ప్రజాకోణంలో ఆలోచించే ప్రత్యామ్నాయ
మీడియాకు ఇదో పెద్ద సవాల్
జర్నలిజాన్ని రాజకీయాలకు మేళవించటం ఎంహెచ్ ప్రత్యేకత
ఎంహెచ్ వర్థంతి సభలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రస్తుతం మీడియాలో ఎంటర్‌టైన్‌మెం ట్‌కు అధిక ప్రాధాన్యత పెరగడంతో నిజం కనుమరుగవుతోందనీ, ప్రజా కోణంలో ఆలోచించే ప్రత్యామ్నాయ మీడియాకు ఇదో పెద్ద సవాల్ అని ప్రజాశక్తి పూర్వ సంపాదకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. గురువారం హైదరా బాద్‌లోని నవతెలంగాణ కార్యాలయంలో ఎంహెచ్ 25వ వర్థంతి సభను నిర్వహించారు. అంతకు ముందు ఎంహెచ్ విగ్రహానికి పూలమాలలేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్, టెన్ టీవీ మాజీ ఎండీ వేణుగోపాల్, పలువురు జీఎమ్‌లు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ‘ప్రత్యామ్నాయ జర్నలిజం -సవాళ్లు ’అనే అంశంపై ఎడిటర్ రాంపల్లి రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో తెలకపల్లి రవి మాట్లాడారు. జర్నలిజాన్ని రాజకీయాలతో మేళవించటం మోటూరి హనుమంతరావు(ఎంహెచ్) ప్రత్యేకతని అన్నారు. ఎంహెచ్ మార్గాన్ని, జీవితాన్ని గుర్తు చేసుకోవటమంటే..జర్నలిజం వృత్తిలో నూతనోత్తేజాన్ని పొందటమేనని చెప్పారు. ఆయన అక్షరాల రూపశిల్పి, ఉద్యమాల మార్గదర్శి అని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదన్నారు. గతాన్ని, వర్తమానాన్ని ప్రజల కోణంలో చూపించటం వల్ల సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.
అయితే మారిన పరిస్థితుల్లో మీడియాలో వేగం పెరగటంతో అసలు విషయం పోయి కొసరు విషయం ప్రచారం పొందుతున్నదని అన్నారు. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. ఆకర్షణ, ఆకట్టుకోవటం, కట్టిపడేయటం దాని లక్షణంగా ఉంటోందన్నారు. దీంతో అసలు విషయం కనుమరుగవుతోందని చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ఎక్కువ పెరిగితే ఎమోషన్, ఎడ్యుకేషన్ అంతగా తగ్గుతాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అంతటా ఇదే జరుగుతోందని వివరించారు. ఫలితంగా మీడియాలో కమర్షియల్ విలువలు పెరుగుతున్నాయని తెలిపారు. మీడియాను మనం శాసిస్తున్నామా? మీడియా మనల్ని శాసిస్తున్నదా? అనేది ప్రశ్నగా మారిందని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు విశ్వసనీయత తక్కువ, విస్తృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇటీవల ఫ్రాన్స్‌లో ట్రంప్, మోడీ కలుసుకున్న సందర్భంలో భారత దేశంలో మోడీ ఉన్నంత కాలం దేశానికి నష్టం లేదనీ, తాను (ట్రంప్) ఉన్నంత కాలం ఫర్వాలేదని మాట్లాడుకున్న విషయాలకు ఇచ్చిన ప్రాధాన్యత హార్ముజ్‌లో నలుగు భారతీయులు మృతి చెందిన విషయానికి మీడియా ఇవ్వలేదని గుర్తు చేశారు. మీడియాపై కార్పొరేట్ల ఆధిపత్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిజం మసకబారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా ప్రజా కోణం నుంచి కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ..నిజం నిర్భయంగా రాయటం నిజమైన ప్రత్యామ్నాయం అవుతుందని తెలిపారు. టెన్ టీవీ మాజీ ఎండీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎంహెచ్ నిరాడంబరుడని కొనియాడారు.



