Wednesday, February 18, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమున్సిపాల్టీల్లో విధులెక్కువ..నిధులు తక్కువ!

మున్సిపాల్టీల్లో విధులెక్కువ..నిధులు తక్కువ!

- Advertisement -

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇప్పుడే పరిపాలన బాధ్యత మొదలైంది. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడాలేకుండా కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీలకు అధిక నిధులు కేటాయించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉన్నది. ‘తెలంగాణ మునిసిపాలిటీల చట్టం-2019’ స్వయంపాలన సంస్థలుగా పనిచేయడానికి వాటి నిర్మాణం, విధులు, ఆర్థిక అధికారాలను వివరిస్తుంది. కానీ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, తాగునీటి సమస్య, ట్రాఫిక్‌ ఇబ్బంది, మురుగు, పర్యావరణ సమతుల్యత, వలస కార్మికుల నివాసం లాంటి సమస్యలు ఏండ్లకొద్లీ అలాగే నానుతున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీల విధులు చూస్తే చాంతాడంత ఉంది. నిధులు మాత్రం బెత్తెడు కూడా లేవు. మునిసిపాలిటీ స్వయం పరిపాలనతో కూడిన ప్రభుత్వ సంస్థగా కార్యకలాపాలు నిర్వహించుటకు అధికారము ఇవ్వవచ్చునంటూ… 74వ రాజ్యాంగ సవరణలు చెబుతున్నాయి.

అదే మళ్లీ రాష్ట్ర శాసనసభ చేసే శాసనంతో షరతులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, లోకల్‌ బాడీలలో స్వయం పరిపాలన నేతి బీరకాయలో నెయ్యివంటిదే. వ్యక్తి, కుటుంబం, ప్రజా సమూహాల కార్యకలాపాలు జరిగేటివన్నీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోనే. అటువంటి లోకల్‌బాడీలకే స్వయం పరిపాలన అధికారం, ముఖ్యంగా ఆర్థిక వనరులపై అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నది. ప్రభుత్వానికి సమకూరే ఆదాయాలలో నలభైశాతం లోకల్‌ బాడీలకు కేటాయించవలసి ఉన్నప్పటికీ, నాటి బెంగాల్‌లోని వామపక్ష ప్రభుత్వం, నేడు కేరళలోని వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం మాత్రమే ఈ పనిచేసింది. బీజేపీ, కాంగ్రెస్‌ ఇతర ప్రాంతీయ పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాలు నిధులను వికేంద్రీకరణ చేయడం లేదు. కిరాణా సామాన్లు, బట్టలు, చెప్పులు ఇలా ప్రతిదీ ప్రజలు కొనుగోలు చేసేది నివాస ప్రాంతంలో. కానీ జీఎస్టీలో వాటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంది. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు వాటా లేదు. పెట్రోల్‌, డీజిల్‌పై వసూలు చేసే వాట్‌, ఎక్సైజ్‌ సుంకం, సెస్సులలో మున్సిపాలిటీలకు వాటా లేదు. ఇంకా ఏ టాక్స్‌లోనూ వాటా లేదు. సేల్స్‌టాక్స్‌లో, మద్యం అమ్మకాల రాయల్టీలలో వాటా లేదు.

లోకల్‌ బాడీలకు విధులు ఎక్కువ నిధులు తక్కువ అన్నది వాస్తవం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దయాదక్షిణ్యాలపై లోకల్‌ బాడీలు ఎదురు చూడవలసి వస్తున్నది. కోతులకు, కుక్కలకు స్టెరిలైజేషన్‌ చేయించే పరిస్థితిలో, వాటిని నిర్వహించే స్థితిలో పట్టణ, నగర పాలకవర్గాలు లేవు. ఆర్టికల్‌ 243-ఎక్స్‌ లోని (ఎ), (బి) (సి) ప్రకారం మునిసిపాలిటీలు ఆదాయాలు ఆస్తి పన్ను ప్రాథమిక ఆదాయ వనరు. హోర్డింగ్‌లు, ప్రకటనలపై విధించే పన్ను, వినోదపు పన్ను, ఖాళీ భూమి పన్ను (విఎల్‌టి). నీటి ఛార్జీలు, భవన నిర్మాణ అనుమతి రుసుములు, ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నులు కీలకం. మున్సిపల్‌ దుకాణాలు, మార్కెట్లు, సముదాయాల నుండి వచ్చే అద్దెల ఆదాయం కూడా ఉంటుంది. ఆస్తి హక్కుల బదిలీకి విధించే మ్యుటేషన్‌ ఫీజు, అక్రమ నిర్మాణాలపై విధించే జరిమానాలు, స్టాంప్‌ డ్యూటీపై సర్‌చార్జ్‌, రాష్ట్ర/కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు ఇందులో భాగం.

ఆర్టికల్‌ 243-డబ్ల్యు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992, షెడ్యూలు 12 ప్రకారం మునిసిపాలిటీల ముఖ్యమైన విధులు పట్టణ ప్రణాళిక నుంచి మొదలుకుంటే మొత్తం పద్దెనిమిది వరకు ఉన్నాయి. వీటిలో చాలావరకు అమలు చేసే పరిస్థితి లేదు.కారణం, నిధుల్లేకపోవడం. 243-ఐ ఆర్టికల్‌ కింద నియమించబడే ఆర్థిక కమిషను, మునిసిపాలిటీలను సమీక్షించి, వాటి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి తీసుకొనవలసిన చర్యలను సూచించడం, రాష్ట్ర ప్రభుత్వం, మునిసిపాలిటీల మధ్య ఆదాయాల పంపిణీకి సిఫారను చేసే అధికారం మాత్రమే కలదు. ఫైనల్‌ నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. నిధులు, ఫెడరల్‌ హక్కులపై కేంద్రాన్ని ప్రశ్నించే రాష్ట్ర ప్రభుత్వం తన లోకల్‌ బాడీలకు నిధులివ్వడం లేదు. లోకల్‌ బాడీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే బాధ్యతలు, విధులు తక్కువగా ఉండే కేంద్ర ప్రభుత్వం నిధుల పైన, ఆర్థిక వనరుల పైన ఆధిపత్యం చెలాయిస్తున్నది.

ప్రజల నుండి వివిధ రూపాలలో వసూలు చేస్తున్న పన్నులలో కేంద్ర ప్రభుత్వం తీసుకుపోతున్న వాటా ఎంత? రాష్ట్రం నుండి తీసుకెళ్తున్న నిధులు ఎన్నో చెప్పడం లేదు! రాష్ట్రాలకు, లోకల్‌ బాడీలకు ఇస్తున్న నిధుల గురించి అబద్ధాలు చెప్పిస్తున్నారు. నరేంద్ర మోడీ తన జేబులో నుండి డబ్బులు ఇస్తున్నట్లుగా… రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ప్రధానంగా పట్టణ నగర జనాభా ప్రాతిపదికన విడుదల చేసే కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులది కూడా అదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించడం లేదని సాకులు చూపుతో కేంద్రం నిధులివ్వడం లేదు. స్థానిక సంస్థల హక్కులనే కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి. బాధ్యతగా ఓటు వేయడమే కాదు, పట్టణ అభివృద్ధికి నిధుల కోసం కూడా పౌరులు పోరాడాలి.

గీట్ల ముకుందరెడ్డి
9490098857

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -