కార్పొరేట్ రాజకీయాల్లో వెనుకబడ్డా ప్రజల గుండెల్లో ఉంటాం..
కమ్యూనిస్టులను చిన్నచూపు చూసేవారికి కొత్తగూడెం మేయర్ ఎన్నిక చెంపపెట్టు
కిషన్‌రెడ్డీ..కొత్తగూడెంలో మీ బీజేపీ ఎక్కడీ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్పొరేట్, డబ్బు రాజకీయాల్లో కమ్యూనిస్టులు ఆశించిన మేరకు సీట్లు గెలవలేకపోవచ్చుగానీ పోరాటాలతో ప్రజల గుండెల్లో ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కమ్యూనిస్టులను, కమ్యూనిస్టు పార్టీలను చిన్నచూపు చూసేవారికి, కమ్యూనిజం ఎక్కడ అనేవారికి కొత్తగూడెం మేయర్ ఎన్నిక చెంపపెట్టులాంటిదన్నారు. కొత్తగూడెంలో తమ పార్టీకి చెందిన ఆటోడ్రైవర్ గణేశ్ మొదటి మేయర్‌గా ఎన్నికకావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నరసింహ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడారు.
రానున్న గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను సవాల్ తీసుకుని సర్వశక్తులూ ఒడ్డుతామని ప్రకటించారు. జిల్లాల వారీగా బలమున్న స్థానాలను ఎంచుకుని జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో ప్రాతినిధ్యం పెంచుకునేలా చూస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఒక్క సీటుతో సరిపెట్టుకోకుండా పది నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించి తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే దిశలో భాగంగా వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని నొక్కి చెప్పారు. కొత్తగూడెంలో అధికార పార్టీ స్థానిక నేతలు అనేక ఇబ్బందులు పెట్టినప్పటికీ రాష్ట్రస్థాయిలోని పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్లామన్నారు. భవిష్యత్తులో పొత్తు కొనసాగడమా? లేదా? అనేది కాంగ్రెస్ చేతిలోనే ఉన్నదని స్పష్టం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో చతుర్ముఖ పోటీలో తమ పార్టీ ఒంటరిగా 22 స్థానాలను, తాము బలపర్చిన ఒక ఇండిపెండెంట్ స్థానాన్ని గెలుచుకున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలేవి అయినా కొత్తగూడెంలో ఒంటరిగానే సీపీఐ పోటీచేస్తున్నదనీ, మంచి ఫలితాలను సాధిస్తూ వస్తున్నదని తెలిపారు. సీఎం, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి చొరవతో కొత్తగూడెంలో మేయర్, డిప్యూటీ ఎన్నిక విషయంలో పొత్తు కుదిరిందన్నారు.
కమ్యూనిస్టులు ఎక్కడని ప్రశ్నిస్తున్న కిషన్‌రెడ్డి..గతంలో వారి పార్టీ పరిస్థితి ఏంటో గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. నగర, పట్టణ పాలక మండళ్లలో గతంలో 20 స్థానాలుంటే ప్రస్తుతం తమ పార్టీ 41 స్థానాలకు పెరిగిందనీ, గతంలో 75 మంది సర్పంచులుండగా, ఇప్పుడు ఆ సంఖ్య 101కి పెరిగిందని వివరించారు. వామపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తామనీ, అయితే, ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు కావట్లేదని చెప్పారు. ఇలాంటి సమస్యలకు కమ్యూనిస్టు పార్టీల విలీనమే పరిష్కారమని స్పష్టం చేశారు. కొత్తగూడెంలో ధైర్యంగా నిలబడి పోరాటం చేయడంతోనే విజయం దక్కిందని చెప్పారు. ఎర్రచొక్కా వేసుకున్న వారిని అడ్డుకుని చొక్కాలను విప్పించిన పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకాలకు పాల్పడేవారిని నియంత్రించాలి తప్ప తమ లాంటివారిని కాదని సూచించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిమానంతో గెలిచేందుకు ప్రయత్నించాలనీ, ప్రతిపక్షాలను బెదిరించేందుకు పోలీసుల జోక్యం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగూడెంలో అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని సీఐ గన్‌తో బెదించడాన్ని తప్పుబట్టారు. స్నేహం స్నేహమేనీ, పొత్తులు పొత్తులేననీ, తమకు అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన పోరాడుతాం…బలపడుతాం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



