ఈ నెల 9న డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో చెల్లింపులు
నవతెలంగాణ-హైదరాబాద్
విశాఖ ఇండస్ట్రీస్ సంస్థకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) రూ.68.73 కోట్లు చెల్లించింది. ఈ మేరకు హెచ్‌సీఏ కెనరా బ్యాంక్ (దిల్‌సుఖ్‌నగర్) ఖాతా నుంచి డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో ఈ నెల 9న చెల్లింపులు జరిపారు. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున న్యాయస్థానంలో వాదించిన అడ్వకేట్ సంస్థ పేరిట డిడిలను కోర్టుకు సమర్పించారు. విశాఖ ఇండస్ట్రీస్ కు రూ.68.73 కోట్లు చెల్లించాలని హైదరాబాద్ వాణిజ్య వివాదాల ప్రత్యేక న్యాయస్థానం 2025 నవంబర్ 24న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.68,73,9,584 విలువ కలిగిన ఆరు డిడిలను న్యాయస్థానానికి అందజేశారు.
2011 నుంచి వివాదం : విశాఖ ఇండస్ట్రీస్ కు, హెచ్‌సీఏకు 2011 నుంచి వివాదం ఉంది. ఉప్పల్ స్టేడియంలో జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రకటనల ఆదాయం పూర్తిగా విశాఖ ఇండస్ట్రీస్ కు చెందేలా రూ.6.50 కోట్లు చెల్లించి, 2004 అక్టోబర్ 16న హెచ్‌సీఏతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఐపీఎల్ మ్యాచ్‌లకు వర్తించదని 2011 జులై 16న హెచ్‌సీఏ రద్దు చేసింది. ఒప్పందం రద్దును సవాల్ చేస్తూ విశాఖ సంస్థ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది.
విశాఖ ప్రయోజనాలను రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలిచ్చినా.. హెచ్‌సీఏ పట్టించుకోలేదు. సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హెచ్‌సీఏ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ రెండు చోట్లా హెచ్‌సీఏకు చుక్కెదురైంది. అనంతరం, వివాదకాలంలో వాటిల్లిన నష్టాన్ని చెల్లించాలని విశాఖ సంస్థ అర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. ట్రిబ్యునల్‌లో 2016 మార్చి 15న విశాఖ సంస్థకు అనుకూలంగా వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హెచ్‌సీఏ.. హైదరాబాద్ కమర్షియల్, వాణిజ్య వివాదాల కోర్టు సహా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. విశాఖ సంస్థతో మధ్యవర్తిత్వం జరిపేందుకు హెచ్‌సీఏ ఆసక్తి చూపినా.. ఆ దిశగా ముందడుగు పడలేదు.
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్ అనూహ్యంగా ఈ నెల 2న బాధ్యతలు స్వీకరించగా, వారం రోజుల వ్యవధిలోనే విశాఖ ఇండస్ట్రీస్ కు చెల్లింపులపై నిర్ణయం తీసుకోవటం గమనార్హం. 2023లో జరిగిన ఎన్నికల్లో అమర్‌నాథ్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోగా.. ఇటీవల అంబుడ్స్‌మన్ తీర్పుతో అమర్‌నాథ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్‌మోహన్ రావుపై వేటు పడగా.. కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి శ్రీనివాసరావు పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే.



