వైజ్ఞానిక స్పృహ గురించి ప్రపంచ శాస్త్రవేత్త లేమన్నారు? దార్శనికులు ఏమన్నారు? హేతువాద రచయితలు దానిని ఎలా నిర్వచించారు? – వంటివి చర్చించు కుంటూ వెళ్లొచ్చు. కానీ, నేను ఇంకా వెనక్కి మూలాల్లోకి వెళ్లి అసలు ఆ వైజ్ఞానిక స్పృహ/దృక్పథం లాంటి మాటలు వాడుకలోకి రాక ముందే ఆభావనకు ఒక రూపం ఇచ్చిన హేతు వాది, నిరీశ్వరవాది, తాత్త్వికుడు, సంఘ సంస్కర్త, ఒకరకంగా తొలి వైజ్ఞానికుడైన గౌతమ బుద్ధుని దగ్గరి నుండి విషయాలు చర్చించాలని అనుకుం టున్నాను. ఆయన్ను కేవలం బౌద్ధానికి రూపకల్పన చేసిన మత బోధకుడిగా మాత్రమే చూస్తే, తప్పు చేసిన వాళ్లమవుతాం. ఆయన, ప్రకృతిని గౌరవించాలని చెప్పిన తొలి పర్యావరణవేత్త తన జ్ఞానాన్ని శిష్యులకు బోధించిన తొలి ఉపాధ్యాయుడు. తన సంఘంలో అనారోగ్యానికి గురైన వారికి చికిత్సనందించిన బైషజ్ఞ గురువు – అంటే చికిత్సకుడు. ఆయన థేరవాదం నుండే థేరాపుటులు (చికిత్సకులు) వచ్చారు. అలాగే థేరవాదం నుండే ఇంగ్లీషు పదం థియరీ వచ్చింది. ఆయన కాలంలో. ప్రజల భాషలైన పాలి, ప్రాకృతాల్లో నుంచి తీసుకున్న చాలా పదాలు ఇప్పటికీ మనం నిత్య జీవితంలో వాడుతున్నాం. థేరోపతి నుండే తిరుపతి వచ్చింది. దేశంలోని వేల గ్రామాల పేర్లు పల్ల అని ఉంటాయి కదా, ఆ పల్లి పదం అక్కడి నుండి వచ్చిందే- సరే, వాటిని అలా ఉండనిచ్చి సైన్సు విషయాలు చూద్దాం!
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్ర వేత్తలయిన న్యూటన్, ఐన్‌స్టీన్, ఫ్రాన్సెస్కో వరేలా, రాబర్డ్ ఓపెన్ హైమర్, సామ్ హారిస్, రిచర్డ్ డాకిన్స్, వంటి వారంతా ఒక మహా మానవుడి బోధనల ముందు బుద్ధిగా, గౌరవంగా నిలబడి పోయారు. అతను ఈ దేశంలో 2,600 ఏళ్ల క్రితం పుట్టిన వాడు. తన స్వానుభవం నుండి, సాధన నుండి ప్రపంచ జ్ఞానాన్ని సాధించిన వాడు. అంతేకాదు, తన జ్ఞానాన్ని ఇతరులకు బోధించాలన్న నిస్వార్థ బుద్ధితో జీవితాంతం కృషి చేసిన వాడు అతనే గౌతమ బుద్ధుడు. న్యూటన్ సూత్రాలలో మూడవది Every action will have equal and opposite reaction- మీరు చేసే ప్రతి చర్చకు సమానమైన, వ్యతి రేకమైన ప్రతి చర్యలు ఉంటాయి! అదే విషయం బుద్ధుడు అంతకుముందే 2,600 ఏళ్ల క్రితం చెప్పాడు. ‘‘మీరు ఎలాంటి కర్మలు ఆచరిస్తే, అలాంటి ఫలితాలే వస్తాయి’’ ఇది కేవలం నైతికతకు సంబంధించిన పాఠం కాదు – అతి Cause effectకు సంబంధించిన principle. న్యూటన్ విషయాన్ని గణిత శాస్త్ర ప్రకారం చెపితే, బుద్ధుడు అనుభవ పూర్వకంగా చెప్పాడు. ‘‘ఆధునిక జీవితానికి సరిపడే మతం