నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. మూడు రోజుల పాటూ రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలగనుంది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమతి తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్, అనుబంధ ఆన్‌లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 26న మొహర్రం, 28న ఆదివారం కావడంతో ప్రభుత్వ సెలవులు వచ్చాయి.
ఈ నెల 27న పనిదినం.. ఆ ఒక్కరోజు రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి యథావిధిగా సేవలు పునఃప్రారంభమవుతాయని గాంధీ తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ షెడ్యూల్ రూపొందించామన్నారు. సర్వర్ నిర్వహణ ప్రక్రియతో పాటుగా ఆన్‌లైన్ వ్యవస్థలు మరింత సజావుగా పనిచేసేలా మూడు రోజుల పాటూ పనులు చేపడతామన్నారు. భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడం, సేవల్లో నాణ్యత మెరుగుపర్చడం కోసం నిర్వహణ పనులు చేయబోతున్నట్లు తెలిపారు.
దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సర్వర్ నిర్వహణ పనులు చేపడుతున్నారు. ప్రజలు ఈ షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన పనుల్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు.



