రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకే తొలి ప్రాధాన్యత
యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే
రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం
ప్రతి నియోజకవర్గానికి 500 ఇండ్లు .. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు లబ్ధి : రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గుడిసెలు లేని తెలంగాణాయే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా, గౌరప్రదంగా సొంత ఇంటిలో జీవించేలా చేస్తామన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గృహనిర్మాణ శాఖ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలుపై చర్చించారు. ఇండ్ల మంజూరుకు సంబంధించి గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వారిలో అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
గుర్తింపునకు ప్రత్యేక సర్వే
రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాల్టీల పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలని ఆదేశించారు. ఎంపీడీవో స్థాయిలో జాబితాలను సిద్ధం చేసి సంబంధిత ఇన్‌చార్జి మంత్రుల ఆమోదానికి పంపించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హుల ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఎటువంటి పొరపాట్లు, వివక్షకు తావు లేకుండా అనర్హుల చొరబాటుకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.
దరఖాస్తు చేసుకోని వారికీ అవకాశం
ప్రజాపాలన, ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అటువంటి దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2వేల ఇండ్ల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం
పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రెండో విడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇండ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి, వారికి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.
అసంపూర్తి ఇండ్లకు కూడా…
వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. పాత ఇందిరమ్మ పథకం కింద మంజూరై బేస్‌మెంట్ స్థాయి లేదా పైకప్పు స్థాయిలో నిలిచిపోయిన ఇండ్లను కూడా ఈ పథకంలో చేర్చవచ్చని పేర్కొన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
లబ్ధిదారుడే ఇంటి నిర్మాణదారు
బీఎల్‌సీ (బెనిఫిషియరీ లెడ్ కన్స్‌ట్రక్షన్) విధానంలో లబ్ధిదారుడే తన ఇంటిని నిర్మించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జి+1) నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో దశాబ్దాల పేదల సొంతింటి కలలను సాకారం చేస్తున్నామని చెప్పారు. రెండో విడత ద్వారా లక్షలాది పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నామని చెప్పారు.



