‘నా మాటే శాసనం’ అన్న బాహుబలి సినిమాలోని శివగామి మాదిరి, తాను చెప్పిందే జరగాలని పట్టుబట్టిన అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ దెబ్బకు దిగిరాక తప్పలేదు. ముసాయిదా జిరాక్స్ కాపీల మీద సంతకాలు చేసినట్లుగా ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంపై పారిస్‌లో ట్రంప్ సంతకాలు చేశాడు. అదే మాదిరి టెహరాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాషికియన్ ఆ ప్రక్రియను పూర్తి చేయటంతో ముందుగానే ప్రకటిం చినట్లుగా శుక్రవారంనాడు అధికారికంగా అసలైన పత్రాలపై రెండుదేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారు! అరవై రోజుల తరువాత తుది ఒప్పందం ఖరారు అవుతుంది. ఒకవేళ ఆ తరువాత కలతలు తలెత్తితే అన్న ప్రశ్న ఎలాగూ ఉంటుంది. అలాంటిది జరగకూడదని యావత్ ప్రపంచంతో పాటు “నవతెలంగాణా” కూడా కోరుకుంటోంది.
అసలైన సినిమాను శుక్రవారం తరువాతే చూస్తాం. నువ్వది చేస్తే నేనిది చేస్తా అన్నట్లుగా అరవై రోజుల్లో జరగాల్సిన అంశాల మీద ఇరుపక్షాలూ కన్నేసి ఉంచు తాయి. ఒప్పందం మీద ఇరు దేశాల ప్రతినిధులు ముందుగానే సంతకాలు చేసిన తరువాత హార్ముజ్ జలసంధిలో నౌకలు స్వేచ్ఛగా అటూ ఇటూ తిరగటం ప్రారంభమైంది. అయితే ఎలక్ట్రానిక్ పద్ధతిలో ట్రంప్ సంతకాలు చేసిన తరువాత కూడా బుధవారం నాడు ఇజ్రాయిల్ మిలిటరీ లెబనాన్‌లో దాడులను కొనసాగించింది. ఒప్పందం ప్రకారం అవి కూడా నిలిచిపోవాలి. ఇజ్రాయిల్ ఉల్లంఘిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకమే. ఏప్రిల్ పదకొండున ప్రారంభమైన చర్చల ప్రక్రియ తొలి ఘట్టానికి గుర్తుగా తాజా ఒప్పందానికి “ అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ మధ్య కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం” పేరు పెట్టారు.
బుధవారం నాడు అమెరికా ఈ పత్రాన్ని బహిరంగంగా విడుదల చేసి మీడియాలో వచ్చిన వార్తలకు తెరదించింది.ఈ సందర్భంగా కూడా ఇరాన్ వ్యవహారం మంచిగా లేకపోతే అని అధికారులు దురహం కారాన్ని ప్రదర్శించారు. ఒప్పందంలో పద్నాలుగు అంశాలున్నాయి. లెబనాన్‌తో సహా అని ప్రాంతాలు, మిత్రులపై పరస్పర దాడులను నిలిపి వేయాలి. దేశాల సమగ్రత, సర్వసత్తాకతకు భంగం కలిగించకూడదు. అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు.హార్ముజ్ జలసంధి దిగ్బం ధనాన్ని అమెరికా ఎత్తివేస్తుంది. నౌకల సురక్షిత రవాణాకు ఇరాన్ జవాబు దారీగా ఉంటుంది. అరవై రోజుల వరకు వాణిజ్య నౌకలపై ఎలాంటి దారి సుంకం వసూలు చేయకూడదు. మిలిటరీ, సాంకేతిక ఆటంకాలన్నింటినీ తొలగిస్తుంది. ఆ ప్రాంత రవాణా నిర్వహణ భవిష్యత్ గురించి సంబంధిత దేశాలన్నిం టితో ఇరాన్ సంప్రదింపులు జరుపుతుంది. పరస్పర ఆమోదంతో ఇరాన్ పునరుద్దరణ, ఆర్థికవృద్ధికిగాను అమెరికా ప్రాంతీయ భాగస్వా ములతో కలసి 300 బిలియన్ డాలర్ల పథకాన్ని అమలు జరపాలి. అవసరమైన అనుమతులు, ఇతర ఆటంకా లన్నింటినీ అమెరికా అరవై రోజుల్లో ఖరారు చేయాలి. ఇరాన్‌పై అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలి. అణ్వాయుధాల సేకరణ లేదా అభివృద్ధిని ఇరాన్ చేపట్టకూడదు. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంపై పరస్పర ఆమోదంతో ఒక యంత్రాంగ ఏర్పాటు, ఒప్పందానికి రావాలి.అంతిమ నిర్ణయం జరిగే వరకు ఇరాన్ అణుకార్యక్రమంపై యథాతధ స్థితిని కొనసాగించాలి. స్తంభింపచేసిన ఇరాన్ నిధులు, ఆస్తులన్నింటినీ విడుదల చేయాలి. అంతిమ ఒప్పందానికి భద్రతా మండలి ఆమోదంతో ఇరుపక్షాలూ కట్టుబడి ఉండాలి.
