– రూ.50 లక్షల వ్యయంతో నిర్మాణం
– స్థానికంగా రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేసిన డీఎం చంద్రమోహన్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ అటవీ అభివృద్ధి మండలి (ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో అశ్వారావుపేట లో నిర్మించిన ప్లాంట్ మేనేజర్ రెసిడెన్షియల్ క్వార్టర్ ను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని గుర్రంగూడ నుంచి ఈ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ నివాస గృహాన్ని స్థానికంగా ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ చంద్రమోహన్ రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాంట్ మేనేజర్ తిరుమలరావు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నూతన నివాస గృహం అందుబాటులోకి రావడం ద్వారా ప్లాంటేషన్ నిర్వహణకు అవసరమైన పరిపాలనా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు.



