నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా నుంచి హైదరాబాద్‌కు వస్తూ టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తెలంగాణ యువతి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన బొక్క రాజశ్రీ ఆచూకీ లభ్యమయ్యేలా చొరవ చూపాలని తెలంగాణ ప్రభుత్వం ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ను కోరింది. రాజశ్రీ అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేసిన అనంతరం హ్యూస్టన్ నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. జూన్ 14న ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగిన ఆమె, అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌లో ప్రయాణించాల్సి ఉంది. అయితే, ఆమె ఆ విమానం ఎక్కలేదని తెలియడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
హ్యూస్టన్ నుంచి బయలుదేరే ముందు తల్లికి సందేశం పంపిన రాజశ్రీ, అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీల్‌ఛైర్ సహాయంతో ప్రయాణిస్తున్న ఆమె ఆచూకీపై విమానాశ్రయ అధికారుల నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఇటీవల తండ్రి మరణించడంతో రాజశ్రీ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ విషయాన్ని ఇస్తాంబుల్‌లోని భారత కాన్సులేట్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పోలీసులు, విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాజశ్రీని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని విన్నవించారు.



