విద్య అనేది సమాజ వికాసానికి, సామాజిక సమానత్వానికి పునాది. కానీ, నేడు దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో విద్యావిధానం పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కి ఒక క్రూరమైన వ్యాపార వస్తువుగా మారిపోయింది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. పాలకవర్గాల ఉదాసీనత, చిత్తశుద్ధి లేమి కారణంగా ప్రయివేట్ విద్యావ్యవస్థ ఒక రక్కసిలా తయారై, ప్రభుత్వ విద్యారంగాన్ని కబలిస్తోంది. విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడం వల్ల ‘చదువు’కోవాల్సిన విద్యార్థులు, చదువు ‘కొనాల్సిన’ పరిస్థితి దాపురించింది. నేడు మండల స్థాయిలో వెలుస్తున్న కాన్వెంట్ స్కూళ్ల నుండి నగరాల్లోని భారీ ప్రయివేటు విశ్వవిద్యాలయాల వరకు అంతా లాభార్జనే ధ్యేయంగా సాగుతోంది. కార్పొరేట్ విద్యాసంస్థలకు మానవీయ విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం కంటే, విద్యార్థులను కేవలం ర్యాంకులు ఉత్పత్తి చేసే యంత్రాలుగా మార్చడమే పరమావధిగా తయారైంది. ర్యాంకుల వేటలో పడి అడ్డదారులు తొక్కడం, ప్రశ్నపత్రాల లీకేజీలు, నకిలీ సర్టిఫికెట్ల దందాలు సాగించడం బహిరంగ రహస్యంగా మారింది. ఈ కృత్రిమ ర్యాంకుల మాయాజాలంలో చిక్కుకున్న రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, సంపన్న వర్గాలు సైతం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత దిగజార్చుతున్న పరిస్థితి నెలకొంది.
మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం ఈ మాయాజాలానికి బలై, తమ రెక్కల కష్టాన్ని కార్పొరేట్ ఫీజుల రూపంలో ధారపోస్తున్నారు. ప్రభుత్వాలు డీఎస్సీల ద్వారా అర్హులైన ఉపాధ్యా యులను నియమిస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెబుతు న్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగించడంలో విఫల మవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి లేదా విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ఫీజుల నియంత్రణ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి తప్ప, దోపిడీని అరికట్టడంలో పాలక వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఏ సమాజంలోనైనా అందరికీ సమానమైన విద్యను అందించాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, పాలకులు విద్యకు కేటాయించే బడ్జెట్‌ను నిరంతరం తగ్గిస్తూ వస్తున్నారు. కొఠారి కమిషన్ వంటి నిపుణుల కమిటీలు దేశ జీడీపీలో కనీసం ఆరుశాతం విద్యకు కేటాయించాలని దశాబ్దాల క్రితమే సిఫార్సు చేసినప్పటికీ, నేటికీ ఆ లక్ష్యాన్ని ఏ ప్రభుత్వాలూ చేరలేదు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాల యాలలో కనీస మౌలిక వసతులు (ల్యాబ్‌లు, లైబ్రరీలు, భవనాలు) కరువై, అవి క్రమంగా మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. జ్ఞానాన్ని పెంపొం దించాల్సిన విద్యాసంస్థలు నేడు ‘లాభాల ఫ్యాక్టరీలు’గా మారిపోయాయి. దీనివల్ల నిరుపేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు పూర్తిగా దూరమవుతున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశంలో విద్య అనేది ‘ఉమ్మడి జాబితా’లో ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను కాల రాస్తూ, విద్యపై పూర్తి నియంత్రణను సాధించడానికి ప్రయత్నిస్తు న్నాయి. దీనివల్ల చరిత్రను వక్రీకరించడం, సైంటిఫిక్ టెంపర్ ను పూర్తిగా పక్కనబెట్టి మూఢనమ్మకాలను, నిర్దిష్ట మతపరమైన ఐడియాలజీని సిలబస్‌లో చొప్పించడం ద్వారా విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్నారు. చరిత్రలో శ్రామిక వర్గాల పోరాటా లు, ప్రజా ఉద్యమాల పాఠాలను తొల గించడం దీనికి నిదర్శనం. ఇదంతా కేంద్రం ప్రభుత్వం తీసుకున్న వచ్చిన ఎన్ఈపి లోనే భాగంగానే జరుగుతుంది. ఆ ఉచ్చులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం అత్యంత విషాదం. ఈ సంక్షోభం నుండి విద్యావ్యవస్థను రక్షించాలంటే సమూలమైన మార్పులు అవసరం. విద్య అనేది వ్యాపార సరుకు కాదు, అదొక సామాజిక బాధ్యత. అందుకే, ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీల వరకు సంపూర్ణ ఉచిత, నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రభుత్వమే నిర్మించాలి. విద్యా హక్కు చట్టాన్ని కేవలం పేరుకే కాకుండా పకడ్బందీగా అమలు చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా, సామాజిక సమానత్వం సాధించాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలనే చట్టపరమైన నిబంధనను తీసుకురావాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల నాణ్యత పెరుగుతుంది, వ్యవస్థపై పర్యవేక్షణ బలపడుతుంది.
జావెద్, 9059595483



