2015 నవంబర్ 21న ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ, వికలాంగుల జీవితాల్లో మార్పులు తెస్తున్నామని, అందుకే వారికి దివ్యాంగులుగా నామకరణం చేస్తున్నట్టు చెప్పారు. ఇకనుంచి వారికి అన్నీ వెలుగులేనన్నారు. అది చెప్పి పదకొండేండ్లు కావస్తున్నా ఆ మార్పు వారి జీవితాల్లో కనపడటం లేదు. ఎందుకంటే, ఇటీవల వార్షిక బడ్జెట్‌లో వికలాంగులకు ఏమిచ్చారు? అసలు వారు లెక్కలోనే ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. 2014లో రూ.403.39 కోట్లు కేటాయిస్తే 2026-27లో 1669.72 కోట్లు చూపారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం చేపడుతున్న పథకాలు లేదంటే, కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఏ మూలకు సరిపోదు. వారి బడ్జెట్‌లోనే కాదు, కేంద్రం అమలు చేస్తున్న విద్యా, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం వంటి పథకాలకు నిధుల కేటాయింపుల్లో తగ్గుదల కూడా వికలాంగులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాఠశాలలు అందుబాటులో ఉండకపోవడం, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, ఆకలి, నివాస సౌకర్యాలు సమస్యలు తలెత్తడం, జీవనోపాధి లేక అభద్రతకు గురయ్యే అవకాశం ఉంటుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 2.68 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 16 శాతం వరకు జనాభా ఉంటుందని అంచనా. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం దేశంలో వారి జనాభా గణనీయంగా పెరుగుతోంది. 2016 ఆర్‌పిడి చట్టం ప్రకారం సకలాంగులతో సమానంగా వికలాంగులకు సమానత్వం, వివక్షత లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. సమ్మిళిత విద్యా, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, సామాజిక భద్రత, గృహనిర్మాణం, రవాణా, ప్రజాసేవలు పొందడం వికలాంగుల హక్కు. కానీ, ఆ హక్కులను నీరుగార్చే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నది. పన్నెండేండ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రజాసంక్షేమం, అభివృద్ధి కంటే ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వికసిత్ భారత్, అమృత్ కౌశల్ వంటి కొత్త కొత్త పేర్లతో నినాదాలు ఇస్తున్నప్పటికీ వాటి ద్వారా ప్రజల జీవితాల్లో కాసింత మార్పుకూడా రావడం లేదంటే, పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగానే పాలన ఉంటున్నది.
వికలాంగులు సామూహిక ప్రాంతాలను వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాక్ససబుల్ ఇండియా క్యాంపెయిన్-2022 అర్భాటంగా ప్రారంభించింది. నాలుగేళ్లయి నా 2026 జనవరి నాటికి కూడా ఆ లక్ష్యాలను సాధించలేకపోయింది. దీనికి అరొకర నిధులే కారణం. స్కీమ్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ అఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ (ఎస్‌ఐపిడిఎ) పథకానికి 2022-23లో 240.39 కోట్లు, 2023-24 లో 153.33 కోట్లు, 2024-25లో 115.10 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో అసలు నిధులే కేటాయించలేదు.2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అమలులో భాగంగా టెలిమెంటల్ హెల్త్ కార్యక్రమానికి 2023-24లో 90కోట్లు, 2024-25లో 79.60 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు నిధులే ఇవ్వలేదు. మానసిక ఆరోగ్య సమస్య గురించి ఆర్థిక సర్వే చేస్తున్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పడానికి బడ్జెట్ కేటాయింపులే నిదర్శనం. ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన వికలాంగులు పెన్షన్స్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.2012 నుండి కేంద్రం ఇస్తున్న రూ.300 ఇందిరాగాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పథకానికి నిధులు పెంచాలని స్టాండింగ్ కమిటీ సిపార్సులు చేసినప్పటికీ నిధుల్లో పెరుగుదల లేదు. వికలాంగుల జనాభాలో 3.8 శాతం మందికే వర్తిస్తున్న ఈ పథకాన్ని వికలాంగులందరికీ వర్తింపచేయడానికి కూడా కేంద్రం నిరాకరిస్తున్నది.
దేశవ్యాప్తంగా రూ.5వేలకు పెన్షన్ పెంచాలని దశాబ్దకాలంగా పోరాడుతున్నా బడ్జెట్‌లో నిధులు పెంచడం లేదు. వారికి ఉపాధి కల్పించడానికి ప్రారంభించిన దివ్యాంగ్జాన్ కౌశల్ యోజన పథకం వికలాంగులకు ఉపాధి కల్పించడం కంటే, సహాయ పరికరాలు తయారు చేస్తున్న అలింకో సంస్థకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆర్థికమంత్రి పేర్కొన్న ఆర్థిక క్రమశిక్షణ అంటే క్షిణిస్తున్న సంక్షేమం, వికలాంగులు పొందుతున్న సేవలను బలహీనపర్చడం, జీవితావసరాల ఖర్చులు పెరగడం, సంపన్నులకు రాయితీలివ్వడం, వికలాంగుల సంక్షేమ పథకాల అమలుకు నిధులు క్రమేణా తగ్గడంగా చూడాలి. వికలాంగుల హక్కులను ఉల్లంగించి, అసమానతలను పెంచే ఇలాంటి బడ్జెట్ వికలాంగులకే కాదు, ఏ వర్గానికీ ఆమోదయోగ్యం కాదు. సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో నిధుల కోత రద్దు చేయాలని, వికలాంగుల చట్టాల అమలుకు కేటాయింపులు పెంచాలని పోరాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉన్నది.
ఎం.అడివయ్య
9490098713