ఏదైనా ఉందీ అంటే – అది కేవలం బౌద్ధమే’’ అని అన్నాడు ఐన్ స్టీయిన్. ఎందుకంటే బుద్ధుడు విషయాన్ని తన విశ్వాసంలోంచి చెప్పలేదు. తన పరి శీలనలతో చెప్పాడు. వాటికి తన అనుభవాన్ని జోడించి చెప్పాడు. అందుకే బౌద్ధం ఆధునిక వైజ్ఞానిక అవసరాలకు దగ్గరగా ఉంది. బుద్ధుడి తార్కిక దృక్పథం ఐన్ స్టీయిన్ సాపేక్షం Relativity లాంటిది. ఎందుకంటే, ప్రతిదీ మరో దానిపై ఆధార పడిందేనన్నాడు బుద్ధుడు. దేనికది విడిగా మనలేదు. ఉనికిని సాధించు కోలేదు. అందువల్ల, బుద్ధుడు చెప్పింది ఐన్ స్టీయిన్ రిలేటివిట్ తో సరిపోతుంది.
‘‘బౌద్ధం ఒక్కటే సైన్స్ తో ఏ మాత్రం విభేదించదు’’ అని ప్రకటించాడు మరో ప్రసిద్ధ శాస్త్రవేత్త రిచర్డ్ డాకిన్స్. ఈయన సైన్స్ ను, లాజిక్ ను బలంగా సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన శాస్త్రవేత్త. ‘అంధ విశ్వాసాల్లో ఎవరూ బతక కూడదు. స్వయంగా పరిశీలించి, అనుభవించి, వాస్తవం తెలుసుకుని మసలుకోవాలి’ అని అన్నాడు బుద్ధుడు. అమాటే డాక్సిన్‌కు నచ్చింది. ఎందుకంటే, సైన్స్ చెప్పింది కూడా అదే! పరిక్షించి తేల్చుకో. అవసరమైతే -మళ్లీ మళ్లీ పరీక్షించు. ఫలితాలు బేరీజు వేసుకో. సంతృప్తిగా ఉంటేనే దాన్ని స్వీకరించు- అన్నదే సైన్సు చెపుతుంది. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనాలన్నీ ఈ సూత్రం మీద ఆధారపడే జరుగుతున్నాయి. రాబర్డ్ ఓపెన్ హైమర్ తన పరిశోధనలు కొనసాగిస్తున్న దశలో బౌద్ధాన్ని బాగా అధ్యయనం చేశాడు. అందువల్ల ఆయన దాని గురించి ఒక మాట చెప్పగలిగాడు. ‘‘ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కన్నా బుద్ధుడి మానసిక పరిపక్వత (Psychology-scientific study of mind) చాలా ముందుంది’’అని! ఎందుకంటే ‘‘మనసే అన్నింటినీ సృష్టిస్తుంది’’- అని ముందు చెప్పినవాడు బుద్ధుడు. పరిశీలనలేని వాస్తవం ఏదీ ఉండదు – అని అంటుంది ఆధునిక భౌతిక శాస్త్రం. క్వాంటమ్ మెకానిక్స్ (Quantum mechanics-fundamental Theory in physics describing The behavior of matter and light at the atomic and subatomic scales) బుద్ధుడి ధ్యానం రెండూ ఒకే చోట కలుస్తున్నాయి. ఈ విషయాన్ని ఫ్రాన్సెస్కో వరేలా ప్రయోగాత్మకంగా నిరూపించాడు. ఈయన ప్రపంచస్థాయి న్యూరో సైంటిస్టుల్లో ఒకరు. నేటి మన మాడ్రన్ ఫిజిక్స్ , న్యూరోసైన్స్ వంటివి రూపుదిద్దుకోవడానికి వేల సంవత్సరాలకు ముందే బుద్ధుడి మెదడు అనేక విషయాలు ఎలా గ్రహించగలిగిందీ – అన్న విషయంపై వరేలా పరిశోధన చేశాడు.
