ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. తల్లిదండ్రులకు భరోసా..
వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డీఎండీ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను మన్నించి స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. హనుమకొండ జిల్లాలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏండ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని అభిలషించాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎక్కడ చేయిస్తున్నారు? అతన్ని కాపాడుకోవడానికి ఏం చేయొచ్చు అన్న విషయాలపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని తెలిపారు.
చలించిపోయిన పవన్ కళ్యాణ్
నిరంజన్‌ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. లేవలేని స్థితిలో ఉన్న అతన్ని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. ‘చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం’ అని నిరంజన్ చెప్పిన మాటలు విని కదలిపోయారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన డాన్స్‌ల తాలూకు వీడియోలు, ఫొటోలను తిలకించారు. అంతా తనని ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపించి పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్‌ను పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆస్పత్రి క్యాంటిన్‌లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు. నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్‌తోపాటు జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి శంకర్‌గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, శ్రీ ఆర్‌కే సాగర్ తదితరులు ఉన్నారు.



