస్తే ఇంకా పని దినాలు ఎలా కుదిస్తారో స్పష్టం అవుతుందని అన్నారు. కనుక ఈ కొత్త చట్టం రద్దు చేసి, పాత చట్టాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగుతుందనీ, ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
‘వీబీ జీ ఆర్‌ఎఎంజీ ’ని అమలు చేయొద్దు
- Advertisement -
- Advertisement -