ఈ ఒప్పంద అంశాలను చూసినపుడు ఇరాన్ తొలి నుంచీ చెబుతున్నవే మొత్తంగా ఉన్నాయి. కీలకమైన అణ్వాయుధాల తయారీ చేపట్టబోమని 1968లో ఇరాన్ అంగీకరించిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందానికి ఇంకా కట్టుబడే ఉంది తప్ప వైదొలగలేదు. కనుక వాటిని తయారు చేయబోమని చెప్పటం అమెరికా సాధించిన విజయమూ కాదు, టెహరాన్‌కు పరాజ యమూ కాదు. తమ మీద విధించిన అక్రమ ఆంక్షలకు ప్రతిగా అణు కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని ఇరాన్ నాయకత్వం తొలినుంచీ చెబుతోంది. వాటిని తొలగించేందుకు వాషింగ్టన్ అంగీకరించింది కనుక ఇప్పుడు ఎలాంటి వివాదమూ లేదు. 2015లో అమెరికా ఇలాంటి అంశాలతోనే ఒప్పందం చేసుకొని 2018లో ఏకపక్షంగా వైదొలిగి కొత్త ఆంక్షలు ప్రకటించింది గనుక రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది.
గత రెండున్నరేండ్లుగా ఇరాన్, గాజా, లెబనాన్‌ల మీద దాడులు చేస్తూ సాధించిందేమిటని నెతన్యాహును ఇప్పుడు ఇజ్రాయిలీలు ప్రశ్నిస్తున్నారు. అమెరికా నిర్దేశించిన దానికి తాన తందాన అంటూ ఇజ్రాయిల్ ప్రమేయం లేకుండానే ఒప్పందం కుదిరిందంటూ ధ్వజమెత్తుతున్నారు. రేపటి నుంచి డోనాల్డ్ ట్రంప్‌కూ అదే పరిస్థితి ఎదురుకానుంది. దాడుల ప్రారంభంలో అతగాడు చెప్పిన లక్ష్యాలలో ఒక్కటీ నెరవేరలేదు. తాము యుద్ధం ద్వారా కంటే దౌత్యపద్ధతుల్లోనే ఎక్కువ సాధించామని ఇరాన్ వ్యాఖ్యానించింది.పైకి చెప్పుకోలేని చోట ఇరాన్ కొట్టిన దెబ్బలకు ట్రంప్, నెతన్యాహు పరువు పోగొట్టుకున్నారు. స్నేహితులకు దూరమయ్యారు, సమర్ధించిన గల్ఫ్‌దేశాలు కూడా తీవ్ర అసంతప్తితో ఉన్నాయి. అక్టోబరులో జరిగే ఇజ్రాయిల్, నవంబరులో జరగనున్న అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో రెండుదేశాల అధికార పక్షాలకు అగ్నిపరీక్ష ఎదురుకానుంది.
ఇరాన్ దెబ్బకు దిగొచ్చిన ట్రంప్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