బుద్ధుడు ఇప్పుడు లేడు. కానీ, ఆయన దారిలో పయనిస్తూ రోజూ ధ్యానం (Meditation) చేస్తున్న బౌద్ధ భిక్కులు వేల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారిలో అనుభవజ్ఞులైన సీనియర్ బౌద్ధభిక్షుల్ని ఎన్నిక చేసుకుని, వారి మెదళ్లు స్కాన్ (scan) చేసి చూశాడు. ఆ అధ్యయనంలో చాలా ఆశ్చర్య కరమైన విషయాలు బయట పడ్డాయి. వారి మెదళ్లలో 100 + hrds comawaves తరంగాలు ఉన్నాయి. ఇవి Brain activityని తెలియజేస్తాయి. సామాన్యుల మెదళ్లలో ఈ తరంగాలు ఉండడానికి వీలే లేదు. కాని, రోజూ ధ్యానం చేసే బౌద్ధభిక్కుల మెదళ్లలో ఇవి పుష్కలంగా ఉన్నాయి – అంటే ధ్యానం (Meditation) శక్తిని వరేలా వైజ్ఞానిక పరిశీలనల వల్ల నిరూపించాడు. చివరకు ‘మెడిటేషన్ – మెదడును ‘సూపర్ హ్యూమన్’ గా( Super human) చేయగలుగుతుంది’ – అని ప్రకటించాడు. ఈ మాట ఆయన ఊరికే చెప్పలేదు. ప్రయోగాత్మకంగా నిరూపించి చెప్పాడు కాబట్టి. మనం స్వీకరించాల్సిందే! పైగా వేల సంవత్సరాలకు పూర్వమే బుద్ధుడి మెదడు ఏ స్థాయిలో పనిచేసిందో, ఎలా ఆయన Super human కాగలిగాడో కొంతలో కొంత అర్థం చేసుకోవచ్చు. మరో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్త సామ్ హారిస్ తన walking up అనే గ్రంథంలో బుద్ధుణ్ణి ‘First scientist of Mind’- అని అన్నాడు. ఆధ్యాత్మికతను మతానికి ముడిపెట్టి చూడకూడదనీ, దాన్ని శాస్త్రీయ క్రమ శిక్షణ కోణంలో చూడాలి – అని కూడా అన్నాడు. (Spirtuality should be understood in the light of scientific discipline!) (spirtuality) దు:ఖానికి గల కారణాలను బుద్ధుడు వైజ్ఞానికంగా వివరించాడు. దుఃఖం- బాధ కోర్కెల వల్ల (Desire) బంధాల వల్ల (attachment) అమాయకత్వం వల్ల (ignorence) వస్తాయని అన్నాడు. నివారణ కూడా శాస్త్రీయం గానే చెప్పాడు. పరిశీలించు (observe) అర్థం చేసుకో (Understand) మార్గాలు వెతుక్కో (Let-go) ఈ రోజు సైన్సు కూడా ఇదే చెపుతూ ఉంది.
భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ 1913లో ప్రతిపాదించిన సూత్రం (Principle) ప్రకారం ఎలక్ట్రాన్లు పరమాణు కేంద్రం చుట్టూ, నిర్దిష్టమైన, క్యాంటైజ్డ్ శక్తి స్థాయిలలో పరిభ్రమి స్తాయని వివరిస్తుంది. ఎలక్ట్రాన్లు ఈ స్థిరమైన స్థాయిల మధ్య ఉండలేవని, కానీ కచ్చితమైన పరిమాణంలో శక్తిని గ్రహించి, లేదా విడుదల చేస్తే, వాటి మధ్యలోకి దూకగలవని – ఈ సూత్రం చెపుతుంది. నీల్స్ బోర్ మైక్రోస్కోప్‌లో చూపించింది బుద్దుడు మానవ మస్తిష్కంలో చూపించాడు. సైన్సు టెలిస్కోపులో చూస్తే, బుద్ధుడు తన మెదడు టెలిస్కోపుతోనే చూడగలిగాడు. ‘ప్రతిదాన్ని రెండు విభిన్నమైన కోణాల నుండి చూడాలని. అయితే సత్యం మధ్యలో ఉంటుందని’- మధ్యమ మార్గం (Middle path) గురించి చెప్పింది బుద్ధుడే! అవగాహన మారిపోగానే వాస్తవం మారిపోతుంది. ఇది ఇక్కడ ఉంటేనే అది అక్కడ ఉంది. ఇది ఇక్కడ లేకపోతే అది అక్కడ లేదు-ప్రతీత సముత్పాద. నిజం ఎప్పుడూ ఒక పక్షం వహించదు. అది మధ్యలో ఉంటుందన్న బుద్ధుడి మాటకు నీల్స్ బోర్ సూత్రానికి సంబంధం ఉంది. దేనినీ Absolute అని అను కోవద్దంటాడు బోర్. జర్మన్ శాస్త్రవేత్త, నోబెల్ బహు మతి గ్రహీత, క్వాంటమ్ ఫిజిక్స్ పితామహుడు మాక్స్ ప్లాంక్ చెప్పిన మాట విజ్ఞాన శాస్త్రాన్ని ఒక కుదుపు కుదిపింది. Consciousness is fundamental, Mind is secondary- అని అన్నాడు. Conscious -ness creates reality అని కూడా అన్నాడు. ఇదే విషయం బుద్ధుడు ముందే చెప్పాడు కదా ‘చిత్తలోక సముదయ’ అంటే మనసే ప్రపంచాన్ని సృష్టిస్తుందీ-అని! నువ్వు ఏదైతే ఆలోచిస్తావో, అదే నువ్వు అయిపోతావు.
మనసే ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనసే దాన్ని ధ్వంసం చేస్తుంది- అన్న బుద్ధుడి మాటకు- మైండ్ లేకుండా మేటర్ అర్థం లేనిది. పరిశీలన లేకుండా వాస్తవం అసంపూర్ణం- మొదట మైండ్ (మనసు, మెదడు) వస్తుంది. దానితోనే ప్రపంచం రూపుదిద్దు కుంటుంది-అన్న మాక్స్ ప్లాంక్ మాటకు తేడా లేదుకదా ? వేరు వేరు కాలాలలో జీవించిన ఇద్దరు వ్యక్తులు, వారు మాట్లాడింది వేరు భాషలు. కానీ, చెప్పింది ఒకటే సత్యం! ఈ విశ్వాన్ని కవితాత్మకంగా, వైజ్ఞానికంగా నిర్వచించాడు మరో ప్రపంచ స్థాయి శాస్త్రవేత్త కార్ల్ సాగన్. ‘బ్రహ్మాండమంతా ఒకే రకమైన ధూళి’ అన్నాడు. Star Stuff – inter Connected wave అన్నాడు. ప్రతిదీ జరగడానికి ఒక కారణముంది. ఆ కారణాన్ని కనుక్కుంటే దాని నివారణ కనుక్కోవచ్చు అని బుద్ధుడు చెప్పిన విషయం చుట్టే ఆధునిక పరిశోధనలన్నీ తిరుగుతున్నాయి. ఒకరకంగా చెప్పుకోవా లంటే, బుద్ధుణ్ణి చేరడానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి 2,600 ఏళ్లు పట్టింది. ఐన్ స్టీయిన్ మెదడు, న్యూటన్ గణితం, సామ్ హారిస్ తర్కం, డాకిన్స్ సంశయాత్మకత అన్నీ కలిసి బుద్ధుడి ముందు కలుస్తున్నాయి. ఎక్కడైతే విజ్ఞాన శాస్త్రం ప్రయోగా త్మకంగా నిరూపిస్తూ వస్తూ ఉందో.. అక్కడికి, అచోటుకి అంతకు ముందే బుద్ధుడు తన పరిశీలనతో, అనుభవంతో, ధ్యానంతో చేరుకున్నాడు. జ్ఞానమే అసలైన శక్తి! కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త.
ప్రొ. దేవరాజు మహారాజు



